Coffee and Heart Health: కాఫీ తాగే వారికి శుభవార్త.. రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
Coffee and Heart Health: Up to Five Cups Daily May Not Increase Risk
Coffee and Heart Health: రోజుకు ఐదు కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమేనని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. పీర్-రివ్యూడ్ జర్నల్ ‘సర్క్యులేషన్’లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. పెద్దవయస్సు వారు రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. 8-ఔన్సుల కాఫీ కప్పులో ఉండే కెఫీన్ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇది రోజుకు సుమారు ఐదు కప్పుల కాఫీకి సమానం. ఈ మోతాదుకు మించకుండా కెఫీన్ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం (స్ట్రోక్) వంటి ముప్పులను తగ్గించుకోవచ్చని శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ వైద్యశాస్త్ర ప్రొఫెసర్ గ్రెగొరీ ఎం మార్కస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం స్పష్టం చేసింది.
అయితే కాఫీలో పంచదార లేదా క్రీమ్ కలపని బ్లాక్ కాఫీని మాత్రమే తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. కాఫీలో సాధారణంగా కలిపే చక్కెర, ఫ్లేవర్డ్ సిరప్లు, పాలు, క్రీమ్‌ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. పరిమితికి మించకుండా బ్లాక్ కాఫీని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం తెలిపింది. అదే సమయంలో రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగితే కొంతమందిలో గుండె చెడిపోయే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.
కాఫీ కాకుండా ఎనర్జీ డ్రింక్స్, ఎనర్జీ షాట్స్ వంటి ఇతర ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ కాఫీలో ఒక ఫ్లూయిడ్ ఔన్సుకు 9.4 నుంచి 20.6 మిల్లీగ్రాముల కెఫీన్ మాత్రమే ఉండగా.. ఎనర్జీ డ్రింక్స్‌లో ఒక ఫ్లూయిడ్ ఔన్సుకు 40 నుంచి 69 మిల్లీగ్రాముల వరకు అధిక సాంద్రత కలిగిన కెఫీన్ ఉంటుంది. ఇటువంటి ఎనర్జీ డ్రింక్స్ వల్ల అధిక రక్తపోటు, అసాధారణ గుండె లయ (ఆర్థమియా) పెరిగే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ మార్కస్ తెలిపారు.
ప్రజల జన్యువులు, జీవక్రియలు, వయస్సు, వాడే మందులను బట్టి కెఫీన్ ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది. కెఫీన్ వల్ల గుండె లయలో తేడాలు వచ్చే ప్రమాదం తగ్గడంతో పాటు, అసాధారణంగా కొట్టుకునే ముప్పు కూడా పొంచి ఉంటుందని క్లినికల్ ట్రయల్స్ ద్వారా తేలింది. కాబట్టి కాఫీ లేదా కెఫీన్ ఉత్పత్తులను పరిమితంగా, మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరమని పరిశోధకులు స్పష్టం చేశారు.