Konda Sushmitha Remarks: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు.. కొండా సుస్మిత కామెంట్స్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహం..
Congress Leaders
Konda Sushmitha Remarks: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగంగా ప్రస్తావించడం, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గత పదేళ్లలో జరగని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేపడుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, తప్పులను సీఎం రేవంత్‌రెడ్డి సరిదిద్దుతున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, ఆమె వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిపై బహిరంగంగా విమర్శలు చేసే వారికి పార్టీలో కొనసాగే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. అంతర్గత విభేదాలు ఉంటే పార్టీ వేదికలపై, అధిష్ఠానం వద్ద చర్చించుకోవాలని సూచించారు. సీఎం ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం బలహీనపడేలా వ్యవహరించే వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వేలాది మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని అన్నారు. ముఖ్యమంత్రిని బలహీనపరిచే ప్రయత్నాలను పార్టీ కార్యకర్తలు అంగీకరించబోరని చెప్పారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని కేవలం షోకాజ్ నోటీసులతో వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వార్థం కోసం ముఖ్యమంత్రిని బహిరంగంగా టార్గెట్ చేయడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నారని విమర్శించారు. పార్టీ అంతర్గత అంశాలను ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం వద్ద ప్రస్తావించవచ్చని, రోడ్లపైకి వచ్చి విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు చేసిన త్యాగాలను వృథా చేయవద్దని సూచించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా ఇదే అంశంపై స్పందిస్తూ.. కొండా సుస్మితతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరుల వ్యాఖ్యలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలని అన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలహీనుడని భావించడం పొరపాటని, ఆయన దమ్ము, ధైర్యంతో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి లేదా పార్టీపై వ్యాఖ్యలు చేసినప్పుడు సంబంధిత మంత్రి బాధ్యతగా స్పందించాలని అన్నారు.
ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కంటే తామే పెద్దవాళ్లమని ఎవరూ భావించకూడదన్నారు. వ్యక్తిగత విభేదాలు ఉంటే అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. పార్టీ నిర్ణయాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు.
ఏదేమైనా కొండా సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ చర్చకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..