Telangana Politics: కేసీఆర్ చావు డప్పు వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. బీఆర్ఎస్ నేతల అసభ్యకర వ్యాఖ్యల వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆవేదన..
Veerlapally Shankar
Telangana Politics: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసిన నేపథ్యంలో షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి చావును లేదా చెడును కోరుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆయన అంగీకరించారు. అయితే ప్రతిపక్ష నేతలు నిత్యం సభలోనూ, బయటా లక్ష్మణరేఖ దాటుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యల వల్లే తాను తీవ్ర మనస్తాపంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు.
శాసనసభలోనూ, బహిరంగ సభల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మహిళా మంత్రులను బీఆర్ఎస్ నేతలు అత్యంత అసభ్యకరంగా, కులాల పేరుతో దూషిస్తున్నారని శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల బూతులు వినలేక టీవీలు చూస్తున్న మహిళలు చెవులు మూసుకుంటున్నారని, బీఆర్ఎస్ నేతల తీరు చూసి వారి సొంత కుటుంబ సభ్యులు కూడా తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ వెంటనే సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని కోరే క్రమంలోనే.. ఆవేదనతో ఆ మాట అనాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలదని, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం కాదని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిని ఎమ్మెల్యే శంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఉద్దేశించి కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన వివాదాస్పద వీడియో క్లిప్పింగ్‌లను ఆయన మీడియా సమక్షంలో ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలపై అంతటి దిగజారుడు పదజాలాన్ని ఉపయోగించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు తమకు ప్రజాస్వామ్య సూత్రాలు, నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం పరాకాష్టకు చేరింది. షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ అని, ఆయన ఇంటి వద్ద వెయ్యి డప్పులు మాత్రమే కాకుండా అవసరమైతే ‘చావు డప్పు’ కూడా కొడతామంటూ శంకర్ వ్యాఖ్యానించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి మరణాన్ని కోరుకునేలా మాట్లాడటంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు ఆయన సొంత మాటలు కాదని, సీఎం రేవంత్ రెడ్డి పంపిన ముందస్తు స్క్రిప్ట్ అని ఆరోపించారు. కేసీఆర్ ప్రాణాలకు హాని కోరే విధంగా మాట్లాడించడం కాంగ్రెస్ నేతల కుట్రలో భాగమని మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలను, ఇప్పుడు శంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. శంకర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
మరోవైపు, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీర్లపల్లి శంకర్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహానిని కోరుకుంటూ మాట్లాడిన ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
- AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్.. పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల..
- Pinarayi Vijayan: బాత్రూమ్లోకి కూడా నాతో వస్తారా.. మీడియాపై పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు..
- Telangana Politics: కేసీఆర్ చావు డప్పు వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. బీఆర్ఎస్ నేతల అసభ్యకర వ్యాఖ్యల వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆవేదన..
- Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో బ్యాంక్ పనులు ఉంటే జాగ్రత్త..
- Telangana PRC Update: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PRCపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు..