కూటమి ఉద్యోగాలు, పెట్టుబడులన్నీ డొల్లే… పార్లమెంట్ సాక్షిగా తేల్చేసిన కేంద్రం
కూటమి ఉద్యోగాలు, పెట్టుబడులన్నీ డొల్లే… పార్లమెంట్ సాక్షిగా తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ‘లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు’ అంతా ఒక పెద్ద భ్రమ అని, అది కేవలం మాటల గారడీ మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. లోక్‌సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించిన అధికారిక గణాంకాలే కూటమి ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనాన్ని, వాస్తవ పరిస్థితులను స్పష్టంగా బయటపెట్టాయని వైఎస్సార్‌సీపీ మంగళవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో పరిశ్రమల వరద పారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలకు పొంతన లేదని కేంద్ర డేటా నిరూపించిందని ఆ పార్టీ ఘాటుగా విమర్శించింది.
వైసీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జి తిన్ ప్రసాద రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో డీపీఐఐటీ (DPIIT), ఇన్వెస్ట్ ఇండియా పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 10 పెట్టుబడి ప్రాజెక్టులు మాత్రమే పట్టాలెక్కాయని కేంద్ర మంత్రి సభకు తెలిపారు. అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ 10 ప్రాజెక్టుల్లో కూడా ఇప్పటివరకు కేవలం రెండే రెండు పరిశ్రమల నిర్మాణం పూర్తయిందని కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన ప్రాజెక్టులన్నీ ఇంకా నిర్మాణం లేదా ప్రారంభ దశల్లోనే మూలుగుతున్నాయని, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న భారీ పెట్టుబడులు, ఉద్యోగాల గణాంకాలన్నీ కేవలం కాగితాలపై ఉన్న అంచనాలు తప్ప, వాస్తవంగా సాధించిన పురోగతి కాదని వైఎస్సార్‌సీపీ ఎత్తిచూపింది.
కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంచనా వేసిన మొత్తం పెట్టుబడి కేవలం రూ. 6,962 కోట్లు మాత్రమే. అలాగే, ఈ ప్రాజెక్టుల ద్వారా వస్తాయని చెప్తున్న 22,167 ఉద్యోగాలు కూడా పరిశ్రమలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక భవిష్యత్తులో రాబోయే అంచనా ఉద్యోగాలు మాత్రమేనని, అంతేతప్ప ఇప్పటికే యువతకు ఇచ్చిన ఉద్యోగాలు కావని కేంద్రం తేల్చేసింది. ఇప్పటివరకు రాష్ట్రానికి నిజంగా ఎంత పెట్టుబడి వచ్చింది, ఎన్ని పరిశ్రమలు వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించాయి, ప్రస్తుతం ఎంతమందికి నిజంగా ఉపాధి దొరికిందనే విషయాలపై కేంద్రం వద్ద ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడం గమనార్హం. ప్రతిపాదనల దశలో ఉన్న పెట్టుబడులను అసలైన పెట్టుబడులుగా, ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నడుస్తున్న పరిశ్రమలుగా, భవిష్యత్తులో వచ్చే అంచనా ఉద్యోగాలను ఇప్పటికే ఇచ్చేసిన ఉద్యోగలుగా చూపుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతోందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది.
మరోవైపు ఎంఎస్‌ఎంఈలు, స్థానిక పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 2024-25లో 201 శిక్షణా కార్యక్రమాల ద్వారా 10,093 మందికి, 2025-26లో 625 కార్యక్రమాల ద్వారా 32,428 మందికి ఉపాధి శిక్షణ ఇచ్చామని కేంద్రం తెలిపింది. అయితే ఈ శిక్షణ పొందిన వారిలో ఎంతమంది నిజంగా పరిశ్రమలు స్థాపించారు, ఎంతమందికి ఆర్థిక సహాయం అందింది లేదా ఎంతమందికి ఉపాధి లభించిందనే డేటా తమ వద్ద లేదని కేంద్రం చెప్పడం విశేషం. కేవలం నైపుణ్య శిక్షణ ఇవ్వడాన్ని పారిశ్రామిక అభివృద్ధిగా చిత్రీకరించలేమని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన ఈ సమాధానాలు కూటమి ప్రభుత్వ రాజకీయ ప్రచారానికి, క్షేత్రస్థాయి యథార్థానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎండగట్టాయని, కేవలం రెండు యూనిట్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకుంటే, వేల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని కోతలు కోయడం కూటమి వైఫల్యానికి నిదర్శనమని ఆ పార్టీ విమర్శించింది.