సైరెన్స్ ఆఫ్ సెప్టెంబర్’
Sirens of September
హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో, భారతదేశంలో విలీనం చేసిన సంఘటన చరిత్ర పుస్తకాల్లో ఒక అధ్యాయంగా మిగిలిపోయింది. అయితే ఆ కాలపు రాజకీయ కుట్రలు, రాజసిక జీవితం, వ్యక్తిగత సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, ఒక ప్రపంచం కళ్లముందే కూలిపోతున్న అనుభూతిని నవలగా ఆవిష్కరించారు రచయిత్రి జీనత్ ఖాన్. ఆమె తొలి నవల ‘ది సైరెన్స్ ఆఫ్ సెప్టెంబర్’ హైదరాబాద్ విలీనానికి దారితీసిన పరిణామాలను వాస్తవ, కల్పిత పాత్రల ద్వారా చెప్పే చారిత్రక నవల. 2017 వేసవిలో ముంబయి సముద్రం వెంబడి ఉన్న రహదారిపై నడుస్తున్నప్పుడు ఈ నవలకు సంబంధించిన ఆలోచన తనకు వచ్చిందని ఖాన్ చెబుతున్నారు. హైదరాబాద్ చరిత్రలోని ఆ ఘ ట్టంలో ఒక ఆసక్తికరమైన నవలకు అవసరమైన అన్ని అంశాలూ ఉన్నాయని ఆమెకు అనిపించింది. వైభవమైన రాజసౌధాలు, విభిన్న స్వభావాల వ్యక్తులు, రాజకీయ ఎత్తుగడలు, రహస్యా లు, పలు కారణాలతో మారిన నిర్ణయాలు వం టి అంశాలన్నీ కలసి ఒక ఉత్కంఠ భరితమైన కథకు నేపథ్యంగా నిలవగలవని ఆమె భావించా రు. ఈ నవల 1948లో హైదరాబాద్ సంస్థానంపై భారతదేశం చేపట్టిన సైనిక చర్యను, ఆ పరిణామాల్లో చిక్కుకున్న వ్యక్తుల జీవితాలను కేంద్రంగా చేసుకుంటుంది. భారత విభజనపై అనేక పుస్తకాలు, సినిమాలు వెలువడినప్పటికీ, అదే సమయంలో దక్షిణ భారతదేశంలో చోటుచేసుకున్న హైదరాబాద్ రాజకీయ పరిణామాలు మాత్రం ఎక్కువగా చరిత్ర, అకడమిక్ పరిశోధనలకే పరిమితమయ్యాయని ఖాన్ అభిప్రాయం. ఆమె దృష్టిలో ‘ది సైరెన్స్ ఆఫ్ సెప్టెంబర్’ ఒక కనుమరుగైన ప్రపంచం కథ. అమెరికా దక్షిణాది జీవనాన్ని చిత్రించిన ‘గాన్ విత్ ది విండ్’, సిసిలీ సమాజం పతనాన్ని ప్రతిబింబించిన ‘ది లెపర్డ్’ వంటి రచనల్లో కనిపించే గతకాలపు ప్రపంచం పట్ల నాస్టాల్జియా ఈ నవలలోనూ కనిపిస్తుందని ఆమె చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం కూలిపోతున్న సమయంలో అక్కడి జీవితం, ఆ సమాజంలోని వ్యక్తుల మనస్తత్వం, రాజకీయ అనిశ్చితిని పాఠకుడి ముందుకు తీసుకురావడమే తన ప్రయత్నమని అంటున్నారు. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పోలో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియకు కీలక మలుపుగా నిలిచింది. అయి తే ఈ నవల ఆ సంఘటనలను విజేతల దృష్టితో కాకుండా, ఓడిపోయిన పక్షం అనుభవించిన పరిణామాల కోణంలో చెబుతుంది. నవలలో ప్రధాన పాత్ర ఫరిష్తె. ఆమె 15 ఏళ్ల వయసున్న ఒక సంపన్న, కులీన కుటుంబానికి చెందిన యువతి. తన చుట్టూ ఉన్న ప్రపంచం రాజకీయ కల్లోలంలో కూరుకుపోతున్న సమయంలో ఆమె రాజకీయ కుట్రలు, అంతర్జాతీయ గూఢచర్యం, ఒక వైమానిక దళ క్యాడెట్తో దూర సంబంధం వంటి పరిణామాలను ఎదుర్కొంటుంది. ఫరిష్తె పాత్రను నవల కథాంశం పూర్తిగా రూపుదిద్దుకునే ముందే తన మనసులో సృష్టించుకున్నానని ఖాన్ చెబుతున్నారు. ఆదర్శవాది, తెలివైన, ధైర్యవంతమైన కులీన కుటుంబానికి చెందిన టీనేజ్ బాలికగా ఆమెను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నానని అంటున్నారు. నవలలోని పెద్దల పాత్రలకు భిన్నంగా ఫరిష్తె వ్యక్తిత్వం ఉంటుంది. అధికారంలో ఉన్న పెద్దలలో స్వార్థం, క్రూరత్వం, కుతంత్రం వంటి లక్షణాలు బలంగా కనిపిస్తాయి. చారిత్రక కల్పనా రచనను ఒక యువతి దృష్టికోణంలో రాయడం అంత సులభం కాలేదని ఖాన్ అంటారు. 1948 నాటి సామాజిక పరిస్థితుల్లో ఒక యువతికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. అయినప్పటికీ కథను మధ్యవయస్కులైన పురుషుల దృష్టితో మాత్రమే చెప్పి ఉంటే అది మరింత విషాదభరితంగా మారేది. ఎందుకంటే పరిస్థితులు తమ చేతుల్లోంచి జారిపోతున్నాయని ఆ కాలపు అధికారంలో ఉన్నవారికి తెలిసినా, వారు ఒక మునిగిపోతున్న నౌకను నడిపిస్తున్నట్టే పరిస్థితిని ఎదుర్కొన్నారన్న రచయిత్రి వ్యా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నవలా రచన కోసం ఖాన్ విస్తృతమైన పరిశోధన చేశారు. 1946 నుంచి 1948 మధ్య వెలువడిన తనకు అందుబాటులో ఉన్న పత్రికలను ఆమె పరిశీలించారు. అప్పటి వార్తలు, సామాజిక వాతావరణం, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పాత దృశ్యచిత్రాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పారు. 1940ల జీవనశైలిని పాఠకుడి ముందుకు సజీవంగా తీసుకురావడానికి ఆ కాలానికి సంబంధించిన పుస్తకాలు, సినిమాలు పరిశీలించారు. రవాణా, సమాచార వ్యవస్థ, దుస్తులు వంటి అంశాలపై కూడా ఆమె ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. జీవిత చరిత్రలు, జ్ఞాపకాల పుస్తకాలు, ప్రత్యక్ష అనుభవ కథనాలు, ముఖ్యంగా ఆ కాలాన్ని స్వ యంగా చూసిన కుటుంబ సభ్యుల అనుభవాలు తన పరిశోధనకు ఎంతో ఉపయోగపడ్డాయని ఖాన్ అంటారు. ఇలా చరిత్రలోని ఒక కీలక ఘట్టాన్ని కేవలం రాజకీయ లేదా సైనిక పరిణామంగా కాకుండా, ఒక ప్రపంచం కూలిపోతున్నప్పుడు అందులో జీవించిన వ్యక్తుల అనుభవాలుగా చెప్పే ప్ర యత్నమే ‘ది సైరెన్స్ ఆఫ్ సెప్టెంబర్’. వాస్తవ చరిత్రకు కల్పనను జోడించి, హైదరాబాద్ సంస్థానం చివరి దశను ఒక యువతి కళ్లతో చూపించడం ఈ నవలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.