TAFRC Fee Warning: అదనపు వసూళ్లు చేస్తే చర్యలు…ఇంజినీరింగ్ కాలేజీలకు టీఎఎఫ్ఆర్సీ హెచ్చరిక
అదనపు వసూళ్లు చేస్తే చర్యలు...ఇంజినీరింగ్ కాలేజీలకు టీఎఎఫ్ఆర్సీ హెచ్చరిక
ట్యూషన్ ఫీజు కాకుండా ఇతర పేర్లతో రుసుములు వసూలు చేయొద్దు
ప్రైవేట్, అన్ఎయిడెడ్ ఇంజినీరింగ్ కళాశాలలకు టీఎఎఫ్ఆర్సీ హెచ్చరిక
ప్రతి విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టీకరణ
రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజు కాకుండా ఇతర పేర్లతో అదనపు రుసుములను వసూలు చేస్తే తీవ్ర చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ) హెచ్చరించింది. కళాశాలలు వసూలు చేసే అదనపు ఫీజులకు ప్రతి విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు టీఎఎఫ్ఆర్సీ మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ వృత్తి విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ఫీజులకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే, లేదా రశీదులు ఉన్నా టీఎఎఫ్ఆర్సీ కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సూచించింది.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ప్రైవేట్ కళాశాలలు అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు టీఎఎఫ్ఆర్సీ తెలిపింది. ట్యూషన్ ఫీజు, ఎస్టీఏ ఫీజు, స్పెషల్ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఫీజు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, యూనిఫాం ఫీజు ఇలా రకరకాల పేర్లతో విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలు అదనపు ఫీజులను వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు మినహా, ఇతర పేర్లతో అదనపు మొత్తాలను వసూలు చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కమిటీ స్పష్టం చేసింది. ఇలా చిన్న మొత్తంలో ఫీజులను వసూలు చేసినప్పటికీ ‘క్యాపిటేషన్ ఫీజు (డొనేషన్)’ కిందకే వస్తుందని, ఇలా వసూలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని, యాజమాన్యాలు నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే రూ.2 లక్షల జరిమానాతో పాటు సంబంధిత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కళాశాలలు అదనపు ఫీజులను డిమాండ్ చేస్తే తల్లిదండ్రులు ఆధారాలతో సహా తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి, సదరు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఎఎఫ్ఆర్సీ వెల్లడించింది.