Tarimela Nagi Reddy: సంచలనం సృష్టించిన తరిమెల నాగిరెడ్డి కుట్రకేసు!
(జులై 28, నేడు తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా)
–ముప్పాళ్ళ భార్గవ శ్రీ
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవకారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి రాష్ట్ర కమిటీ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డివి), తరిమెల నాగిరెడ్డి (టిఎన్) తదితర నాయకులు ఉండగా చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని ఫలితంగా అరెస్టు కాలేదు. మద్రాసు సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా, జలగం వెంగళరావు హోం మంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్రకేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్రకేసు’ అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్రకేసు’గా బహుళ ప్రచారం పొందింది.
దీనికి ముఖ్యమైన కారణం వీరిపై పెట్టబడిన కుట్ర కేసును డివి, టిఎన్లు స్వయంగా వాదించి.. మేము ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్రపన్నలేదు, కమ్యూనిస్టులు ఎప్పుడూ తమ భావాలను బాహాటంగా ప్రకటిస్తారని.. ప్రకటించి సంచలనం సృష్టించారు. వీరు స్వయంగా కోర్టులో వాదించటానికి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, భారత విప్లవోద్యమంలోనూ నాటి విప్లవకారులు నెలకొల్పిన విప్లవ సంప్రదాయాల వెలుగులో డివి, టిఎన్లు నడిచారు. వారికి ప్రేరణ కలిగించిన వాటిలో ముఖ్యమైనది రీచ్స్టాగ్ కుట్ర కేసు. బల్గేరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జార్జ్ డిమిట్రావ్ బెర్లిన్లోని పార్లమెంటు భవనం రీచ్స్టాగ్ని తగలబెట్టారనే నెపంతో పెట్టిన కుట్రకేసులో డిమిట్రోవ్ తాను స్వయంగా కోర్టులో వాదించి నిర్దోషిగా బయటపడి సంచలనం సృష్టించారు. మనదేశంలో బ్రిటిష్ వాళ్ళ చేత పెట్టబడిన మీరట్, కాన్పూర్ కుట్రకేసుల్లో ముద్దాయిలు కోర్టులో తాము కమ్యూనిస్టులమని సగర్వంగా ప్రకటించుకున్నారు. టిఎన్, డివిలు కుట్ర కేసుల విషయంలో ఆనాటి కమ్యూనిస్టు నాయకులు పెట్టిన వరవడిని ఆదర్శంగా తీసుకున్నారు.
మద్రాసులో అరెస్టయిన వీరిపై పెట్టబడిన కుట్ర కేసును 1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనములో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ’తక్షణ కార్యక్రమం’ ఆధారంగా దానిని ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి పన్నిన కుట్రగా ముద్ర వేయడానికి పూనుకుంది. 1970 జూన్లో ఈ కుట్ర కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో డివి, టిఎన్లు కమ్యూనిస్టు విప్లవకారులు రూపొందించిన మౌలిక డాక్యుమెంటు అయిన ’తక్షణ కార్యక్రమం’ను సొంతం చేసుకొని, దాన్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. అంతేకాదు ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసికూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవ సంప్రదాయాలకు పట్టం కట్టారు. అందరూ ఊహించినట్టుగానే హైదరాబాద్లో ని సెషన్స్ కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు ఈ శిక్షలను ఖరారు చేసింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిషన్స్ పైన జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో ఈ కుట్ర కేసులో ఉన్న ముఖ్య నాయకులందరూ డివి, టిఎన్లతో సహా రహస్యజీవితానికి వెళ్లిపోయారు.
కామ్రేడ్స్ డివి, టిఎన్లు ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్మెంట్ను కుట్రకేసులో ఉన్న అందరి తరపున డివి తయారుచేసి కేసు విచారణ సందర్భంగా కోర్టులో వివరించారు. ఈ ప్రకటన డివి స్టేట్మెంట్గా బహుళ ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టిఎన్ ‘తాకట్టులో భారతదేశం‘ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన జాతీయ అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమం’కు అన్వయించి రాసిన స్టేట్మెంట్ను టిఎన్ కోర్టులో రెండు గంటలపాటు ఎంతో శక్తివంతంగా వివరించారు. కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్ముతున్నామో వివరించారు. ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో వాటిని రాజకీయంగా సమర్థించుకుంటూ కోర్టులో బాహాటంగా ప్రకటించటం విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచింది.
ఈ కుట్ర కేసులో పెట్టబడిన ముద్దాయిలు డివి, టిఎన్లతో సహా ముఖ్య నాయకులు పి రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, మాదల నారాయణస్వామి, వసంతాడ రామలింగాచారి, మండ్ల సుబ్బారెడ్డి, ఎన్ వి కృష్ణయ్య, చల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పుల మోహన్ రెడ్డి తదితరులు వివిధ కారణాలతో చనిపోయారు. అయితే జూలై నెలకున్న ప్రాధాన్యత ఏమిటంటే ఈ కుట్ర కేసులోని ప్రముఖ నాయకులు డివి అనారోగ్యంతో జులై 12, 1984లో చనిపోగా, టిఎన్ ఎమర్జెన్సీ కాలములో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్లో జులై 28, 1976లో చనిపోయారు. రాజీలేని పోరాటం సాగించిన భారత విప్లవోద్యమ ముద్దుబిడ్డలు డివి, టిఎన్లకు విప్లవ జోహార్లు అర్పిద్దాం!