Skip to content
ఎడిట్ పేజి వార్తలు

రిల్కే రచనలు.. సంక్లిష్టమైన ప్రశ్నలు

Prajapaksham 24 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
రిల్కే రచనలు.. సంక్లిష్టమైన ప్రశ్నలు

Rilke

యూరోపియన్‌ ఆధునిక సాహిత్యంలో అత్యంత ప్రభావశీలమైన జర్మన్‌ భాషా కవుల్లో రైనర్‌ మారియా రిల్కే ఒకరు. ప్రాగ్‌లో జన్మించిన బోహీమియన్‌- సాంస్కృతిక ప్రపంచానికి చెందిన రిల్కే, జర్మన్‌ భాషలో రాస్తూనే రష్యన్‌ సంస్కృతి, ఫ్రెంచ్‌ కళ, యూరోపియన్‌ క్రైస్తవ సంప్రదాయం, ప్రతీకవాదం, ఆధునిక నగర అనుభవం, శిల్పకళ, చిత్రకళ, తత్వశాస్త్రం వంటి అనేక ప్రవాహాలను తన రచనల్లో కలిపాడు. ఆయన జీవితకాలంలోనే ఆయన కవిత్వం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించగా, మరణానంతరం ఆయన ప్రభావం జర్మన్‌ సాహిత్యాన్ని దాటి యూరోపియన్‌ మరియు ప్రపంచ కవిత్వంలో విస్తరించింది. రిల్కే సాహిత్యాన్ని చదవడం అంటే కేవలం కొన్ని అందమైన కవితలను చదవడం కాదు. అది ఒంటరితనం, ప్రేమ, మరణం, కళ, దేవుడు, భయం, ప్రకృతి, వస్తువులు, జ్ఞాపకం, కాలం, మనిషి ఉనికి వంటి ప్రశ్నలతో నిరంతరం తలపడే ఒక కవిమనస్సులోకి ప్రవేశించడం. ఆయనకు కవిత్వం భావాలను అలంకారంగా చెప్పే సాధనం కాదు. ప్రపంచాన్ని ఒక కొత్త విధంగా చూడటానికి చేసే సాధన. రిల్కే 1875 డిసెంబర్‌ 4న ప్రాగ్‌లో జన్మించాడు. ఆయన తండ్రి జోసెఫ్‌ రిల్కే రైల్వే ఉద్యోగి. తల్లి ఫియా రిల్కే. బాల్యంలోనే సైనిక పాఠశాలలో చదివాడు. ఆ అనుభవం అతని వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపింది. తరువాత అతను కళ, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి రంగాల వైపు మళ్లాడు. 1894లో ‘లెబెన్‌ అండ్‌ లెయిడర్‌’ అనే తొలి కవితా సంకలనం వెలువడింది. 1897లో లవొ ఆండ్రియాస్‌ సాలమ్‌ను కలిసిన తరువాత తన మొదటి పేరు ‘రెన్‌’ను ‘రైనర్‌’గా మార్చుకున్నాడు. కేవలం పేరు మార్చుకోవడంతో ఆగకుండా, తనను తాను ఒక కవిగా పునర్నిర్మించుకోవాలనే ప్రయత్నాలను రిల్కే తన జీవితాంతం కొనసాగించాడు. లొవొ తో పరిచయం అతని జీవితంలో కీలకమైన మలుపు. ఆమె ద్వారానే అతనికి ‘నిశ్చే’ ఆలోచనలతో పరిచయం ఏర్పడింది. తరువాత రష్యా పర్యటనలు, లియో టాల్‌స్టాయ్‌తో పరిచయం, రష్యన్‌ ఆధ్యాత్మికతపై ఆసక్తి అతని కవిత్వంలో దేవుడు, మానవుడు, అంతరంగం, సృష్టి వంటి ప్రశ్నలకు కొత్త రూపాన్ని ఇచ్చాయి. తరువాత పారిస్‌ అతని కళాత్మక పరిణామంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా మారిం ది. అక్కడ అగస్టే రొడిన్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం రోడిన్‌కు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. శిల్పకళను అత్యంత తీవ్రంగా పరిశీలించిన ఈ కాలం తరువాత రిల్కే కవిత్వంలో వచ్చిన గొప్ప మార్పుకు కారణమైంది. అందుకే రిల్కే సాహిత్య పరిణామాన్ని సాధారణంగా, ‘ఆధ్యాత్మిక, భావోద్వేగ దశ’, ‘వస్తువులను కేం ద్రంగా చేసుకున్న కళాత్మక దశ’, ‘అస్తిత్వం, మరణం, పరివర్తన, విశ్వంతో మానవ సంబంధం వంటి ప్రశ్నలను ఎదుర్కొనే పరిపక్వత’ అనే మూడు దశలుగా చూడవచ్చు. నిజానికి ఈ మూడు దశలు వేరువేరు కావు. ఒక దశలో పుట్టిన ప్రశ్న మరో దశలో మరింత లోతైన రూపాన్ని తీసుకుంటుంది.
రిల్కే తొలి రచనల్లో ‘రోమాంటిసిజం’, ‘సింబాలిజం’ ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఆయనకు దేవుడు ఒక స్థిరమైన, బయట ఉన్న సర్వశక్తిమంతుడైన సత్యం కంటే, మనిషి అంతరంగంలో నిరంతరం నిర్మితమవుతున్న ఒక అనుభవం. అంటే, రిల్కే కవిత్వంలో దేవుడు అనేది చాలా సందర్భాల్లో ఒక సిద్ధాంతం కాదు. అది అన్వేషణ. అందువల్ల ఆయనను సంప్రదాయ మతకవి అని పిలవడం సరైనది కాదు. అదే సమయంలో పూర్తిగా మతవ్యతిరేక కవిగా కూడా చూడలేం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అనే దానికంటే, మనిషి తనలో దేవుడిని ఎలా అనుభవిస్తాడు? అనే ప్రశ్నకు అతని ఆలోచన దగ్గరగా ఉంటుంది. ఈ భావజాలం ‘ది బుక్‌ ఆఫ్‌ అవర్స్‌ డాస్‌ స్టన్డెన్‌బుచ్‌ (1905)లో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంకలనం మూడు భాగాలుగా ఏర్పడింది. ఇందులో దేవుడు, కళాకారుడు, ప్రేమ, ఒంటరితనం, ప్రార్థన, ఆత్మ వంటి అంశాలు పరస్పరం కలుస్తాయి. ఇక్కడ రిల్కే కవి ఒక ప్రవక్తగా కనిపిస్తాడు. కళాకారుడు ప్రపంచాన్ని మిగిలిన మనుషుల కంటే లోతుగా అనుభవించే వ్యక్తి. కానీ తరువాత రిల్కే ఈ దృక్కోణాన్ని మార్చుకుంటాడు. అదే ఆయన సాహిత్య పరిణామంలో ఒక గొప్ప మలుపు. ‘వస్తుకవిత’ రిల్కే సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకంగా మారింది. ‘న్యుయె గెడిచ్‌’ 1907లో, ‘డెర్‌ న్యుయెన్‌ గెడిచె ఆండెరెర్‌ టెయిల్‌’ 1908లో ప్రచురితమయ్యాయి. ఇవి రిల్కే మధ్యదశ సాహిత్యానికి కేంద్ర రచనలు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్‌ కూడా ‘న్యూ పోయెమ్స్‌’ను ఆయన ఖ్యాతికి ఆధారమైన నాలుగు ప్రధాన రచనా సమూహాల్లో ఒకటిగా పేర్కొంటుంది. ఇక్కడ రిల్కే తన అంతర్గత భావోద్వేగాలను నేరుగా వ్యక్తం చేయడం తగ్గిస్తాడు. అదే సమయంలో ‘శిల్పం’, ‘పుష్పం’, ‘జంతువు’, ‘పండు’, పురాతన విగ్ర హం’, ‘భవనం’, ‘ప్రకృతి’కి ప్రాధాన్యం ఇస్తాడు. అయితే, అది కేవలం వస్తువుల వర్ణనకు పరిమి తం కాదు. అతను ఒక వస్తువును అంత సూక్ష్మంగా పరిశీలిస్తాడు, అది చివరికి మనిషి ఉనికికి అద్దంగా మారుతుంది. ఇక్కడ రోడిన్‌ ప్రభావం కీలకం. శిల్పాన్ని చూడటం ద్వారా రిల్కే చూడటం అనే క్రియనే కళాత్మక సాధనగా మార్చుకున్నాడు. పరిశోధకులు కూడా ‘న్యుయె గెడిచ్‌’ లో కళాకారుడి పాత్ర మారి, వస్తువుల స్వభావాన్ని చేరుకోవడానికి కళ ఒక మార్గంగా మారిందని గుర్తించారు. రిల్కే ప్రసిద్ధ కవితల్లో ‘ది పాంథర్‌’ ఒకటి. పారిస్‌ జంతుప్రదర్శనశాలలోని పాంథర్‌ను చూస్తూ రాసిన ఈ కవితలో జంతువు నిరంతరం తిరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ ఇనుప కడ్డీలు ఉన్నాయి. పాంథర్‌కు ప్రపంచం కనిపిస్తుంది, కానీ ఆ ప్రపంచాన్ని స్వేచ్ఛగా అనుభవించలేడు. ఇది మొదట ఒక జంతువు గురించి రాసిన కవితగా కనిపిస్తుంది. కానీ కవితను లోతుగా చదివితే అది ఆధునిక మనిషి పరిస్థితిగా మారుతుంది. మనిషికి కూడా ప్రపంచం ఉంది. కానీ, సామాజిక వ్యవస్థలు, నగర జీవితం, భయం, ఒంటరితనం, వృత్తి, రాజకీయ నిర్మాణాలు, శరీరం, కాలం వంటి కనిపించని చువ్వలు అతని ఆలోచనలను, స్వేచ్ఛను బంధిస్తాయి. ‘ప్రపంచాన్ని చూడటం… ఆ ప్రపంచాన్ని అనుభవించడం ఒకటేనా?’ అన్నది అతని ప్రశ్న. పాంథర్‌ ప్రపంచాన్ని చూస్తుంది. కానీ దాని స్వే చ్ఛ దాని శరీరంలోనే బంధించబడి ఉంది. ఇది కేవలం జంతువు అనుభవించే విషాదం కాదు. ఆధునిక మనిషి యొక్క పరాయీకరణకు కూడా ఇది ఒక రూపకం.
రిల్కే గద్య రచనల్లో అత్యంత ముఖ్యమైన ‘ది నోట్‌బుక్స్‌ ఆఫ్‌ మాల్టే లారిడ్స్‌ బ్రిగ్గె’ 1910లో వెలువడింది. ఇది సాధారణ కథా నిర్మాణం కలిగిన నవల కాదు. ఇది జ్ఞాపకాలు, భయాలు, అనుభవాలు, పరిశీలనలు, ఆలోచనలు, చిన్న సంఘటనలు, కళా అనుభవాలు, మరణం గురించి ధ్యానాలు వంటి అనేక ముక్కలతో నిర్మితమైన ఒక ఆధునిక మానసిక రచన. మాల్టే పారిస్‌లో నివసించే ఒక యువకుడు. అతను నగరాన్ని చూస్తాడు. కానీ అతను చూసేది ఆధునిక నగరపు అందం కాదు…. అందులోని అనారోగ్యాన్ని, పేదరికాన్ని, ఒంటరితనాన్ని, జనసమూహంలో వ్యక్తి అదృశ్యమవడాన్ని, ఆసుపత్రులను, మరణాన్ని, భయాన్ని చూస్తాడు. ఇక్కడ రిల్కే ఆధునికత మరింత స్పష్టమవుతుంది. పూర్వపు సాహిత్యంలో నగరం నాగరికత, అభివృద్ధి, అవకాశాలకు చిహ్నంగా ఉండవచ్చు. రిల్కేకు ఆధునిక నగరం మరో రూపాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి తన స్వంత జీవితంలోనే పరాయివాడిగా మారే ప్రదేశాన్ని కళ్లకు కడుతుంది. అందుకే మాల్టేను ఆధునిక యూరోపియన్‌ నవల పరిణామంలో ఒక ముఖ్యమైన రచనగా పరిగణిస్తారు. ఆధునిక గద్య నిర్మాణం, వ్యక్తి అంతరంగం,‘ఎపిఫనీ’ వంటి అనుభవాల విషయంలో ఈ రచనపై జేమ్స్‌ జాయిస్‌తో పోలికలు కూడా సాహిత్య పరిశోధనలో కనిపిస్తాయి.
రిల్కే దృష్టిలో మరణం అనేది ముగింపు కాదు, ఒక పరివర్తన. రిల్కే సాహిత్యంలో అత్యంత నిరంతరమైన అంశం మరణం. కానీ అతని మరణ భావనను సాధారణ భయంగా అర్థం చేసుకోవడం తప్పు. అతనికి మరణం అనేది జీవితానికి వ్యతిరేకం కాదు. అది జీవితంలోనే ఉన్న ఒక భాగం. రిల్కేకు మనిషి తన మరణాన్ని ఇతరుల ద్వారా అనుభవించలేడు. ప్రతి వ్యక్తి తనకు సంబంధించిన ప్రత్యేకమైన మరణాన్ని తనతోనే మొసుకుంటూ ఉంటాడు. ఇది అతని కవిత్వంలో ఒక విచిత్రమైన వ్యక్తిగతతను సృష్టిస్తుంది. జీవితం అంటే జననం, అనుభవం, ప్రేమ, బాధ, సృజన.. చివరికి మరణం అనే సరళరేఖ ఎంతమాత్రం కాదు. జీవితం, మరణం అనేవి ఒకదానితో ఒకటి… ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. అందుకే, రిల్కే కవితంలో శిశువు, వృద్ధుడు, ప్రేమికుడు, కళాకారుడు, దేవదూత, జంతువు, విగ్రహం, పువ్వు అన్నీ ఒకే అస్తిత్వ ప్రశ్నలో భాగాలవుతాయి.
రిల్కే సాహిత్య శిఖరాన్ని చేరిన రచనల్లో ‘డ్యూనెసర్‌ ఎలెగియెన్‌’ లేదా ‘డునో ఎలిగీస్‌’ అగ్ర స్థానంలో ఉంటుంది. ఈ పది ‘ఎలిగీస్‌’ రచన 1912లో ప్రారంభమైంది. డ్యూనో కాజిల్‌లో ప్రిన్సెస్‌ మేరీ వాన్‌ థర్న్‌ ఉన్డ్‌ టాక్సిస్‌ అతిథిగా ఉన్నప్పుడు రిల్కే మొదటి కవితను ప్రారంభించాడు. కానీ మొత్తం సంకలనం పూర్తవడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది. 1922లో, స్విట్జర్లాండ్‌లోని మ్యుజోడ్‌లో తీవ్రమైన సృజనాత్మక ఉద్ధృతిలో అతను దానిని పూర్తి చేశాడు. ఇది రిల్కే సాహిత్యంలోని అత్యంత సంక్లిష్టమైన రచన. ‘మనిషి ఎందుకు ఇంత అస్థిరమైన, తాత్కాలికమైన, బాధతో నిండిన ప్రపంచంలో జీవించాలి?’ అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. సాధారణంగా ఈ ప్రశ్నకు అంతా తాత్విక ధోరణిలో సమాధానం ఇస్తారు. కానీ రిల్కే మాత్రం అలా చేయలేదు. అతను దేవదూతలను పిలుస్తాడు. కానీ ఆ దేవదూతలు క్రైస్తవ సంప్రదాయంలోని కరుణామయమైన దేవదూతలు కావు. అతను సృష్టించిన ‘దేవత’ అనేది మనిషి తట్టుకోలేనంత తీవ్రం గా ఉన్న అస్తిత్వ సంపూర్ణతకు ప్రతీక. అందుకే, ‘ఎవ్రి ఏంజెల్‌ ఈజ్‌ టెర్రిఫయింగ్‌’ (ప్రతి దేవత భయానకంగా ఉంటుంది’ అనే ప్రసిద్ధ కొటేషన్‌ అతని కలం నుంచి వచ్చింది. ఇక్కడ భయం అంటే దెయ్యం వల్ల కలిగే భయం కాదు. అది సంపూర్ణతను ఎదుర్కొనే మనిషి యొక్క భయం. మనిషి పరిమితమైనవాడు. దేవదూత పరిమితులను దాటి ఉన్న సంపూర్ణతకు ప్రతీక. కాబట్టి దేవదూతను పూర్తిగా ఎదుర్కోవడం అంటే మన స్వంత పరిమితిని ఎదుర్కోవడం. ఈ విధమైన ఎన్నో వైవిధ్యాలను, సంక్లిష్టతల తుట్టెను కదిపిన రిల్కే ఒక రకంగా ప్రశ్నల ప్రభంజనాన్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, అతని రచనలు నేటికి కూడా ప్రాధాన్యతను కోల్పోలేదు. యువ రచయితలకు అతను వేసే సూటి ప్రశ్న ‘నీవు నిజంగా రాయకుండా ఉండలేని స్థితిలో ఉన్నావా?’. ఇది నిజంగానే నేటి సృజనాత్మక ప్రపంచానికి అసౌకర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రచయిత కావడానికి ముందు రచయిత తన గురించి ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనుషులు ముందుగా వ్యక్తిగత బ్రాండ్‌ నిర్మించుకుని, తరువాత ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తారు. రిల్కే దీనిని చూసి ఉంటే కనీసం ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచేవాడు.

ట్యాగ్‌లు: editorial Today news World News