Skip to content
తెలంగాణ వార్తలు

Hyderabad Real Estate: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆకాశాన్నంటిన భూముల ధరలు.. రాయదుర్గంలో ఎకరం రూ. 269 కోట్లు పైమాటే..

jagan 29 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Real Estate: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆకాశాన్నంటిన భూముల ధరలు.. రాయదుర్గంలో ఎకరం రూ. 269 కోట్లు పైమాటే..

Hyderabad Real Estate:

Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరొక చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. నగరం యొక్క ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో భూమి ధరలు ఆకాశాన్నంటాయి. ఇక్కడ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ. 269 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయి కొత్త సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరాం బిల్డర్స్ తీవ్ర పోటీ మధ్య ఈ స్థలాన్ని కైవసం చేసుకుంది.

రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 పరిధిలో ఉన్న 5.38 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వం వేలానికి ఉంచింది. దీనికి ప్రారంభంలో ఎకరానికి రూ. 175 కోట్లను కనీస ధర (అప్‌సెట్ ప్రైస్)గా నిర్ణయించారు. అయితే, ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో బహుళ జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీపడటంతో ధర అనూహ్యంగా పెరిగింది. చివరికి వంశీరాం బిల్డర్స్ ఎకరానికి రూ. 269 కోట్ల చొప్పున వేలం పాటను గెలుచుకుంది. ఈ ఒక్క విక్రయం ద్వారానే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1,447 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

హైదరాబాద్ ఐటీ ప్రాంతంలో భూముల ధరలు స్వల్ప వ్యవధిలోనే ఊహించని రీతిలో ఊపందుకున్నాయి:

గతేడాది అక్టోబర్: ఎకరం ధర రూ. 177 కోట్లు.
ఈ ఏడాది మే: ధర పెరిగి ఎకరం రూ. 237 కోట్లకు చేరుకుంది.
గత వారం: సమీప ప్లాట్ ఎకరం రూ. 264 కోట్లకు అమ్ముడై అప్పటికి రికార్డు సృష్టించింది.
తాజా వేలం: వారం తిరగకుండానే ఆ రికార్డు చెరిగిపోయి రూ. 269 కోట్లకు చేరింది.

రాయదుర్గం ప్రాంతం గచ్చిబౌలి, మైండ్ స్పేస్, ఐటీ హబ్ , నాలెడ్జ్ సిటీ వంటి వ్యూహాత్మక వాణిజ్య రంగానికి అత్యంత సమీపంలో ఉండటమే ఈ విపరీతమైన గిరాకీకి ప్రధాన కారణం. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, నిరంతర అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఈ స్థాయిలో స్పందన లభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.