Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో అమిత్ షా ‘డబుల్ గేమ్’..చంద్రబాబుకు నిధుల షాక్… జగన్‌కు బీజేపీ అభయహస్తం?

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఏపీలో అమిత్ షా ‘డబుల్ గేమ్’..చంద్రబాబుకు నిధుల షాక్… జగన్‌కు బీజేపీ అభయహస్తం?

ఏపీలో అమిత్ షా 'డబుల్ గేమ్'..చంద్రబాబుకు నిధుల షాక్... జగన్‌కు బీజేపీ అభయహస్తం?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) ప్రభుత్వంలో అంతర్గత లొసుగులు మొదలయ్యాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల మధ్య కొన్ని కీలక అంశాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో బీజేపీ నాయకత్వాన్ని పక్కన పెట్టి చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే తీవ్ర అసంతృప్తి ఢిల్లీ పెద్దల్లో ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు అమరావతి, పోలవరం నిధుల విడుదల విషయంలో కేంద్రం చూపుతున్న వైఖరి, స్థానిక టీడీపీ కేడర్ తమ నేతలను తొక్కివేస్తోందంటూ బీజేపీ అంతర్గత వర్గాల నుంచి కేంద్రానికి వెళ్లిన ఫిర్యాదులు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఈ పరిణామాలకు ప్రధాన కారణం జాతీయ స్థాయిలో ఎన్డీయే సంఖ్యాబలంలో వచ్చిన మార్పులేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చంద్రబాబు మద్దతు అత్యంత కీలకంగా ఉండేది. అయితే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి విడిపోయిన ఎంపీలు ఎన్డీయేకి మద్దతు ప్రకటించడంతో కేంద్రంలో బీజేపీ స్థానం మరింత పటిష్టమైందని పార్టీ సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కొత్త మద్దతుతో ఎన్డీయేకి మెజారిటీ మార్కు సురక్షితం కావడంతో, కేంద్రంపై చంద్రబాబు చూపించే ఒత్తిడి శక్తి తగ్గిపోయిందని, ఫలితంగా అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ అధిష్టానం ఇప్పుడు టీడీపీ పట్ల కఠినంగా వ్యవహరించే వెసులుబాటును పొందిందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఈ మారిన పరిస్థితుల నేపథ్యంలోనే బీజేపీ నెమ్మదిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల మృదువైఖరి అవలంబిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. చంద్రబాబును చెక్‌లో ఉంచడానికి బీజేపీ ఒక వ్యూహాత్మక మైండ్ గేమ్‌కు తెరలేపిందని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన వ్యవహారాలు, జగన్ కేసులపై వేగవంతమైన చర్యలు ఉంటాయని టీడీపీ శ్రేణులు ఆశించినప్పటికీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆచితూచి వ్యవహరించడం వెనుక ‘ఢిల్లీ పెద్దల’ అభయహస్తం ఉందనే అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జగన్‌పై తీవ్రస్థాయి చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీకి తిరుగులేకుండా పోతుందనే అంచనాతో, ఒక కౌంటర్ బ్యాలెన్స్ కోసం కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు మీడియా వర్గాల సమాచారం.

మొత్తానికి, తృణమూల్ రెబెల్ ఎంపీల మద్దతుతో కేంద్రంలో మరింత బలం సాధించిన బీజేపీ, చంద్రబాబు ప్రాబల్యానికి చెక్ పెడుతూనే జగన్ కేసుల విషయంలో వ్యూహాత్మక నిశ్శబ్దం వహిస్తోందనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో  విరివిగా కనిపిస్తున్నాయి. ఒకవైపు కేంద్ర నిధుల విషయంలో పట్టు విడవకపోవడం, మరోవైపు ప్రతిపక్ష జగన్‌ను మరీ ఇబ్బంది పెట్టకపోవడం ద్వారా అమిత్ షా ఏపీ రాజకీయాన్ని తమ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు సైతం “కూటమి ఐదేళ్లు నిలబడదు” అని చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులు లేదా సమీకరణాలు చూడాల్సి వస్తుందేమోనని రాజకీయ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.