Skip to content
ఎడిట్ పేజి వార్తలు

‘దిమాగీ నక్సల్స్‌’ అర్థం చెబుతారా మోదీజీ!!

Prajapaksham 18 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
‘దిమాగీ నక్సల్స్‌’ అర్థం చెబుతారా మోదీజీ!!

ఉత్తరాదిన మోడీ ఇమేజ్ డామేజ్..? కాక్రోచ్ ఉద్యమం బిజెపిని అంతలా దెబ్బ తీసిందా..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదాలు కూర్చటంలో, ప్రయోగించటంలో దిట్ట. ఆయనకు పొగడ్తలు తప్ప విమర్శలు నచ్చవు. ప్రజలు తమ బాధలగూర్చి, హక్కుల గూర్చి మాట్లాడటం అసలే గిట్టదు. పెట్టుబడి దారులకు పరమ మిత్రుడు; రైతులు, కార్మికులకు బద్ధ వ్యతిరేకి. గిట్టుబాటు ధరలకోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న పంజాబ్‌ హర్యానా రైతులు నిరసన తెలిపేందుకు దేశ రాజధానికి రాకుండా సరిహద్దుల్లోనే అణచివేత, నిర్బంధం. రైతులు ముందుకు రాకుండా రహదారిపై మేకులు కొట్టించిన తొలి ప్రభుత్వం మోదీ జీ దే. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మూడు రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకున్నాక కూడా ఆయనలో రైతుల పట్ల సానుభూతి పెరగలేదు. నిన్నకూడా ఢిల్లీ వస్తున్న రైతులను పంజాబ్‌ సరిహద్దులలో పోలీసులు అడ్డుకున్నారు. పెట్టుబడిదారుల లాభాల కోసం ‘వ్యాపారాలు సులభతరం’ విధానం అమలు చేస్తున్న ప్రధాని మోదీ కార్మికుల సంఘటితశక్తిని, ఆ శక్తితో సాధించుకున్న హక్కులను హరించేందుకు 29 చట్టాలు రద్దుచేసి నాలుగు సంహితలను (కోడ్‌లు) చట్టాలుగా కూర్చారు. వాటికి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా 1-0కేంద్ర ట్రేడ్‌ యూనియన్‌లు నిర్విరామ ఆందోళన చేస్తున్నా, పలుమార్లు సార్వత్రిక సమ్మె చేసినా ఆయనకు చీమకుట్టినట్లు లేదు. జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను హిందూత్వ సిద్ధాంతంలో పొదిగినారు. విద్య కేంద్రీకరణ, పోటీ పరీక్షలు కేంద్రీకరణ. పరీక్షల నిర్వహణలో తప్పులు, అవకతవకలు, అక్రమాలు, అవినీతి కేంద్రీకరణ. మరోవైపున మావోయిస్టులను (నక్సలైట్‌లకు) భౌతికంగా ఏరివేశామన్న ఉత్సాహం లో ఉన్న ప్రధాని మోదీ, ఆయన అనుంగుశిష్యుడు హోంమంత్రి అమిత్‌ షాలను అనూహ్యమైన దెబ్బకొట్టారు కాక్రోచ్‌ జనతాపార్టీ (సిజెపి) ఆన్‌లైన్‌ పిలుపుపై జెన్‌ జీ యువత.
ఈ నేపథ్యంలో, ఎర్రకోటనుంచి 80వ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధానమంత్రి యువతకు కొన్ని వరాలు ప్రకటించారు. అదే సమయంలో ‘దిమాగీ నక్సలైట్‌లు’ అని కొత్త పదం ఉపయోగించా రు. దీని అర్థం ఏమిటి మహాశయా అని దేశంలోని రాజకీయ స్పృహ కలిగిన విద్యావంతులు, రాజకీయ, సామాజిక కార్యకర్తలు. మోదీజీ సామాన్యంగా వ్యర్థ పదాలు (రాజకీయ సభల్లో తప్ప) ఉపయోగించరు. ‘అడవుల్లోని నక్సలైట్లను ఏరివేస్తున్నాం పట్టణాల్లో నక్సలైట్‌లు మరీ ప్రమాదకారులని’ గత సంవత్సరం హెచ్చరించిన మోదీ, ఇప్పుడు ‘అడవుల్లోని నక్సలైట్లను ఏరివేశాం’ అని ఘనంగా చెప్పుకుంటూ, ‘దిమాగీ (మేధావులు, విద్యావంతులని అర్థం)నక్సలైట్ల’ ప్రస్తావన చేశారు. వీరు ఇన్నాళ్లదాకా ప్రభుత్వంలో సలహాదారులుగా మావోయిస్టు భావజాలంతో విధానాలను ప్రభావితం చేశారట! ఇప్పుడు సమాజాన్ని ప్రభావితం చేయటం కొనసాగిస్తున్నా రట! ‘వారు మన చుట్టూ ఉన్నారు, గుర్తించి ఏకాకులను చేయాలి’ అన్నారు. వామపక్ష మేధావుల గూర్చి ప్రధాని ఈ పదం వాడారన్నది స్పష్టం. ఆ భావజాలం పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటున్నారంటే, ఇటీవల యువత, రైతులు, కార్మికుల ఆందోళనల వెనుక ఆ మేధావులు ఉన్నారనే అన్యాపదేశం స్ఫురిస్తుంది. వామపక్ష భావజాలాన్ని అణచివేసే పేరుతో యూనివర్శిటీల్లో హింసాత్మక దాడులు ప్రేరేపించటం, అందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపిలను ప్రోత్సహించటం చూశాం, చూస్తున్నాం. బయట వామపక్ష మేధావులకు మావోయిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌ అనే ముద్రవేసి దేశద్రోహం, ప్రధాని హత్యకు కుట్ర వంటి ఆరోపణలు బనాయించి బెయిలుకు అవకాశంలేని జాతీయ భద్రత, ఉపా చట్టాల కింద అరెస్టు చేశారు. ఇది అసమ్మతిపై, భిన్నాభిప్రాయంపై దాడి. మానవ మేధస్సుకు, ప్రజాస్వామ్యానికీ విరుద్ధమైన శిలా సదృశ సమాజ నిర్మాణం ఆర్‌ఎస్‌ఎస్‌ వారి సిద్ధాంతం కదా! మత మార్గాల్లో దేశాన్ని విభజిస్తూ ఒకే ఆహార్యం, ఒకే భాష, శాఖాహారం, సనాతన ఆచారాలు, నమ్మకాల ఆరాధన సిద్ధాంతం అసమ్మతిని, నిరసనను సహించక పోవచ్చు. కాని ఈ 21వ శతాబ్దంలో నిరసనను అణచాలను కోవటం మూర్ఖత్వం.
సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం “దిమాగీ నక్సల్‌గా ఉండటానికి నేను గర్విస్తాను” అని ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఎష్టాబ్లిష్‌మెంట్‌ను కలవరపరిచినట్లుంది. పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి కిరణ్‌ రిజిజు హడావిడిగా మేల్కొని (తన ప్రకటనలోని వరుస సంఖ్యల్లో 3 అంకె లేకపోవటం సైతం గమనించలేదు) ప్రధాని వ్యాఖ్య ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉద్దేశించింది కాదని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆయన ప్రధానమంత్రి బుర్రలోకి దూరి ప్రధాని వ్యాఖ్యలు “మావోయిస్టులను బలపరిచే వారికీ, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారికీ, వేర్పాటు వాదులను బలపరిచే వారికీ, ఆర్టికల్‌ 370ని బలపరిచేవారికీ, భారత్‌ నుండి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసేందుకు చికెన్‌ నెక్‌ ప్రాంతాన్ని వేరుచేయా లని కోరేవారికీ వ్యతిరేకంగా” ఎక్కుపెట్టబడినట్లు వివరించారు.
అయితే బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబె, బిజెపి ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌లు చిదంబరంపై ఎదురుదాడికి దిగి అణుబాంబుపై గతంలో ఆయన ప్రకటన ‘దిమాగీ నక్సల్‌’ ప్రకటనగా ఉందని, యుపిఎ ప్రభుత్వంలో ‘కాషాయ టెర్రరిజం ప్రాజెక్టుకు ఆయన కన్సల్టెంట్‌’ అని నిందించారు. ప్రధాని ప్రకటన రాజకీయ ప్రత్యర్థులపై ఎక్కుపెట్టబడిందే నని వీరి వ్యాఖ్యలు చెబుతున్నాయి.
జాతీయవాదులు, ప్రగతిశీలురు, వామపక్షవాదులు, నియంతృత్వ వ్యతిరేక ప్రజాస్వామ్యవాదులు ప్రధాని లేబుల్‌ను ముక్తకంఠంతో ఖండించాలి. విద్యారంగ సమస్యలపై మధ్యప్రదేశ్‌లో స్కూలు పిల్లలు సైతం తమంతటతాము ఉద్యమిస్తున్నారు. అది జన్‌ జీ జాతీయస్థాయి ఆందోళన తెచ్చిన చైతన్యం. దాన్ని ఆపటం ఎవరితరం కాదు.

ట్యాగ్‌లు: BJP editorial Modi national