Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పోలీసులే ఇలా ప్రవర్తిస్తే.. ప్రజలు ఎవరిని నమ్మాలి.. YS Jagan సంచలన వ్యాఖ్యలు..

jagan 26 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
పోలీసులే ఇలా ప్రవర్తిస్తే.. ప్రజలు ఎవరిని నమ్మాలి.. YS Jagan సంచలన వ్యాఖ్యలు..

This Is an Attack on Democratic Values and Freedom of Expression: YS Jagan

కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో తప్పుడు కేసులు, వేధింపులతో పాటు వివిధ రకాల మాఫియాలు, అక్రమ దందాలు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాఫియాలే కనిపిస్తున్నాయని జగన్‌ విమర్శించారు. అమరావతి పేరుతో బిల్డింగ్‌ స్కామ్‌లు జరుగుతున్నాయని, విలువైన భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్‌, గంజాయి, బెల్ట్‌ షాపులు, కల్తీ మద్యం విచ్చలవిడిగా సాగుతున్నాయని YS Jagan అన్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటనపై జగన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడితే సామాన్యులు ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నించారు. మత్తులో ఉన్న పోలీసుల వాహనం ప్రమాదానికి గురైందని, అందులో గంజాయి, లిక్కర్‌, ఖాకీ యూనిఫాం లభించాయని ఆయన పేర్కొన్నారు. అద్దంకి ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని జగన్‌ ఆరోపించారు. పోలీసు అధికారులు వేర్వేరు ప్రకటనలు చేశారని, వారి వ్యాఖ్యలకు ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలకు పొంతన లేదని అన్నారు. సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వంలో అద్దంకి ఘటన ఒక్కటే కాదని, కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్‌ కేసులు కూడా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని తెలియజేస్తున్నాయని జగన్‌ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. 13,210 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్‌ చేశామని, 11 వేల ఎకరాల్లో గంజాయి పంటలను ధ్వంసం చేశామని తెలిపారు. ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ ద్వారా గిరిజనులను గంజాయి సాగుకు దూరం చేశామని, ప్రత్యేకంగా ఎస్‌ఐబీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. రాష్ట్రంలో దోపిడీ, అక్రమ దందాలు పెరిగిపోయాయని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో గంజాయికి మాత్రమే గిట్టుబాటు ధర లభిస్తోందంటూ ఆయన ఎద్దేవా చేశారు.