Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ఎవరిది..? కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు..

Prajapaksham 01 Aug 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ఎవరిది..? కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు..

alluri sitarama raju international airport

భోగాపురం క్రెడిట్ ఎవరిది? ఇప్పుడు మొత్తం చర్చ దీనిపైనే నడుస్తోంది.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కాగా, దీని చుట్టూ రాజకీయాలు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరి హయాంలో జరిగింది? దీనికి క్రెడిట్ ఎవరిది? అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది. అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రెండూ కూడా తమ క్రెడిట్ అంటే తమదే అని గొప్పలు చెప్పుకుంటున్నాయి.

నిజానికి 2009 సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖపట్నానికి మరో విమానాశ్రయం అవసరాన్ని గుర్తించినట్లు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితమే విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు పునాది పడ్డట్లు బొత్స పేర్కొంటున్నారు. అయితే, వాస్తవానికి 2013 సంవత్సరంలోనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ ప్రతిపాదనలు పంపిందని అధికారిక వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి.

ఇక 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటూ మళ్లీ ప్రకటనలు చేశారు. కానీ పనులన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. భూసేకరణ పూర్తి స్థాయిలో జరగలేదు. అప్పట్లో విమానయాన శాఖ మంత్రిగా టిడిపికి చెందిన ప్రస్తుత గవర్నర్ అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ, పనులు వేగవంతంగా, చురుగ్గా సాగలేదు. అయితే క్లియరెన్సుల విషయంలో మాత్రం నాలుగు అడుగులు ముందుకు పడ్డాయని టిడిపి చెబుతోంది.

కానీ 2019 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, భూ నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించడంతో పాటు ఇతర ప్రధానమైన అడ్డంకులు తొలగిపోయి విమానాశ్రయం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని వైసీపీ చెబుతోంది. 2023 మే నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి, రెండు సంవత్సరాల్లో విమానాశ్రయం పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించినట్లు వైసీపీ పేర్కొంటోంది.

అంతేకాదు, ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకంపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటమే ఇందుకు సాక్షమని వైసీపీ వాదిస్తోంది. గ్రౌండ్ వర్క్ పూర్తిగా చేసి పెట్టడం వల్లనే ప్రస్తుతం ఈ విమానాశ్రయం చకచకా రెండు సంవత్సరాల్లో పూర్తయిందని వైసీపీ చెబుతోంది.

అయితే కూటమి మాత్రం కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతోనే పనులు చకచకా ముందుకు కదిలాయని, కేవలం 25 నెలల స్వల్ప వ్యవధిలో విమానాశ్రయం పూర్తయిందని కూటమి నేతలు చెబుతున్నారు.

అయితే, నిజానికి ఈ విమానాశ్రయం మొత్తం రాజకీయ క్రెడిట్ వార్ ఎలా ఉన్నప్పటికీ, భోగాపురం విమానాశ్రయం తయారవడానికి దాదాపు పది సంవత్సరాలకు పైగా సమయం పట్టినట్లు చూడవచ్చు. గతంలో తెలంగాణలో ఏర్పాటు చేసిన శంషాబాద్ విమానాశ్రయం విషయంలో కూడా ఇదే విధంగా చర్చలు జరిగాయి. అంతకుముందు టిడిపి హయాంలో శంషాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయగా, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విమానాశ్రయం పనులు పూర్తయ్యాయి. అప్పుడు కూడా ఇలాంటి వాదనలే ముందుకు వచ్చాయి.

ట్యాగ్‌లు: andhra pradesh Bhogapuram Airport