తెలంగాణ ఖజానా ఖాళీ.. ఉచిత పథకాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన.. కోటీశ్వరులకు రైతుబంధు ఇవ్వడంపై నిలదీత..
TS High court
తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత సంక్షేమ పథకాలు, వాటి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిమితి లేని ఉచిత పథకాల విధానం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో త్వరలోనే తీవ్రమైన ప్రమాదకర ఆర్థిక పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాపై విపరీతమైన ఒత్తిడి పెరగడానికి ఈ అపరిమిత ఉచిత పథకాలే ప్రధాన కారణమని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన సర్ఛార్జి బకాయిల విడుదలపై గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కోటీశ్వరులకు కూడా రైతుబంధు (రైతు భరోసా), లగ్జరీ బైక్లు, ఐఫోన్లు వాడే అనర్హులకు ఉచిత బియ్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఉచితాల ప్రభావంతో గ్రామాల్లో స్థానిక కూలీలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలు కష్టపడి పనిచేసే సంస్కృతి తగ్గిపోతోందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే.. సుమారు 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అనర్హులను తొలగించాల్సిన బాధ్యత ఎవరిదని నిలదీసింది.
ఈ కేసు విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే రూ. 25.45 కోట్లు విడుదల చేశామని, మిగిలిన బకాయిలను ఆరు నెలల వాయిదాల్లో చెల్లిస్తామని కోర్టుకు వివరించారు. ఆయన అందించిన హామీతో సంతృప్తి చెందిన ధర్మాసనం.. అధికారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది.
ఇదే విచారణ సందర్భంగా.. పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న పార్ట్-టైమ్ స్వీపర్లకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కనీస వేతనాలు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను నాలుగు వారాల్లోగా అమలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
- Telangana ACB Bribe Cases: అవినీతి సొమ్ముతో ఏసీబీకి అడ్డంగా దొరుకుతున్న అధికారులు.. రూ.4 లక్షల లంచంతో GHMC అధికారి, రూ.1 లక్ష కేసులో DMHO అరెస్ట్..
- Who is Neha Bora? ఎవరీ నేహా బోరా..? జంతర్ మంతర్ ఆందోళనల్లో మెరిసిన ధిక్కార స్వరం.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..
- Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!