Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial on Elnino: ఎల్‌నినో ఉపద్రవ కాలంలో వివాదం కన్నా విజ్ఞత ముఖ్యం

Prajapaksham 06 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial on Elnino: ఎల్‌నినో ఉపద్రవ కాలంలో వివాదం కన్నా విజ్ఞత ముఖ్యం

Super El Niño Warning: 2027 Could Rewrite Earth's Heat Records

Editorial on Elnino: రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధిపొందటానికి ఈ వర్షపాతం కొరత సంవత్సరాల్లోనే రైతులను ముందుపెట్టి పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు విడుదల చేయాలంటూ ఆందోళనలు చేపడుతుంటాయి. ఈ సంవత్సరం పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం వాతావరణ మార్పులకు తోడై ప్రపంచంలోని చాలా దేశాలను గడగడలాడిస్తున్నది.

Editorial on Elnino: ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయినా నదీజలాల పంపిణీ వివాదం కొనసాగటానికి అనేక కారణాలున్నాయి. ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో కేసులు కొలిక్కిరాకపోవటం ప్రధాన కారణమనవచ్చు. ముఖ్యంగా కృష్ణానదీ జలాల పంపిణీ వాటాలపై ఎడతెగని వివాదం ఉంది. కృష్ణా నదీ ప్రాజెక్టు, యాజమాన్యం, ముఖ్యంగా నీటి వినియోగం పర్యవేక్షణకు కేంద్ర జలసంఘం రెండు నదులకు వేర్వేరు మేనేజిమెంట్‌ బోర్డులు ఏర్పాటు చేసింది. వర్షాలు సమృద్ధిగా ఉన్న సంవత్సరాల్లో అంతా సామరస్యంగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కొరత కాలంలోనే ఇబ్బందులన్నీ. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధిపొందటానికి ఈ వర్షపాతం కొరత సంవత్సరాల్లోనే రైతులను ముందుపెట్టి పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు విడుదల చేయాలంటూ ఆందోళనలు చేపడుతుంటాయి. ఈ సంవత్సరం పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం వాతావరణ మార్పులకు తోడై ప్రపంచంలోని చాలా దేశాలను గడగడలాడిస్తున్నది.

యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి శీతల దేశాల్లో ఎండవేడిమి తీవ్రమై దాన్ని తట్టుకోలేక వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని దేశాల్లో కార్చిచ్చు ప్రాణాంతకమవుతున్నది. మన పక్కనే నేపాల్‌లో మంచు పర్వతాలు కరిగి మంచు సరస్సుల్లో పడి జలప్రళయంగా మారి బీభత్సం సృష్టించాయి. మన సువిశాల దేశంలో రుతుపవనాలు వర్షించే స్థితిలో ఎంతో వ్యత్యాసం చూస్తున్నాం. రానున్న రోజుల్లో వాయవ్య, ఈశాన్య, తూర్పు, తూర్పు మధ్య భారత్‌, ఆగ్నేయ భారత్‌లో సాధారణ, అంతకన్నా కొంత ఎక్కువ వర్షపాతం పడే అవకాశముంది. కాగా మిగతా భారత్‌, దక్షిణ భారత్‌లో వర్షపాతం సాధారణంకన్నా తక్కువ ఉంటుంది. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఫిబ్రవరి వరకు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తల అంచనా. ఏప్రిల్‌ మాసాలు ఎలాగూ వేసవికాలం. కాబట్టి 2027 ఆగస్టు వరకు బెట్ట వాతావరణం ఊహించవచ్చు.

ఈ ఆగస్టు 31 నాటికి దేశం మొత్తంమీద వర్షపాతం సాధారణం కన్నా 14 శాతం తక్కువ పడింది. ఆగస్టులో మధ్యభారత్‌లో మిగులు వర్షం కురియగా వాయవ్యం, తూర్పు, ఈశాన్యం, దక్షిణ భారత్‌లో లోటు నమోదైంది. గడచిన ఆగస్టు మాసంలో ఉష్ణోగ్రత 1901 తర్వాత అతివేడి రికార్డు అయింది. సాధారణంగా జూన్‌ తొలకరి వర్షాల్లో ఐదవ వంతు సెప్టెంబర్‌లో కురుస్తుంది. కాని ఈ సంవత్సరం ఈ మాసంలో వర్షపాతంలో కనీసం 9 శాతం తగ్గుదల ఉంటుందని భారత వాతావరణ డిపార్ట్‌మెంట్‌ (ఐఎండీ) అంచనా వేసింది. దీన్నిబట్టి వ్యవసాయం, తాగునీరు, పశుగ్రాసం, ఆహార పంటలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావాన్ని ఊహించుకోవచ్చు.

ఈ ప్రపంచ, భారతదేశ వాతావరణ జోస్యాల నేపథ్యంలో, తరుముకొస్తున్న ఎల్‌నినో దుష్ప్రభావాన్ని తట్టుకునేందుకు రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని మానవ జాతి మనుగడకు అత్యంతావశ్యకమైన త్రాగునీటి అవసరాలకోసం భద్రపరుచుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి. కృష్ణానదీ జలాల వాటాలు, వినియోగంపై కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ ఇప్పటికి రెండుసార్లు సమావేశమైనా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. శుక్రవారం నాటి సమావేశంలో కూడా ఆంధ్ర, తెలంగాణ ముఖ్య ఇంజినీర్లు పాత వాదనలే వినిపించారు. దాంతో, కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు 21వ పూర్తిస్థాయి సమావేశానికి సమస్యను నివేదిద్దామని సభ్య కార్యదర్శి సూచించారు. ఈలోపు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిని త్రాగునీటి అవసరాలకే రెండు రాష్ట్రాలు వినియోగించుకోవాలని కోరారు. శ్రీశైలం ఎడమగట్టున విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను బాగా తగ్గించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

లభ్యతలోని నీటిని రెండు రాష్ట్రాల మధ్య 50:50 దామాషాలో పంపిణీ చేయాలని కోరిన తెలంగాణ అధికారులు 2026 సెప్టెంబర్‌ నుంచి 2027 ఆగస్టు వరకు త్రాగునీటి అవసరాలకు 46 టీఎంసీలతోపాటు తమకు 200 టీఎంసీలు అవసరమని తెలియచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటివిడుదలను ఆపాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ అధికారులు 2026 సెప్టెంబర్‌ నుంచి 2027 ఆగస్టు వరకు ఫీడర్‌ నీటి చెరువులు నింపడానికి, కాల్వల ద్వారా త్రాగునీటి సరఫరా నిమిత్తం లెవల్‌ మెయింటైన్‌ చేయటానికీ తమకు 104 టీఎంసీలు అవసరమని నివేదిక సమర్పించారు. ఉమ్మడి రిజర్వాయర్లలో 2026 సెప్టెంబర్‌ 3న నిల్వ ఉన్న నీటి ప్రకారం, 66:34 దామాషాలో తమకు 97.41 టీఎంసీలు రావాలని చెప్పారు.

సభ్య కార్యదర్శి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014, షెడ్యూల్‌ XIIలోని 2, 3 పేరాలను చదివి వినిపించి రెండు రాష్ట్రాలు వాటికి నిబద్ధులై ఉండాలన్నారు. ఆ పేరాలు ఇలా చెబుతున్నాయి: “ఇరిగేషన్‌, విద్యుచ్ఛక్తికి నీటి వినియోగ డిమాండ్‌లో వివాదం ఉన్నప్పుడు ఇరిగేషన్‌ ప్రాధాన్యత వహిస్తుంది. ఇరిగేషన్‌, త్రాగునీటి అవసరాల డిమాండ్‌లో వివాదం ఉన్నప్పుడు త్రాగునీరు ప్రాధాన్యం వహిస్తుంది”. ఇదే ఎల్‌నినో కాలంలో శిరసావహించాల్సిన మార్గదర్శక సూత్రం.