Skip to content
జాతీయం వార్తలు

యుద్ధాల కంటే ప్రమాదం…కాలుష్యం

Prajapaksham 03 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
యుద్ధాల కంటే ప్రమాదం…కాలుష్యం

Pollution

సుంకవల్లి సత్తిరాజు

ఎల్‌ నినో ప్రభావం వలన మన దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలను అధ్యయనం చేసి విరుగు కనిపెట్టవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది. వర్తమాన ప్రపంచంలో కాలు ష్యం ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో కాలుష్యాన్ని కనీస స్థాయికి తగ్గించాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావర ణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఎన్నో అవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్‌, ఫిన్లాండ్‌, న్యూజిలాండ్‌, ఐస్‌లాండ్‌, డెన్మార్క్‌, యు.కె, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్‌ గ్రీనెస్ట్‌ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్‌, నైజర్‌, గ్రీన్‌లాండ్‌ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాల నుండి కాపాడడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం,పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. కాలుష్యాన్ని అరికట్టవచ్చు.
పచ్చదనమే కాలుష్యానికి విరుగుడన్న అవగాహన ప్రజల్లో కలగాలి. పర్యావరణం శరవేగంగా విధ్యంసమౌతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని కాలుష్యమనే భూతం వెంటాడుతూనే ఉంది. పెను ప్రమాదం మన ముంగిట్లోనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన పర్యావరణాన్ని మానవ స్వార్ధంతో, తప్పిదాలతో విధ్వంసం చేస్తున్నాం. కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్య పు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన,పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి గ్రీన్‌ హౌస్‌ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమౌతుంది.
భూఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు. కాలుష్యం మధ్య జీవిస్తూ,కలుషితాలను ఆరగిస్తూ, సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. భూమండలంలో నివసిస్తున్న జీవరాశులు, ఇతర భౌతిక,రసాయనిక సంబంధిత పదార్ధాలన్నీ మానవాళి చేత సృష్టించబడలేదు. ఇవన్నీ సహజసిద్ధంగా ఏర్పడి మన చుట్టూ ఆవరించబడి ఉన్నాయి. మానవాళి మనుగడకు మూలాధారమైన ధరిత్రి పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే కాలుష్యాన్ని పారద్రోలాలి. ఇప్పటికే కాలుష్యం వలన మానవాళి ఆరోగ్యం పడకేసింది. ప్రకృతి ప్రకోపించింది. పర్యావరణ విధ్వంసంతో మానవ జీవనం అల్లకల్లోలంగా మారిపోయింది. ప్రపంచంలోను, భారత్‌లోను ఆకస్మాత్తుగా ప్రకృతి ప్రళయాలు సంభవిస్తున్నాయి. రుతురాగాలు అపస్వరాలు వినిపిస్తున్నాయి.
అరణ్యాలు స్థానభ్రంశం చెంది కాంక్రీటు కట్టడాలతో ఆధునిక అరణ్యాలుగా రూపాంతరం చెందుతున్నాయి. సహజ సిద్ధమైన జీవన శైలి నశించింది. భూమిపై మనం వినియోగించే ప్రతీ వస్తువు కాలుష్యానికి కారణభూతం కావడం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితులనుండి మానవాళిని కాపాడడానికి పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మార్గం.పర్యావరణ వ్యవస్థను పచ్చదనంతో పునః ప్రతిష్ఠించడానికి ప్రపంచ దేశాలన్నీ చిత్తశుద్ధితో ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలి. మన నిత్య జీవితంలో ఇంధనాల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంధనం లేనిదే జన జీవితం దుర్భరం- దుర్లభం. అయితే మితిమీరిన ఇంధనాల వాడకం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న కాలుష్య సంబంధి త సమస్యలకు మూలం శిలాజ ఇంధనాల వాడకం విపరీతం గా పెరగడమే. సౌరశక్తి వాడకంపై దృష్టి సారించకుండా శిలాజ ఇంధనాల వినియోగం అధికం చేయడం పర్యావరణానికి పెద్ద దెబ్బ. ఇప్పుడిప్పుడే ‘క్లీన్‌ ఎనర్జీ‘ పై దృష్టి సారిస్తున్న దేశాలను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలి. బాధ్యతారాహిత్యంగా శిలాజ ఇంధనాలను వినియోగిస్తే ప్రపంచం అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలను రెండు డిగ్రీల సెల్సియన్‌ దిగువ స్థాయికి తగ్గించడం, సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కి పరిమితి చేయాలన్న ఆలోచనతో గతంలో పారిస్‌ ఒప్పందం కుదిరింది. ఐక్యరాజ్య సమితి లోని మెజారిటీ సభ్య దేశాలు వాతావరణ మార్పులపై ఆందోళన చెంది, గ్రీన్‌ హౌస్‌ వాయువులను తగ్గించి, ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ప్రాన్స్‌ రాజధాని పారిస్‌ లో ఆమోదించిన ఒప్పందం 2016 వ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడం బాధ్యతారాహిత్యం. బొగ్గు, పెట్రోలి యం, సహజవాయువు మొదలైనవి శిలాజ ఇంధనాలు. భారతదేశంలో బొగ్గు తర్వాత ప్రధాన ఇంధన వనరు పెట్రోలియం. పెట్రోలియం అనే పదం పెట్రా, ఓలియం అనే లాటిన్‌ పదాల నుండి ఏర్పడింది. పెట్రోలియం అనగా రాతి నూనె అని అర్ధం. శిలాజ ఇంధనాలు చెట్లు, జంతువుల అవశేషాల నుండి ఏర్పడతాయి. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను వినియోగించిన తర్వాత తిరిగి భర్తీ కావడానికి వేలాది సంవత్సరాల కాలం పట్టవచ్చు. ఇవి తరిగే పోయే శక్తి వనరులు. శిలాజ ఇంధనాల వినియోగంలో చైనా ప్రపంచంలోనే అత్యధిక శాతం వాటా కలిగి ఉంది. అమెరికా కూడా చైనాతో సమానంగా శిలాజ ఇంధనాలు వినియోగిస్తున్నది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఈ మూడు దేశాలు ప్రపంచంలో శిలాజ ఇంధనాల వినియోగంలో సగభాగం కలిగి ఉన్నాయి. కాలుష్య కారకంగా భావిస్తున్న చమురు వినియోగంలో భారత్‌ చైనా స్థానాన్ని అధిగమించబోతుందనే అంచనాలున్నాయి. బొగ్గు వినియోగంలో భారత్‌ ఇప్పటికే యూరప్‌, ఉత్తర అమెరికా దేశాలను అధిగమించింది.
భారత దేశం గ్రీన్‌ ఎనర్జీ పై దృష్టి సారించాలని నిర్ణయించినా దీనికి తగ్గ కార్యాచరణ పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ప్రపంచ ఇంధన వినియోగంలో 80 శాతం పైగా చమురు, బొగ్గు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. చైనా, అమెరికా, భారత్‌ల తర్వాత శిలాజ ఇంధనాల వినియోగంలో రష్యా, జపాన్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఇండో నేషియా, కెనడా, యు. కె లు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. కర్బన ఉద్గారాలు గరిష్ఠ స్థాయిలో విడుదలవుతున్నాయి. సూర్య రశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తి వనరులుగా పిలుస్తారు.
జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్‌ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి.
సౌరశక్తి, గాలి వంటి సహజసిద్దమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమ య్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పునరుత్పాదక శక్తి వనరులతో వాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు.‘క్లీన్‌ ఎనర్జీ‘ వలన కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన
ప్రపంచాన్ని నిర్మించవచ్చు.

ట్యాగ్‌లు: Pollution Today news