Veeramangai Kuyili: వీరనారి కుయిలి గురించి ఎవరికైనా తెలుసా.. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు మానవ బాంబుగా ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి భారతీయ రాణి
Veeramangai Kuyili
Independence Day-Kuyili: మనం మానవ బాంబు అనగానే తీవ్రవాదం, ఆధునిక యుద్ధాలు గుర్తుకొస్తాయి. కానీ 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ఏకంగా 77 ఏళ్ల ముందే అంటే 1780లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయుధాగారాన్ని పేల్చేసి.. చరిత్రలోనే ప్రపంచపు మొట్టమొదటి మానవ బాంబుగా ప్రాణాలు అర్పించిన ఒక భారతీయ వీరనారి గురించి ఎవరికైనా తెలుసా. ఆమే తమిళనాడుకు చెందిన కుయిలీ (Kuyili).
వీరమంగై వేలు నాచియార్ & కుయిలీ.. తమిళనాడులోని శివగంగ సంస్థానానికి చెందిన రాణి వేలు నాచియార్ (Velu Nachiyar) భర్తను బ్రిటిష్ సైన్యం దగా చేసి చంపేసింది. దీంతో రాణి తన రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లోకి పారిపోవాల్సి వచ్చింది. రాజ్యాన్ని తిరిగి సాధించడానికి రాణి వేలు నాచియార్ ఒక ప్రత్యేక మహిళా సైన్యాన్ని (ఉడైయాళ్ పడై) ఏర్పాటు చేశారు. ఆ మహిళా సైన్యానికి అధిపతిగా సాధారణ పేద వర్గానికి చెందిన కుయిలీని నియమించారు. కుయిలీ అత్యంత తెలివైనది, విలువిద్య, కలరిపయట్టు, ఆయుధ విద్యల్లో దిట్ట.
బ్రిటిష్ వారి దగ్గర ఉన్న అత్యాధునిక ఫిరంగులు, తుపాకులు, మందుగుండు సామాగ్రి ముందు రాణి సైన్యం నేరుగా పోరాడి గెలవడం అసాధ్యమని కుయిలీ గ్రహించింది. శివగంగ కోటలో బ్రిటిష్ వారు దాచిన మందుగుండు సామగ్రిని నాశనం చేస్తే తప్ప విజయం సాధించలేమని మాస్టర్ ప్లాన్ వేసింది.అయితే భారీ భద్రత ఉన్న బ్రిటిష్ ఆయుధాగారంలోకి (Armoury) ప్రవేశించడం ఎలా? అనేది ప్రశ్నగా మారింది.
అప్పుడే విజయదశమి పండుగ వచ్చింది. ఆ రోజున కోటలోని ‘రాజరాజేశ్వరి అమ్మవారి’ ఆలయానికి మహిళలకు ఉచిత ప్రవేశం ఉండేది. కుయిలీ తన మహిళా సైన్యంతో కలిసి పూల గంపలు, నెయ్యి కుండలలో రహస్యంగా ఆయుధాలు దాచుకుని సాధ్వుల వేషంలో కోటలోకి ప్రవేశించింది.
కోటలోకి ప్రవేశించగానే కుయిలీ సైన్యం బ్రిటిష్ సైనికులపై అకస్మాత్తుగా దాడి చేసింది. తీవ్రమైన అలజడి రేగడంతో బ్రిటిష్ సైనికులు అయోమయంలో పడ్డారు. ఆ సమయాన్ని అనువుగా తీసుకుని కుయిలీ వేగంగా మందుగుండు సామాగ్రి ఉన్న గది (ఆయుధాగారం) వైపు పరిగెత్తింది. తనతో తెచ్చుకున్న నెయ్యి, నూనెను శరీరం నిండా పోసుకుంది. దీప ప్రమిద నుంచి నిప్పు తీసుకుని.. తన శరీరానికి తానె నిప్పు అంటించుకుని మంటల ముద్దలా ఆయుధాగారంలోకి దూకేసింది. ధడాల్ అంటూ భారీ శబ్దంతో బ్రిటిష్ వారి మందుగుండు సామాగ్రి మొత్తం బూడిదైపోయింది.
బ్రిటిష్ వారి వద్ద ఉన్న ఆయుధాలన్నీ నాశనం కావడంతో.. రాణి వేలు నాచియార్ సైన్యం సులభంగా బ్రిటిష్ వారిని తుదముట్టించి శివగంగ కోటను తిరిగి కైవసం చేసుకుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై విజయం సాధించి.. రాజ్యాన్ని తిరిగి పొందిన మొట్టమొదటి భారతీయ రాణిగా వేలు నాచియార్ చరిత్రకెక్కారు. ఆ విజయం వెనుక ఉన్న అసలైన శక్తి – తన ప్రాణాలను త్యాగం చేసిన కుయిలీ.
ప్రపంచ చరిత్రలో రికార్డయిన మొట్టమొదటి హ్యూమన్ బాంబ్ (సుసైడ్ బాంబర్) ఒక భారతీయ వీరనారి కావడం.. ఆమె బ్రిటిష్ అధికారాన్ని తుత్తునియలు చేయడానికి తనను తాను త్యాగం చేయడం మన దేశ చరిత్రలోని అపూర్వ ఘట్టంగా చెప్పుకోవచ్చు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..