Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పార్టీ విరాళాల స్వీకరణలో డీఎంకే టాప్…రూ. 140 కోట్లతో వైసీపీ 3వ స్థానం..టీడీపీది 4వ స్థానం

Prajapaksham 07 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
పార్టీ విరాళాల స్వీకరణలో డీఎంకే టాప్…రూ. 140 కోట్లతో వైసీపీ 3వ స్థానం..టీడీపీది 4వ స్థానం

పార్టీ విరాళాల స్వీకరణలో డీఎంకే టాప్...రూ. 140 కోట్లతో వైసీపీ 3వ స్థానం..టీడీపీది 4వ స్థానం

2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,051.56 కోట్లు స్వీకరించిన ప్రాంతీయ పార్టీలు

అంతకుముందు ఏడాదితో పోలిస్తే అధికం

దేశంలోని ప్రాంతీయ పార్టీలు రూ.20 వేలకంటే ఎక్కువగా స్వీకరించిన విరాళాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024–25 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగింది. అందులో డీఎంకే అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికను విడుదల చేసింది.

నివేదిక ప్రకారం… ప్రాంతీయ పార్టీలు స్వీకరించిన విరాళాల మొత్తం విలువ 2023–24లో రూ.347.69 కోట్లు ఉండగా, 2024–25లో రూ.1,051.56 కోట్లకు పెరిగింది. ఈ రెండేళ్లలో స్వీకరించిన విరాళాల సంఖ్య 2023–24లో 2,861 కాగా, 2024–25లో 5,297గా ఉంది. అంటే 85 శాతం పెరుగుదల నమోదైంది.

రాజకీయ నిధుల సేకరణలో కార్పొరేట్, వ్యాపార సంస్థల ఆధిపత్యం కొనసాగింది. 2024–25లో అవి రూ.644.93 కోట్ల విరాళాలు అందించాయి. ఇది అంతకుముందు ఏడాది ఇచ్చిన రూ.227.61 కోట్లతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అయితే మొత్తం విరాళాల విలువలో వాటి వాటా స్వల్పంగా తగ్గింది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కార్పొరేట్, వ్యాపార సంస్థలు 650 విరాళాల ద్వారా రూ.872.54 కోట్లు అందించాయి. ఇది మొత్తం విరాళాల విలువలో 62 శాతానికి పైగా ఉంది.

వ్యక్తిగత దాతల నుంచి అత్యధిక సంఖ్యలో విరాళాలు అందాయి. రెండేళ్లలో వారు 5,647 విరాళాలు ఇచ్చారు. అయితే వారు అందించిన మొత్తం రూ.193.95 కోట్లు మాత్రమే. ఇది మొత్తం విరాళాల విలువలో సుమారు 14 శాతం. 2024–25లో వ్యక్తిగత విరాళాల సంఖ్య పెరిగినప్పటికీ, వాటి మొత్తం విలువ తగ్గింది. దీనివల్ల మొత్తం విరాళాల్లో వారి వాటా గణనీయంగా పడిపోయింది.

గుర్తు తెలియని లేదా వివరాలు వెల్లడించని దాతల నుంచి వచ్చిన విరాళాల్లో భారీ పెరుగుదల ఉన్నట్లు కూడా ఈ నివేదిక పేర్కొంది. 2023–24లో రూ.6.62 కోట్లుగా ఉన్న ఈ విరాళాలు 2024–25లో రూ.302.67 కోట్లకు పెరిగాయి. తద్వారా మొత్తం విరాళాల విలువలో వాటి వాటా దాదాపు 29 శాతానికి చేరింది.

వివరాలు వెల్లడించని దాతల నుంచి అత్యధిక మొత్తాన్ని ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్వీకరించింది. ఆ మొత్తం రూ.300.64 కోట్లు కాగా, ఇది ఆ ఏడాది ఆ పార్టీ పొందిన మొత్తం ప్రకటించిన విరాళాల్లో 82 శాతానికి పైగా ఉంది.

2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.365.78 కోట్ల విరాళాలను ప్రకటించడం ద్వారా తమిళనాడుకు చెందిన ఆ పార్టీ అత్యధిక విరాళాలు పొందిన పార్టీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.184.96 కోట్లతో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), రూ.140.04 కోట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నాయి. 2023–24లో రూ.100.19 కోట్లతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది.

టీఎంసీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బిజు జనతా దళ్ (బీజేడీ) వంటి పార్టీలు దాదాపు పూర్తిగా కార్పొరేట్, వ్యాపార సంస్థల విరాళాలపైనే ఆధారపడ్డాయని, ఇతర వర్గాల నుంచి వచ్చిన విరాళాలు చాలా తక్కువగా లేదా అసలు లేవని నివేదిక పేర్కొంది.

ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ‘ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’ అతిపెద్ద దాతగా నిలిచింది. ఇది 38 విరాళాల ద్వారా రూ.434 కోట్లను అందించింది. ఆ తర్వాత రూ.160 కోట్లతో ‘టైగర్ అసోసియేట్స్’ నిలిచింది. ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్’, ‘వేదాంత లిమిటెడ్’, ‘ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్’ కూడా టాప్-5 దాతల జాబితాలో ఉన్నాయి.

రాజకీయ నిధుల సేకరణలో ఎలక్టోరల్ ట్రస్టుల ఆధిపత్యం కొనసాగింది. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ కలిసి రూ.536 కోట్లను అందించాయి. ఇది ఆ రెండేళ్ల కాలంలో టాప్-10 దాతలు అందించిన మొత్తం విరాళాల్లో దాదాపు 64 శాతానికి సమానం.

పాన్ వివరాలు లేని విరాళాల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.7.69 కోట్ల నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.329.58 కోట్లకు భారీగా పెరిగిందని, ఇది ఆ సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 31 శాతానికి పైగా ఉందని నివేదిక వెల్లడించింది. పాన్ వివరాలు లేని విరాళాల సంఖ్య కూడా అంతకుముందు ఏడాది ఉన్న 529 నుంచి 2,463కు పెరిగింది.

అలాగే, నగదు రూపంలో వచ్చిన విరాళాల విలువ అంతకుముందు ఏడాది రూ.6.54 కోట్ల నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.301.44 కోట్లకు భారీగా పెరిగిందని, అదే సమయంలో చెల్లింపు విధానాన్ని వెల్లడించకుండా రూ.13.39 కోట్ల విలువైన 1,978 విరాళాలు నమోదయ్యాయని కూడా నివేదిక పేర్కొంది.

ట్యాగ్‌లు: andhra pradesh TDP YSRCP