Skip to content
తెలంగాణ వార్తలు

Bandi Sanjay: బండి స్థానంలో కేంద్ర కేబినేట్ లో కొత్త ముఖం..? ఈటెల, అరవింద్‌లకు ఛాన్స్.. లేక సీఎం రమేష్ ఎగరేసుకుపోతారా..? 

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Bandi Sanjay: బండి స్థానంలో కేంద్ర కేబినేట్ లో కొత్త ముఖం..? ఈటెల, అరవింద్‌లకు ఛాన్స్.. లేక సీఎం రమేష్ ఎగరేసుకుపోతారా..? 

Bandi Sanjay: బండి స్థానంలో కేంద్ర కేబినేట్ లో కొత్త ముఖం..? ఈటెల, అరవింద్‌లకు ఛాన్స్.. లేక సీఎం రమేష్ ఎగరేసుకుపోతారా..? 

– తెలంగాణలో బీసీ కార్డు ప్లే చేస్తే ఈటెల లేదా అరవింద్‌కే మొదటి ప్రాధాన్యత
– ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరంగా మారిన కేంద్ర కేబినెట్ రేసు
– అమిత్ షాల కనుసన్నల్లో కీలక వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న సీఎం రమేష్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణతో పాటు, గృహశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై పదవీ గండం పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల నుండి తదుపరి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే నాయకులు ఎవరనే దానిపై ఢిల్లీ వేదికగా తీవ్ర చర్చ నడుస్తోంది. గత బీజేపీ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మొత్తానికి కేవలం జి.కిషన్ రెడ్డికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత కేబినెట్‌లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఏపీ నుంచి శ్రీనివాస వర్మ ఉన్నారు. కూటమి ధర్మంలో భాగంగా ఏపీ నుంచి టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఒకవేళ బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే, ఆ ఖాళీని తెలంగాణ నేతలతో భర్తీ చేస్తారా? లేక పొరుగున ఉన్న ఏపీలోని కీలక నేతకు కడతారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ పోటీ: ‘బీసీ’ కార్డుపై ఈటెల vs అరవింద్

తెలంగాణలో బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని భర్తీ చేయాలంటే సాంఘిక సమీకరణలు, ముఖ్యంగా బీసీ సామాజికవర్గం ఓటు బ్యాంకును కాపాడుకోవడం అధిష్టానానికి అత్యంత కీలకం. ఈ రేసులో ఇద్దరు ముఖ్య నాయకులు ముందు వరుసలో ఉన్నారు:

ఈటెల రాజేందర్:
తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, బీసీ సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు.
పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో సంజయ్ స్థానంలో సీనియర్, అనుభవజ్ఞుడైన ఈటెలకు అవకాశం ఇస్తే పార్టీలో సమన్వయం పెరుగుతుందని ఒక వర్గం భావిస్తోంది.
పార్లమెంటరీ పరిపాలనా అనుభవం కూడా ఆయనకు అదనపు బలంగా మారనుంది.

ధర్మపురి అరవింద్:
నిజామాబాద్ నుంచి వరుసగా రెండోసారి గెలిచి తన స్థానాన్ని బలపరచుకున్న అరవింద్ కూడా బీసీ వర్గానికి చెందిన అగ్రనేత. పసుపు బోర్డు సాధనతో పాటు నిజామాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గట్టి పోటీ ఇచ్చిన ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బీసీ ముద్రతో పాటు యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అరవింద్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది.

సీఎం రమేష్.. ‘మాస్టర్ మైండ్’కు పదవి దక్కేనా ?
ఈ ఇద్దరు తెలంగాణ నేతలకు గట్టి పోటీ ఇస్తూ, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పేరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.

ఢిల్లీ లెవల్ ఆపరేషన్లు: సీఎం రమేష్‌ను కేవలం సాధారణ ఎంపీగా చూడలేం. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక ఎంపీలు ఎన్డీఏ తీర్థం పుచ్చుకోవడంలో సీఎం రమేష్ అత్యంత కీలకమైన తెరవెనుక పాత్ర పోషించినట్లు ప్రచారం జరిగింది.

అమిత్ షా నమ్మకస్తుడిగా: ఈ వ్యూహాత్మక ఆపరేషన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అధిష్టానం కనుసన్నల్లో సీఎం రమేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడంలో ఆయనకున్న నేర్పరితనం అధిష్టానాన్ని ఆకట్టుకుంది.

చంద్రబాబుతో సత్సంబంధాలు: ఒకప్పుడు టీడీపీలో క్రియాశీలకంగా ఉండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సీఎం రమేష్‌కు కేంద్రంలో పదవి దక్కితే, అది ఎన్డీఏ కూటమిలో బీజేపీ-టీడీపీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

పదవి ఎవరికి?
తెలంగాణ నుంచి బీసీ కార్డు ఆధారంగా ఈటెల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేయవచ్చని ఒక వ్యూహం నడుస్తుంటే.. రాజకీయ చదరంగంలో కేంద్ర నాయకత్వానికి నమ్మకమైన ‘ట్రబుల్ షూటర్’గా మారిన సీఎం రమేష్ ఈ పదవిని ఎగరేసుకుపోతారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అధిష్టానం ప్రాంతీయ ప్రాధాన్యతలకు పీట వేస్తుందో, లేదా పవర్ ఫుల్ పాలిటిక్స్ చేసే నాయకుడికి పట్టంగడుతుందో వేచి చూడాలి.

ట్యాగ్‌లు: BJP Indian Politics