Telangana Weather: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం మోస్తరు వర్షాలు పడే అవకాశం..
Telangana Weather: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం మోస్తరు వర్షాలు పడే అవకాశం..
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో, ఆగస్టు 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
అయితే, ఆగస్టు 6 నుంచి 8వ తేదీ మధ్య ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు లేవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణించే వారు వర్షం, గాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
ఉత్తర, పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో లోటు వర్షాలు
రాష్ట్ర స్థాయిలో చూస్తే, ఆగస్టు, సెప్టెంబర్ కలిపి తెలంగాణలో వర్షపాతం సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, దక్షిణ భాగాల్లో వర్షపాతం లోటు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
అయితే, కేవలం ఆగస్టు నెలకు సంబంధించి చూస్తే, తూర్పు, ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, మిగిలిన పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మాత్రం సాధారణం నుంచి తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం
ఆగస్టు నెలలో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రమంతటా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయన్నారు.
రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని, దీని వల్ల ఆగస్టు నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉక్కపోత, ఉమ్మడి తేమతో కూడిన వాతావరణం నెలకొనవచ్చని వివరించారు.