పేపర్ లీకులు… విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
కల్లూరు ధర్మేంద్ర, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఒక విద్యార్థి ఒక పరీక్ష కోసం నెలల తరబడి చదువుతాడు. ఒక పేద కుటుంబం తన బిడ్డ భవిష్యత్తు కోసం అప్పు చేసి కోచింగ్ ఫీజు చెల్లిస్తుంది. ఒక తల్లి తన బిడ్డ చదువు కోసం ఆభరణాలు అమ్ముతుంది. ఒక తండ్రి తన కష్టార్జితాన్ని మొత్తం పిల్లల చదువుపైనే ఖర్చుచేస్తా డు. ఒక యువకుడు తన కలను సాకారం చేసుకోవడానికి రోజుకు పది, పన్నెండు గంటలు పుస్తకాలతో గడుపుతాడు. పరీక్ష తేదీ కోసం ఎదురుచూస్తాడు. పరీక్షా కేంద్రానికి చేరుకుని తన భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్నపత్రాన్ని రాస్తాడు. కానీ పరీక్షకు ముందే ప్రశ్నపత్రం కొందరి చేతుల్లోకి వెళ్లిందని, కొందరు డబ్బు చెల్లించి ప్రశ్నలు ముందుగానే తెలుసుకున్నారని వార్త బయటకు వస్తే ఆ విద్యార్థి పరిస్థితి ఏమిటి? అతను అనేక నెలల తరబడి చేసిన కష్టం విలువ ఏమిటి? అతని కుటుంబం పెట్టిన డబ్బు, సమయం, ఆశలకు విలువ ఏమిటి?
పేపర్ లీక్ అనేది కేవలం ఒక పరీక్షా అవకతవక కాదు. అది విద్యార్థి జీవితంపై జరిగే అన్యాయం.అది ఒక ప్రశ్నపత్రం బయటకు వెళ్లడం మాత్రమే కాదు. అది కష్టపడి చదివిన విద్యార్థి నమ్మకాన్ని దెబ్బతీయడం. ప్రతిభతో ముందు కు రావాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థి అవకాశాన్ని దోచుకోవడం. పరీక్షా వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ధ్వంసం చేయడం. ముఖ్యంగా పోటీ పరీక్షలపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది యువత భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం.
ఈ సమస్యను 2026 నీట్ యుజి పరీక్ష పరిణామాలు మరోసారి దేశం ముందుకు తీసుకొచ్చాయి. 2026 మే 3న నిర్వహించిన నీట్ – యుజి పరీక్షకు 22.7 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై మే 12న సిబిఐ కేసు నమోదు చేసింది. అనంతరం దర్యాప్తులో ప్రశ్నపత్రానికి సంబంధించిన సమాచారం పరీక్షకు ముందే కొందరికి చేరినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొం ది. దర్యాప్తు అనంతరం ఈ కేసులో 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దర్యాప్తులో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 భౌతిక ఆధారాలను ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. పరీక్షను రద్దు చేసి జూన్ 21న మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది.
ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్న అడగాలి. ఇంత పెద్ద పరీక్షా వ్యవస్థలో ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లింది? ఇది కేవలం కొంతమంది వ్యక్తుల నేరంగా చూసి ముగించాల్సిన ప్రశ్న కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా వ్యవస్థలో ఎక్కడ లోపం ఏర్పడిందో గుర్తించాలి. ప్రతి దశలో భద్రత, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి.
ఇక్కడ మరో అంశాన్ని కూడా పరిశీలించాలి కోచింగ్ సంస్కృతి.
దేశంలో ఉన్నత విద్య, వైద్య విద్య, ఇంజినీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ పోటీ పరీక్షల్లో ప్రవేశం కోసం కోచింగ్ కేంద్రాలపై ఆధారపడే పరిస్థితి విస్తరించింది. ఒక విద్యార్థి పరీక్షలో విజయం సాధించాలంటే ఖరీదైన కోచింగ్ తప్పనిసరి అన్న భావన ఏర్పడుతోంది. దీని ఫలితంగా విద్యార్థి ప్రతిభ కంటే కుటుంబ ఆర్థిక స్థోమత కూడా పోటీ పరీక్షల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష నిజంగా ప్రతిభను మాత్రమే కొలుస్తుందా? లేక ఆర్థిక అసమానతను కూడా ప్రతిబింబిస్తుం దా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
అందుకే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పోటీ పరీక్షలకు ఉచిత, నాణ్యమైన కోచింగ్ అందించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి 2026 ఆగస్టు 15న యువతకు ఏఐ శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ వంటి కార్యక్రమాలను ప్రకటించింది. ఈ కార్యక్రమాలు కేవలం ప్రకటనలుగా కాకుండా గ్రామీణ, గిరిజన, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిజంగా అందుబాటులోకి రావాలి. అయితే ఉచిత కోచింగ్ మాత్రమే సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. పరీక్షల విశ్వసనీయతను కాపాడటం మరింత ముఖ్యమైనది. ప్రతిభకు బదులు గా డబ్బు, పరిచయాలు, మోసం ముందుకు వస్తే అది ప్రజాస్వామ్య సమాజానికి
ప్రమాదకరం.
అందుకే పరీక్షా వ్యవస్థను కేవలం సాంకేతికంగా కాకుండా ప్రజాస్వామ్య హక్కుగా చూడాలి. సమాన అవకాశాల హామీ లేకుండా సమానత్వం సాధ్యం కాదు. విద్యలో సమానత్వం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. పరీక్షల్లో పారదర్శకత లేకుండా విద్యలో సమానత్వం సాధ్యం కాదు.
తెలంగాణలో పేపర్ లీకులు నమ్మకాన్ని దెబ్బతీస్తున్న వ్యవస్థ:
దేశవ్యాప్తంగా పేపర్ లీకుల సమస్యను పరిశీలించినప్పుడు తెలంగాణ అనుభవం కూడా ఆందోళన కలిగించే విధంగానే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న తెలంగాణ యువతకు పరీక్షల నిర్వహణలో జరిగే అవకతవకలు తీవ్ర అన్యాయంగా
మారుతున్నాయి.
ముఖ్యంగా టీజీపీయస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగించింది. 2022లో గ్రూప్ -I ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బయటపడిన తర్వాత పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం 2023లో నిర్వహించిన గ్రూప్ -I ప్రిలిమ్స్‌ను కూడా న్యాయపరమైన కారణాలతో రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది.
అందుకే తెలంగాణలో పేపర్ లీకేజీని కేవలం కొంతమంది వ్యక్తుల నేరంగా కాకుండా విద్యార్థుల సమాన అవకాశాలపై, వారి కష్టంపై జరిగిన దాడిగా చూడాల్సిన అవసరం ఉంది. పరీక్ష నిర్వహించే సంస్థలోని ప్రతి స్థాయిలో జవాబుదారీతనం ఉండాలి; ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు భద్రతా వ్యవస్థలో ఏ లోపం జరిగినా దానికి బాధ్యత వహించాల్సిన వ్యవస్థను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
తెలంగాణలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే పరీక్ష రద్దు చేసిన తర్వాత కొత్త పరీక్ష నిర్వహించడం మాత్రమే సరిపోదు. పేపర్ లీక్ కాకుండా ముందస్తు భద్రత, లీక్ జరిగితే తక్షణ జవాబుదారీతనం, విద్యార్థికి న్యాయం జరిగే పరిహార వ్యవస్థ అనే మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పరీక్ష రద్దయితే విద్యార్థులపై మళ్లీ పరీక్ష ఫీజు, ప్రయాణం, కోచింగ్ భారాన్ని మోపకుండా అవసరమైన పరిహారం, వయోపరిమితి సడలింపు, అదనపు అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఖాళీలను ముందుగానే ప్రకటించి ఉద్యోగ క్యాలెండర్‌ను అమలు చేసి, నోటిఫికేషన్ నుంచి నియామకం వరకు నిర్ణీత కాలపరిమితిని పాటించాలి. ఎందుకంటే పేపర్ లీక్ సమస్యను ఉద్యోగాల కొరత నుంచి వేరుచేసి చూడలేం. తక్కువ సంఖ్యలో ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత పోటీపడే పరిస్థితి ఉన్నంతకాలం పరీక్షలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయ డం, ఉచిత నాణ్యమైన కోచింగ్ అందించడం, పారదర్శక పరీక్షా వ్యవస్థను నిర్మించడం కలిపిన సమగ్ర విధానమే అవసరం.
అందుకే పరీక్షా సంస్థలు తమ పనితీరుపై ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలపై స్వతంత్ర ఆడిట్ ఉండాలి. విద్యార్థుల ప్రతినిధుల తో కూడిన పర్యవేక్షణ వ్యవస్థను కూడా పరిశీలించాలి. పరీక్షా ప్రక్రియపై అనుమానా లు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండే స్వతంత్ర ఫిర్యాదు వ్యవస్థ అవసరం.
పోటీ పరీక్షల పెరుగుదల వెనుక ఉన్న మరో అంశం కూడా పరిశీలించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలు బలహీనపడుతుంటే, ఉన్నత విద్య ఖరీదవుతుంటే, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంటే, యువత సహజంగానే కొద్ది పరీక్షలపై ఆధార పడుతుంది.
ఒక వైద్య సీటు కోసం లక్షలాదిమంది పోటీ పడుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాదిమంది దరఖాస్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క పరీక్షా అవకతవక కూడా వేలాది కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.
అందువల్ల పరిష్కారం కేవలం పరీక్షలను మరింత కఠినంగా నిర్వహించడమే కాదు. ఉన్నత విద్యలో సీట్లు పెంచాలి. ప్రభుత్వ వైద్య, ఇంజినీరిం గ్, డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంచాలి.
ఈ నేపథ్యంలో అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) విద్యార్థు ల సమస్యలను కేవలం పరీక్షల పరిధిలో చూడదు. విద్యను మార్కెట్ వస్తువుగా మార్చే విధానాన్ని, ఖరీదైన కోచింగ్ సంస్కృతిని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరిచే విధానాలను, ఉద్యోగాల కొరతను, పేపర్ లీక్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానించి చూడాల్సిన అవసరం ఉందని భావిస్తుంది.
ఎఐవైఎఫ్ ఏమి కోరుతోంది?
పరీక్షల్లో పూర్తి పారదర్శకత ఉండాలి. పేపర్ లీక్‌లకు పాల్పడే వ్యక్తులతో పాటు బాధ్యత వహించాల్సిన వ్యవస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థి భవిష్యత్తు ఒక ప్రశ్నపత్రం లీక్‌తో నిర్ణయించబడకూడదు. అతని భవిష్యత్తును నిర్ణయించేది అతని ప్రతిభ, అతని కష్టం, అతనికి లభించే సమాన అవకాశం కావాలి.
ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల పిలుపు:
విద్యార్థి హక్కుల కోసం ఐక్యమై ఉద్యమిద్దాం ప్రజా విద్యను కాపాడుదాం, పరీక్షా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం, సమానత్వంతో కూడిన విద్యా వ్యవస్థ కోసం పోరాడుదాం.