El Niño Alert: రైతులారా జాగ్రత్త.. ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ సర్కార్ హెచ్చరిక..వరి పంట బదులు వేరే పంటలు వేయాలని కీలక సూచన..
Thummala Nageswara rao
El Niño Alert: ఎల్-నినో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల నుంచి సేకరించిన సూచనలతో రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎల్-నినో వల్ల ఉత్పన్నమయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం సచివాలయంలో ఎల్-నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఉన్నతాధికారులు, వాతావరణ నిపుణులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను, మార్గదర్శకాలను వెల్లడించారు.
భారత వాతావరణ శాఖ (IMD) నివేదికల ప్రకారం వచ్చే నెలల్లో కూడా ఎల్-నినో ప్రభావం కొనసాగుతుందని, సెప్టెంబర్, డిసెంబర్ నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌తో పాటు రబీపైనా దీని ప్రభావం ఉండే ప్రమాదం ఉన్నందున రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందని.. ఒకటి రెండు జిల్లాలు మినహా మరెక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కురుస్తున్న చెదురుమదురు వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయొద్దని, బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని ఆయన హెచ్చరించారు.
నీటి కొరత నేపథ్యంలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, పత్తికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో కూరగాయల సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు, డ్రిప్ పరికరాలు, ఎరువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైతే రైతు వేదికల ద్వారా వాటి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు తెప్పించి సబ్సిడీపై అందించేలా కేంద్రంతో చర్చించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణ కేటాయింపులను పెంచాలని మంత్రి బ్యాంకు అధికారులను కోరారు. ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ సేద్యం) పరికరాలైన డ్రిప్, స్ప్రింక్లర్లకు సబ్సిడీ పెంచేలా నాబార్డు నుంచి RIDF కింద రూ. 498 కోట్లు రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు. మేజర్, మైనర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ఆ నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించే పరిస్థితి ఉందని ఆయన వివరించారు.
జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన తరహాలోనే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై కలెక్టర్లతో చర్చించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కేవలం నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు, చెరువుల పూడికతీత, ఫార్మ్ పాండ్ల నిర్మాణాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా అందిన సూచనల మేరకు నీటి పొదుపు పద్ధతులను విస్తృతంగా చేపట్టాలని, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందించాలని కోరారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు 24 శాతం లోటు వర్షపాతం ఉందని, దీని వల్ల ఈ ఏడాది సుమారు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేలా సమగ్ర రాష్ట్ర స్థాయి కార్యాచరణను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.