Skip to content
తెలంగాణ వార్తలు

All India Trade Union Congress – AITUC: కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమిస్తున్న ఏఐటియుసి

Prajapaksham 06 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
All India Trade Union Congress – AITUC: కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమిస్తున్న ఏఐటియుసి

AITUC

AITUC: ఏఐటియుసి రాష్ట్ర 4వ మహాసభలకు కరీంనగర్‌ జిల్లా ఆతిథ్యమిస్తున్నది. నేటి నుంచి కరీంనగర్‌లో మూడు రోజులు (సెప్టెంబర్‌ 6, 7, 8 తేదీలలో) మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 6న కరీంనగర్‌ పట్టణంలో భారీ కార్మిక ప్రదర్శన జరుగనున్నది.

AITUC: గత మహాసభ నుంచి నేటివరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కార్మికవర్గం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చేపట్టిన ఉద్యమ కార్యాచరణలను సమీక్షిస్తూ, తక్షణ కర్తవ్యాలతో ముందుకు పోవాల్సిన కార్యాచరణకు రూపకల్పన జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. తెలంగాణలోనే 3వ పెద్ద నగరం కరీంనగర్‌. మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2014లో ఏర్పడింది. గోదావరి ఉపనది అయిన మానేరు నది ఒడ్డున ఉన్నది. తెలంగాణ ఉత్తర జిల్లాలకు ప్రధానంగా విద్య, ఆరోగ్య కేంద్రంగా పనిచేస్తున్నది.

జిల్లా గుండా గోదావరి ఉపనదులైన మానేరు, మున్నేరు నదులు ప్రవహించటంతో వాటిపై చేపట్టిన నీటి ప్రాజెక్టులైన మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, శ్రీరామ్‌ సాగర్‌ రెండవ దశ, శ్రీరాంసాగర్‌ వరద కాలువ ద్వారా ఉమ్మడి జిల్లాలో 20 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతూ, వరిసేద్యానికి ధాన్యాగారంగా పేరొందిన జిల్లా. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, చెరుకు పంటలకు ప్రసిద్ధి.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన రైస్‌ మిల్లులతోపాటు విత్తనశుద్ధి కేంద్రాలైన నూజివీడు సీడ్స్‌, కావేరి సీడ్స్‌, స్నేహ సీడ్స్‌, హరిత బయో కెమికల్స్‌తోపాటు రామగుండంలో సిమెంటు, ఎరువులు, బొగ్గు గనుల క్షేత్రమైన గోదావరిఖని, సిటీ ఆఫ్‌ గ్రానైట్స్‌గా కంపెనీలకు ప్రసిద్ధి. చేనేతకు, పవర్‌ లూమ్స్‌కు సిరిసిల్ల ప్రసిద్ధి. బీడీ పరిశ్రమ జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల ప్రాంతాలలో విలేజ్‌ పరిశ్రమగా వెలుగొందుతుంది.

ప్రసిద్ధ దేవాలయాలైన వేములవాడ, ధర్మపురి, కొండగట్టు యాత్రా స్థలాలు ఉన్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయంతో పాటు, మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు నెలకొల్పబడి విద్యాభివృద్ధిలో ముందున్నది. వివిధ సంస్థలలో సంఘటిత, అసంఘటిత రంగాలలో లక్షలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు.

గత మహాసభ నుంచి నేటివరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కార్మికవర్గం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చేపట్టిన ఉద్యమ కార్యాచరణలను సమీక్షిస్తూ, ప్రస్తుత కర్తవ్యాలతో ముందుకు పోవలసిన అవసరం ఉన్నది. మూడున్నర సంవత్సరాలలో నిర్వహించిన పోరాటాలు, సాధించిన విజయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, ప్రస్తుతం కార్మిక వర్గం ముందున్న తక్షణ కర్తవ్యాలపై చర్చించి భవిష్యత్‌ కార్యక్రమాన్ని ఈ మహాసభలో రూపొందించుకోవడం జరుగుతుంది.

భారతదేశంలో 1920లోనే ఏఐటియుసి స్థాపించుకోని, బ్రిటిష్‌ పాలనలోనే 1926లో ట్రేడ్‌ యూనియన్‌ చట్టం సాధించుకున్నప్పటికీ, హైదరాబాద్‌ రాష్ట్రం నిజాం రాచరిక పాలనలో ఉండటంతో కార్మిక సంఘాలపైన, ఉద్యమాలపైన నిషేధం, రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఉండటంతో దేశంలో జరుగుతున్న కార్మికోద్యమాల వెలుగులో చాలా ఆలస్యంగా హైదరాబాద్‌ రాష్ట్రంలో ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలు మొదలైనాయి.

హైదరాబాద్‌లో కార్మిక సంఘాల విస్తరణ

1920లో సికింద్రాబాద్‌లో క్యాలెండర్స్‌ కంపెనీ వర్కర్స్‌ యూనియన్‌, 1937లో సికింద్రాబాద్‌లో రైల్వే వర్క్‌షాప్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఔరంగాబాద్‌లో బట్టల మిల్లు వర్కర్స్‌ యూనియన్‌ ఏర్పడినవి. 1941లో వరంగల్లు ఆజం జాహీ బట్టల మిల్లు, హైదరాబాద్‌లో డీబీఆర్‌ మిల్లు, చార్మినార్‌ సిగరెట్స్‌, గాజు, పింగాణి పరిశ్రమలు రావడంతో సంఘాలు ఏర్పాటు అయ్యాయి.

1942లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ మొదలగు కార్మిక సంఘాలు ఏర్పాటుకు ప్రధాన పాత్ర వహించిన దేవూరి శేషగిరిరావు, మఖ్దూం మొహియుద్దీన్‌, డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌ గౌర్‌, టి.బి. విఠల్‌రావు, కే.ఎల్‌. మహేంద్ర, సర్వదేవభట్ల రామనాథం మొదలగువారు కార్మిక సంఘాలు ఏర్పాటుకు కృషి చేశారు.

హైదరాబాద్‌ రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్నీ ఏకమై ‘ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌’ను 1941లో ఏర్పాటు చేసుకున్నాయి. 1946 ఆగస్టులో ఏహెచ్‌టీయూసీ ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటియుసి)లో విలీనమైంది. ఆ తర్వాత క్రమక్రమంగా హైదరాబాద్‌ రాష్ట్రంలో కార్మిక సంఘాలు ఏర్పడినవి.

నేడు కార్మిక వర్గంపై ఉన్న కర్తవ్యం

కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అచ్చే దిన్‌ (మంచి రోజులు) రాబోతున్నాయని అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌’ అనే నినాదాన్ని తమ ప్రచార పటాటోపానికి వాడుకున్నారే తప్ప, ఏనాడూ పాటించలేదు.

న్యూ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌, కర్తవ్య కాల్‌, అమృత్‌ కాల్‌, శ్రేష్ఠ భారత్‌, వికసిత్‌ భారత్‌ వంటి రకరకాల ఆకర్షణీయమైన పేర్లతో, నినాదాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం తప్ప వాటి స్ఫూర్తిని చిత్తశుద్ధితో అందిపుచ్చుకున్నదీ లేదు.

భారతదేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సమూలంగా మార్చుటకు నిర్ణయించి, కోవిడ్‌ టైంలో పార్లమెంటులో చర్చలు జరపకుండా నాలుగు కోడ్‌లను ఏకపక్షంగా ఆమోదించుకోవడం జరిగింది.

ప్రస్తుతమున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను పెట్టుబడిదారీ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా నాలుగు కోడ్‌లుగా విభజించి నీరుగార్చటం జరిగింది. ఇందులో మరీ ముఖ్యంగా కార్మిక యూనియన్ల రిజిస్ట్రేషన్లు, పారిశ్రామిక వివాదాల పరిష్కారాన్ని కఠినతరం చేయటమేగాక, 8 గంటల పని విధానాన్ని యజమాన్యానికి అనుకూలంగా రూపొందించుకొనుటకు వీలు కల్పించడం జరిగింది.

వీటికి వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా ఎన్డీఏ-బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు (సీటీయూలు) దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టడం జరిగింది.

దేశ ప్రజల ఆస్తులతో నిర్మించుకున్న విమాన, రవాణా, రైల్వే, నౌక, ఆయిల్‌, బొగ్గు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలను మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పటం జరుగుతున్నది. ఈ సంస్థలు దేశ స్వయం సమృద్ధి కోసం నిర్మించుకున్నవి. ప్రజల ఆస్తులు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్తున్నారు.

బ్యాంకులను కుదించటం, ఇన్సూరెన్స్‌ సంస్థలను ప్రైవేటీకరించడం, ఎయిర్‌ ఇండియాను టాటాలకు అమ్మటం, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రైతుల పట్టువిడవని ఆందోళనతో ఉపసంహరించుకున్నప్పటికీ, పంటలకు కనీస మద్దతు ధరకు లీగల్‌ గ్యారంటీ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేయటం దేశానికి పెద్ద ప్రమాదం.

బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం వల్ల దేశానికి ఏం ఒరిగింది? గత పదేళ్ల పాలనలో అంటే.. అధిక ధరలు, అన్నదాతల అక్రందనలు, అన్యాయపు చట్టాలు, అసమానతలు పెరగడం, ఆకలి కేకలు, అవినీతి కోరలు, ఆర్థిక వైఫల్యాలు, అరాచక పాలన, అబద్ధాల హోరు, అప్పుల జోరు, అధికార కేంద్రీకరణ, అస్తవ్యస్త నిర్ణయాలు, అప్రజాస్వామిక పోకడలు, అభద్రతాభావం. అందుకే కాదు అమృతకాలం కాదు ఆపత్కాలం!

రైతుల ఆదాయాలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నది. కార్మిక హక్కులపై దాడులు పెరుగుతున్నాయి.

ఈ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని 2023 నవంబర్‌ 26న, 2024లోను, 2025 మే 29న, తిరిగి 2026 ఫిబ్రవరి 12న కార్మికులు, రైతులు దేశవ్యాప్త చరిత్రాత్మక సార్వత్రిక సమ్మెతో నిరసనలు తెలపటం జరిగింది.

రాష్ట్రంలో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన తదుపరి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆశల మేరకు, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అందించకపోవటం పట్ల అసంతృప్తితో ఓటర్లు 2023 డిసెంబర్‌ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించి.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల తొమ్మిది మాసాలు అవుతున్నప్పటికీ, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగ కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను అమలుపరచటంలో గత ప్రభుత్వ సాచివేత విధానాలనే అవలంబిస్తున్నది.

గత ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక సంఘాలపై నిరంకుశమైన విధానాలు చేపట్టింది. చివరికి కార్మిక యూనియన్లపై నిర్బంధాలను కొనసాగించింది. యూనియన్లను గుర్తించకుండా, ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికలు నిర్వహించకుండా ఒక నియంత విధానం అమలు చేసింది.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే యూనియన్లను నిషేధించింది. సింగరేణిలో ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేసింది. అంగన్వాడీ వర్కర్లకు పనిభారం మోపి సంఘాల నాయకులపై నిర్బంధాలను పెట్టింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలను అమలుచేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది.

నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగ, కార్మికులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

అందులో ముఖ్యమైనవి ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. కనీస జీవనవేతన విధానాన్ని రూ.26 వేలు అమలు చేయాలి. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దుచేసి రెగ్యులర్‌ ఉద్యోగ విధానాన్ని చేపట్టాలి. షెడ్యూల్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ చేపట్టాలి.

ఓల్డ్‌ పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందించే సదుపాయాలు పెంచాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆదుకొనుటకు నెలకు రూ.2 వేలు, గిగ్‌ వర్కర్ల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి.

మూడో వేతన సవరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, స్కీం వర్కర్స్‌కు ఉద్యోగ గుర్తింపు మొదలగు వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఏఐటియుసి డిమాండ్‌ చేస్తున్నది.