Skip to content
జాతీయం వార్తలు

బీహార్ లో విద్యార్థులపై ఎకె 47 తో దాడి…ప్రధాని క్షమాపణ చెప్పాలి

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
బీహార్ లో విద్యార్థులపై ఎకె 47 తో దాడి…ప్రధాని క్షమాపణ చెప్పాలి

విద్యార్థులపై ఎకె 47 తో దాడి...ప్రధాని క్షమాపణ చెప్పాలి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి – బిహార్‌ ఘటనపై రాహుల్ గాంధీ డిమాండ్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బిహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఎకె 47 రైఫిళ్లతో చేసిన దాడిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కూడా గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిజాయితీ లేనిదని, సంస్కరణలు దాని సామర్థ్యానికి మించినవని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు.

‘మొత్తం వ్యవస్థ విద్యార్థుల పట్ల పూర్తిగా హంతకంగా ప్రవర్తిస్తోంది. బిహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఎకె 47లతో కాల్పులు జరిపినట్లు నివేదికలు వస్తున్నాయి. వందలాది మందిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్ ఇన్ హిందీ’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘మోదీ జీ, విద్యార్థులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైంది? దానికి బదులుగా, వారు ప్రాణాంతక దాడులకు, క్రూరత్వానికి గురవుతున్నారు’ అని ఆయన అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్లు, బిహార్‌లో ఎకె 47లు ఉపయోగించారని, ఉత్తర ప్రదేశ్ అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, బీహార్ అయినా, ఢిల్లీ అయినా అన్నిచోట్లా ఒకే తీరు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదని, సంస్కరణలు చేపట్టడం దాని సామర్థ్యానికి మించినదని తాను ఇదివరకే చెప్పానన్నారు. కేంద్రం తన వాగ్దానాలను ఉల్లంఘించి, విద్యార్థుల గొంతులను అణచివేయడానికి ప్రతీ ఎత్తుగడను ప్రయోగిస్తుందని దుయ్యబట్టారు.

విద్యార్థులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా, దేశ విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని, వారిపై దాడి చేసి క్రూరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నీట్ పేపర్ లీక్, నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు మద్దతుగా శనివారం బిహార్ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి, వాటిలో కొన్ని హింసాత్మకంగా మారాయి. సీవాన్‌లో జరిగిన నిరసన సందర్భంగా నిరసనకారులపై పోలీసులు ఎకె 47లతో కాల్పులు జరిపారని బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు.

కానిస్టేబుల్ సస్పెన్షన్

బిహార్‌లోని సివాన్ జిల్లాలో ఈనెల 25న జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎకె 47 రైఫిల్‌ను ఉపయోగిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

సివాన్ ఎస్పి పూరన్ కుమార్ ఝా పిటిఐతో మాట్లాడుతూ, ‘జిల్లా ఇంటెలిజెన్స్ యూనిట్ (డిఐయు)లో పనిచేస్తున్న సదరు కానిస్టేబుల్, విద్యార్థుల నిరసన సమయంలో ఎకె 47 రైఫిల్‌ను ఉపయోగిస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ కావడంతో తక్షణమే సస్పెండ్ అయ్యారని, అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నిరసన సమయంలో ఆ కానిస్టేబుల్ ఏ పరిస్థితుల్లో ఎకె 47 రైఫిల్‌ను ఉపయోగించారో తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించినట్లు ఎస్పి చెప్పారు. నిరసన ప్రదర్శన సమయంలో కాల్పులు జరపకూడదని పోలీసు బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు.

ట్యాగ్‌లు: BJP CJP Indian Politics