ఏపీలో 45 లక్షల ఓట్లు తొలగింపు.. ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల ఈసీ
Voter List
ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓటరు నమోదుల్లో మార్పులు జరిగినట్లు సమాచారం వెలువడింది. లక్షలాది పేర్లు తొలగించబడినట్లు వార్తలు రావడంతో, తమ పేరు తాజా ఓటరు జాబితాలో ఉందో లేదో ప్రతి ఓటరూ ఒకసారి తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అనంతరం భారత ఎన్నికల సంఘం (ECI) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా సుమారు 45 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి పేర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం తొలగించిన ఓట్లలో 22.30 లక్షల మంది చిరునామా మార్చిన లేదా అందుబాటులో లేని వారు, 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్న వారు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను జూన్ 15 నుంచి జూలై 24 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించారు.
ఈ సర్వేలో రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 3.71 కోట్ల మంది (89.22 శాతం) నుంచి బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించారు. అయితే 44,89,512 మంది ఓటర్ల నుంచి ఫారాలు సేకరించలేకపోయామని ఈసీ తెలిపింది. వీరిలో కొందరు వలస వెళ్లడం, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం, ఫారాలు సమర్పించకపోవడం లేదా ఓటరుగా కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలు ఉన్నాయని అధికారులు వివరించారు.
అయితే, తమ పేరు జాబితాలో లేకపోయిందని అర్హులైన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఈఓ స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. పేరు తొలగిపోయిన వారు ఫారం-6తో పాటు అవసరమైన డిక్లరేషన్ సమర్పించి తమ పేరును తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారికి వారు కోరుకున్న ఒకే చోట ఓటు కొనసాగించే అవకాశం కల్పిస్తారు.
తొలగించిన ఓటర్ల జాబితాను రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారులు, సీఈఓ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంచారు. వచ్చిన క్లెయిమ్లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ భారీ ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, 46,397 మంది బీఎల్ఓలు సమన్వయంతో పనిచేశారని సీఈఓ అభినందించారు. అలాగే రాజకీయ పార్టీల భాగస్వామ్యం కూడా పెరిగిందని, బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) సంఖ్య 68,868 నుంచి 1,27,868కు పెరగడం దీనికి నిదర్శనమని తెలిపారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
- Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 అడుగులుకు చేరిన నీటి మట్టం..రెండో ప్రమాద హెచ్చరికతో హై అలర్ట్..
- వీడియో ఇదిగో.. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.. మిత్రుడిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు..
- ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం..ఇరాన్ తాజా దాడులతో హార్ముజ్జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు..
- రైతులకు గుడ్న్యూస్.. పీఎం-కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం
- భ్రమలు గొలుపుతున్న కోచింగ్ సెంటర్లు