Allari Naresh interview Exclusive: ఆడియన్స్ కామెడీని చూసే విధానం మారింది…’ప్రజాపక్షం’ ఇంటర్వ్యూలో హీరో అల్లరి నరేష్
‘అల్లరి’ సినిమాతో అనుకోకుండా హీరోగా మారిన నరేష్, అప్పటి నుంచి అందరిచేత ‘అల్లరి నరేష్’గానే పిలవబడుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన కుర్ర హీరోల్లో అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు పూర్తి చేసిన ఏకైక నటుడు అల్లరి నరేష్. ఇటీవల ‘ప్రజాపక్షం’ కోసం అల్లరి నరేష్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.
Allari Naresh interview Exclusive: తెలుగు తెరపై హాస్య చిత్రాలు పండించడంలో జంధ్యాల తరువాత వెంటనే వచ్చే పేరు ఇ.వి.వి. సత్యనారాయణ. ఇ.వి.వి. కామెడీ సినిమాలు తీయడంలో ఎంత ఘనుడో, కామెడీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో ఇ.వి.వి. వారసుడు అల్లరి నరేష్ అంతే ఘనుడు. ‘అల్లరి’ సినిమాతో అనుకోకుండా హీరోగా మారిన నరేష్, అప్పటి నుంచి అందరిచేత ‘అల్లరి నరేష్’గానే పిలవబడుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన కుర్ర హీరోల్లో అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు పూర్తి చేసిన ఏకైక నటుడు అల్లరి నరేష్. ఇటీవల ‘ప్రజాపక్షం’ కోసం అల్లరి నరేష్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.
ప్రశ్న : ‘అల్లరి’ సినిమాతో అల్లరి నరేష్‌గా మారిపోయిన మీరు మొదటి సినిమా అనుభూతిని చెప్తారా?
నరేష్ : నేను ఎలా సినిమా రంగంలోకి వచ్చానో మీ అందరికీ తెలుసు.. ప్రేక్షకులకు కూడా తెలుసు. మా నాన్నగారు ఇ.వి.వి. సత్యనారాయణ గారు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు. చిన్నప్పటి నుంచే నాకు షూటింగ్స్ అలవాటు. రవిబాబు, నేను రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం. ఒకరోజు ‘అల్లరి’ సినిమా గురించి చెప్పారు. చేసేద్దాం అన్నారు… చేశాను. సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ అందరూ నన్ను ‘అల్లరి నరేష్’ అని అంటారు, మీకు తెలిసిందే కదా.
ప్రశ్న : అతి తక్కువ సమయంలో కెరీర్లో యాభై సినిమాలు పూర్తి చేశారు, ఏమనిపిస్తోంది?
నరేష్ : చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను ప్లాన్ చేసి చేసినవేమీ కావు. అలా ఆఫర్లు వచ్చాయి, మంచి కథలు వచ్చాయి. చేసుకుంటూ వెళ్ళాను… యాభై దాటిపోయాయి.
ప్రశ్న : ‘నాంది’తో మీ జానర్ నుంచి బయటికి వచ్చారు? కారణం?
నరేష్ : ‘నాంది’ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు విజయ్ కనకమేడల చాలా బాగా తీశాడు. మంచి క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా ఇది. అందరూ బాగా ఆదరించారు. అప్పటి వరకు కామెడీ సినిమాల్లోనే చూసిన నన్ను, ప్రేక్షకులు ‘నాంది’లో కొత్త నరేషన్లో చూశారు. ఆ తరువాత కూడా కొన్ని సీరియస్ క్యారెక్టర్లు చేశాను. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని కావు. కానీ ‘నాంది’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.
ప్రశ్న : మళ్ళీ మీ కామెడీ జానర్‌కి వచ్చినట్టున్నారు? కామెడీ సినిమాలను ఆదరిస్తారా?
నరేష్ : నిజానికి ఆడియన్స్ కామెడీని చూసే విధానం మారింది. నా బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే కామెడీని డైరెక్టర్ డిజైన్ చేశారు. అలాగే స్వర్గం, నరకం, ఇంద్రలోకం… ఇలాంటి కథలు చూసి చాలా కాలం అయింది. ఆడియన్స్, అలాగే చిన్నపిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. చాలా క్లీన్ కామెడీ ఇందులో ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా కామెడీ సినిమాలు ఉంటాయి. కామెడీ కూడా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ డార్క్ జోన్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులు లైట్ హార్టెడ్‌గా ఉండే కామెడీ సినిమాలు, ఎంటర్టైనర్స్ కోరుకుంటున్నారు. ఇకపై నేను కూడా రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా… ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తున్నాను.
ప్రశ్న : దర్శకత్వం చేయాలని ఆలోచన ఉందా?
నరేష్ : ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం నటనపైనే ఉంది. నటుడిగా మంచి విజయవంతమైన చిత్రాలు చేయడం పైన నా దృష్టి ఉంది. కానీ తప్పకుండా ముందస్తుగా ఆలోచించి ఏదో ఒక రోజు డైరెక్షన్ చేస్తాను. (ప్రస్తుతం నటన మీదే దృష్టి)
ప్రశ్న : ‘సుడిగాడు 2’ సీక్వెల్ ఎప్పుడు?
నరేష్ : ‘సుడిగాడు 2’ చేయాలని నాకూ ఉంది. కాకపోతే ఒకప్పటి పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి చాలా మార్పులు వచ్చాయి. ‘సుడిగాడు’ సినిమాకి దాదాపు 108 స్పూఫ్‌లు చేశాము. అవన్నీ కూడా ఆయా డైరెక్టర్లు, నిర్మాతల పర్మిషన్ తీసుకుని చేశాం. కాకపోతే ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. రిలీజ్ సమయంలో ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్తారో, ఎలాంటి కాపీరైట్ ఇష్యూ వస్తుందో అనేది మన చేతిలో ఉండదు. అందుకే చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న : ఇప్పటి యంగ్ డైరెక్టర్స్‌లో ఎవరితో సినిమా చేయాలని ఉంది?
నరేష్ : నాకు రితేష్ రానా స్టైల్ చాలా నచ్చింది. ‘మత్తు వదలరా’ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన కథల్లో వివరాలు (డీటెయిలింగ్) చాలా బాగుంటాయి. కాంటెంపరరీగా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ముందుకు తీసుకొస్తారు. అలాగే తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్‌తో కూడా పని చేయాలని ఉంది.
ప్రశ్న : ‘మహర్షి’ తర్వాత మీ నుంచి ఎక్కువగా మల్టీస్టారర్లు రాలేదనిపిస్తుంది?
నరేష్ : ‘శంభో శివ శంభో’ నుంచి మల్టీస్టారర్ కథలలో చేస్తున్నాను. అలాంటి మంచి కథలతో దర్శకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ‘మహర్షి’ తర్వాత ‘నా సామి రంగా’లో నాగార్జున గారే నా పేరుని సూచించారు. ఆ సినిమా చేశాను. మంచి కథలు వస్తే మల్టీస్టారర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రశ్న : రాబోయే సినిమాల గురించి చెప్పండి?
నరేష్ : ‘ఆల్కహాల్’ రిలీజ్‌కి రెడీగా ఉంది. అలాగే ‘కనకదుర్గ’ షూటింగ్ జరుగుతోంది. ఇంకా కొన్ని కథలు వింటున్నాను.