6 వేల మంది రాజకీయ ఖైదీల విడుదల ఎప్పుడు?
Ravi Narla
- దశాబ్దాలుగా జైళ్లలోనే మగ్గుతున్నారు
- హైదరాబాద్ వేదికగా ఆందోళనకు శ్రీకారం
రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక కన్వీనర్ రవి నర్లతో ప్రజాపక్షం ప్రత్యేక ఇంటర్వ్యూ
మావోయిస్టు ఉద్యమం దాదాపు అంతమైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న సుమారు ఆరు వేల మంది రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక కన్వీనర్ రవి నర్ల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులోదశాబ్దకాలంకు పైగా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆయా రాష్ట్రాలలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హైదరాబాద్ వేదికగా ఈ నెల 19 నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని సోమవారం ప్రజాపక్షం ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి నర్ల స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ ఇలా సాగింది.
ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లో జైళ్లలో రాజకీయ ఖైదీలు
ఎంతమంది ఉంటారు?
రవి నర్ల: రాజకీయ భావాలు, ప్రజా ఉద్యమాలతో సంబంధాలున్న వారిపై ప్రభుత్వాలు అక్రమ కేసులు నమోదు చేశాయి. తెలంగాణ జైళ్లలో యుఎపిఎ (ఉపాచట్టం) కేసులపై సుమారు 45మందికిపైగా ఉంటారు. ఎపిలో 56 మంది ఉంటారు. దేశ వ్యాప్తంగా 6వేల మంది వరకు ఉంటారని అంచనా. నిజామాబాద్ జైలులో పిఎఫ్‌ఐతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 16 మంది యుఎపిఎ కేసులు ఎదుర్కొంటున్నారు.
మావోయిస్టు ఉద్యమం దాదాపు అంతమైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పరిస్థితుల్లోనూ సాధారణ కార్యకర్తలు, ప్రజా సంఘాల్లో పనిచేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైళ్లలో ఉంచుతున్నారు.
ప్రశ్న:సంవత్సరాలుగా ఎందుకు బెయిల్ రావడం లేదు..?
రవి నర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కేసుల్లో ఉన్నవారిలో అధిక శాతం ఆదివాసీలే. మైనర్లకు సైతం బెయిల్ నిరాకరించిన ఘటనలు ఉన్నాయి. యుఎపిఎ కారణంగా విచారణ ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగుతూ బెయిల్ పొందడం కష్టం గా మారుతోంది. సుప్రీంకోర్టు బెయిల్‌కు సంబంధించి పలు తీర్పులు ఇచ్చినప్పటికీ, వాటి స్ఫూర్తి కింది కోర్టులు, హైకోర్టు ల్లో సక్రమంగా అమలు కావడం లేదు. యుఎపిఎలోని రక్షణ చర్యలు ఉల్లంఘనకు గురవుతున్నందున ఆ చట్టాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
ప్రశ్న:ఎవరెవరు ఎన్నెన్నిఏండ్లు అక్రమ కేసుల్లో జైలులో ఉన్నారు?
రవి నర్ల: జర్నలిస్టులు, న్యాయవాదులు, రచయితలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులపై కూడా యుఎపిఎ వంటి కఠిన చట్టాలను ప్రయోగించి జైళ్లలో వేశారు. కొంతమంది విచారణ ఖైదీలు ఎలాంటి శిక్ష పడకుండానే పదేళ్లకు పైగా జైళ్లలో ఉంటున్నారు. కామ్రేడ్ అడమ 12 ఏళ్లుగా విచారణ ఖైదీగా ఉన్నారు. కామ్రేడ్ శివారెడ్డి 2014- నుంచి జైల్లోనే ఉన్నారు. విశాఖపట్నం జైలులో పాంగి నాగన్న, సాకే కళావతి సుమారు ఆరేళ్లుగా జైల్లో ఉన్నారు. ఒడిశాలో దున్నా కేశవరావు 15 ఏళ్ల పాటు విచారణ ఖైదీగా ఉండి చివరకు ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యారు. భీమా కోరేగావ్ కేసులో సురేంద్ర గాడ్లింగ్ సుమారు ఎనిమిదేళ్లుగా జైలులో ఉన్నారు..
ప్రశ్న:బెయిల్‌పై వచ్చిన వారిపై ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి?
రవి నర్ల: ఎంతో కష్టపడి కొందరు బెయిల్‌పై వచ్చినా ప్రభుత్వం ఆంక్షలతో వారిని ఇబ్బందులు పెడుతుంది. బెయిల్ మంజూరైన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల పై విధిస్తున్న కఠినమైన ఆంక్షలు వారి జీవనాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. ముంబై, కలకత్తా వంటి నగరాలను విడిచి వెళ్లకూడదనే ఆంక్షల కారణంగా వరవరరావు, సత్యనారాయ ణ, సాధనాల రామకృష్ణ వంటి వృద్ధులు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గౌతం నవలఖాకు ఢిల్లీలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇదే విధమైన మానవతా దృక్పథాన్ని ఇతర వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఖైదీల విషయంలోనూ చూపించాలి.
ప్రశ్న:జైళ్లలో వీరికి సరైన సౌకర్యాలు అందుతున్నాయా..?
రవి నర్ల: జైళ్లలో వైద్య సౌకర్యాలు కూడా ఆందోళనకరంగా మారాయి. ఖైదీల పోరాటాల కారణంగా గతంలో జైళ్ల పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. ప్రస్తుతం వైద్య ఖర్చులకు కేటాయించే బడ్జెట్ తగ్గిపోవడంతో అనేకమంది ఖైదీలకు అవసరమైన మందులు అందడం లేదు.
డయాబెటిస్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందడం లేదు. మూల దేవేందర్‌రెడ్డి ఒక కన్ను కోల్పోయినప్పటికీ జైల్లోనే ఉన్నారు. కర్తమ్ జోగా పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ బెయిల్ రాలేదు.
ప్రశ్న:కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఎలా ఉద్యమిస్తారు?
రవి నర్ల: తమ ఆకాంక్ష నెరవేందుకు హైదరాబాద్ వేదికగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఈ క్రమంలోనే ఈ నెల 29 న ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించే ధర్నా నిర్వహించ తలపెట్టాము.తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రతినిధి బృందంగా కలిసి వినతిపత్రం అందజేస్తాము. ప్రభుత్వ స్పందనను బట్టి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచన ఉంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను చేపట్టనున్నాము.
బి.వాసుదేవరాజు