Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

షర్మిల రాజకీయ ప్రయాణం: మూసుకున్న దారులు… మారుతున్న సమీకరణాలు..

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
షర్మిల రాజకీయ ప్రయాణం: మూసుకున్న దారులు… మారుతున్న సమీకరణాలు..

షర్మిల రాజకీయ ప్రయాణం: మూసుకున్న దారులు… మారుతున్న సమీకరణాలు..

తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఒకప్పుడు తన పాదయాత్రలతో, పదునైన విమర్శలతో ప్రత్యేక గురింపు తెచ్చుకున్న వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆమె చేసిన రాజకీయ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడమే కాకుండా, ప్రస్తుతం ఆమెను ‘రెంటికి చెడ్డ రేవడి’లాంటి క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి నడిపించలేక మూసివేయడం, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినా పార్టీని గట్టెక్కించలేకపోవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం ఒక సంక్షోభంలో పడిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

షాకింగ్ విషయమేమిటంటే, కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆమె మినహాయింపులతో కూడిన కీలక హామీలు ఆశించారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా, దక్షినాది రాష్ట్రాల నుండి లేదా కాంగ్రెస్ బలంగా ఉన్న మరేదైనా రాష్ట్రం నుండి ఆమెను రాజ్యసభకు పంపుతారని షర్మిల వర్గం భావించినప్పటికీ, ఆ ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల కేటాయింపుల్లో ఆమెకు తీవ్ర భంగపాటు ఎదురైంది. కాంగ్రెస్ అధిష్టానం ఆమె పేరును పరిశీలించకపోవడంతో, అధిష్ఠానం వద్ద కూడా ఆమె ప్రాధాన్యత తగ్గిపోయిందనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. పొరుగు రాష్ట్రంలో వేసిన అడుగులు కలసిరాకపోవడం, ఇటు కాంగ్రెస్‌లోనూ ఆశించిన పదవి దక్కకపోవడం ఆమె రాజకీయ అడుగులను మరింత ఆందోళనకరంగా మార్చాయి.

ప్రస్తుతం షర్మిల ముందున్న రాజకీయ దారులన్నీ దాదాపు మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. అన్న జగన్ మోహన్ రెడ్డితో ఉన్న తీవ్రమైన విభేదాలు, వ్యక్తిగత మరియు రాజకీయ శత్రుత్వం దృష్ట్యా ఆమె తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. పోనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా అంటే అదీ ప్రశ్నార్థకమే. అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పుంజుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) పెట్టి, చివరకు దానిని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి దుకాణం సర్దేసిన చరిత్ర ఉన్నందున, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో పార్టీ పెట్టే అవకాశం కానీ, అందుకు మద్దతు ఇచ్చే వాతావరణం కానీ క్షేత్రస్థాయిలో అస్సలు లేదు.

మొత్తానికి, షర్మిల రాజకీయ ప్రస్థానం ఏ తీరానికి చేరుతుందనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే చిన్నపాటి ప్రాధాన్యతలతో సరిపెట్టుకుని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రమపడతారా, లేదా పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పి తప్పుకుంటారా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఆమె ఎలాంటి అడుగు ముందుకు వేస్తారు, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఏం చేస్తారనేది కాలమే నిర్ణయించాలి.

ట్యాగ్‌లు: andhra pradesh YS Sharmila