Bhogapuram Airport : విశాఖ పాత ఎయిర్‌పోర్టుకు గుడ్‌బై.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు VTZ కోడ్..
alluri sitarama raju international airport
ఉత్తరాంధ్ర విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘VTZ’ ఎయిర్పోర్ట్ కోడ్ కేటాయించగా, ఇప్పటి వరకు వాణిజ్య విమాన సర్వీసులకు కేంద్రంగా ఉన్న విశాఖపట్నం పాత విమానాశ్రయంలో షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్లు నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులన్నీ దశలవారీగా భోగాపురం విమానాశ్రయం నుంచి నిర్వహించబడనున్నాయి.
Bhogapuram Airport: ఏడు దశాబ్దాల పౌర విమానయాన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ దేగా సివిల్ ఎన్క్లేవ్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులకు ఆగస్టు 17తో అధికారికంగా ముగింపు పలకనుంది. అదే రోజు నుంచి అన్ని షెడ్యూల్డ్ దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులు విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్నాయి.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. భోగాపురం విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసింది. ఆగస్టు 17 తెల్లవారుజామున 12.01 గంటల నుంచి కొత్త విమానాశ్రయం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
2016లో భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం అనుమతులు ఇచ్చినప్పుడు విధించిన షరతుల ప్రకారం.. కొత్త విమానాశ్రయం ప్రారంభమైన తేదీ నుంచి 30 సంవత్సరాల పాటు విశాఖ ఐఎన్ఎస్ దేగా సివిల్ ఎన్‌క్లేవ్‌లో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులు నిర్వహించరాదు. అలాగే ఇప్పటి వరకు విశాఖపట్నానికి గుర్తింపుగా ఉన్న VTZ IATA కోడ్ కూడా అధికారికంగా భోగాపురం విమానాశ్రయానికి బదిలీ అయింది.
అయితే పాత విశాఖ విమానాశ్రయం పూర్తిగా మూతపడడం లేదు. తూర్పు నౌకాదళ కమాండ్‌కు చెందిన ఐఎన్ఎస్ దేగా ఎయిర్‌బేస్ సైనిక అవసరాల కోసం యథావిధిగా కొనసాగుతుంది. రక్షణ దళాలు, ప్రభుత్వ విమానాలు, అత్యవసర సేవలు, వీఐపీ విమానాలు, అలాగే షెడ్యూల్ కాని చార్టర్డ్, వాణిజ్యేతర విమానాలకు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతి ఉంటుంది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సైనిక విమానాశ్రయంగా ప్రారంభమైన ఐఎన్ఎస్ దేగా.. 1954లో పౌర విమాన సర్వీసులకు తెరతీసింది. 2010లో అంతర్జాతీయ హోదా పొందిన ఈ విమానాశ్రయం మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందిస్తూ ఏటా లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందించింది.
అయితే ప్రయాణికుల రద్దీ, కార్గో అవసరాలు పెరగడం, రన్‌వే విస్తరణకు స్థలాభావం వంటి కారణాలతో విశాఖ విమానాశ్రయం విస్తరణ సాధ్యం కాకపోవడంతో భోగాపురంలో అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు.
ఇక నుంచి ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ గేట్వేగా నిలవనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త ఊపునివ్వనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
- HYDRAA: లోతుకుంట 40 ఎకరాల భూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
- HYDRAA: హైడ్రాకు సుప్రీంకోర్టులో భారీ షాక్.. కంటోన్మెంట్ 40 ఎకరాల భూమి కేసులో ఎదురుదెబ్బ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత..
- US Space Weapons: అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికాపై మండిపడిన చైనా.. మరో కొత్త వార్‌పై అంతర్జాతీయంగా ఆందోళన..
- UPI Charges Row: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపు.. మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గిందంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Alla Nani passed away: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత..