Skip to content
జాతీయం వార్తలు

Sonam Wangchuk: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. సీజేపీ మార్చ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వండి.. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి MSకు సోనమ్ వాంగ్‌చుక్ లేఖ

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Sonam Wangchuk: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. సీజేపీ మార్చ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వండి.. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి MSకు సోనమ్ వాంగ్‌చుక్ లేఖ

Sonam Wangchuk Health Update: 23 రోజుల నిరాహార దీక్షను ముగించిన సోనమ్ వాంగ్‌చుక్.. రీఫీడింగ్ సిండ్రోమ్ ప్రమాదంతొ 10 రోజుల పాటు భోజనానికి దూరంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక..

Sonam Wangchuk: న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ (MS)/డైరెక్టర్‌కు లేఖ రాశారు. తాను ప్రస్తుతం చాలా బాగున్నానని.. తన ఆరోగ్య సూచికలు (వైటల్స్) కూడా సాధారణంగానే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నీట్ పరీక్షల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. బొద్దింక జనతా పార్టీ-సీజేపీ నేడు చేపట్టిన సంసద్ చలో పాదయాత్రలో పాల్గొనేందుకు వీలుగా, తాత్కాలికంగానైనా ఆసుపత్రి నుంచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని ఆయన అధికారులను అభ్యర్థించారు.

ఈ లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తాను పోలీసు కస్టడీలో లేనప్పుడు తన కదలికలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని వాంగ్‌చుక్ ప్రశ్నించారు. నా ఆరోగ్యం బాగుంది, నిర్బంధంలో లేనని ఆసుపత్రికి లేఖ ఇచ్చాను.. మరి ఈ ఆంక్షలు ఎందుకని ఆయన X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

అయితే ఆసుపత్రి విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. వాంగ్‌చుక్ కీలక పారామీటర్లు స్థిరంగా ఉన్నప్పటికీ, ఆయన రక్త పారామీటర్లకు నిశిత వైద్య పర్యవేక్షణ అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన నిపుణుల బహుళ-విభాగ బృందం పర్యవేక్షణలో వైద్య సంరక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు వాంగ్‌చుక్‌ను అనధికారికంగా పోలీసు కస్టడీ తరహా ఆంక్షల మధ్య ఉంచారని.. కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వడం లేదని ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో ఆరోపించారు. ఈ ఆంక్షలను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నేడు మధ్యాహ్నం తర్వాత దీనిపై విచారణ జరగనుంది.

ఇదిలా ఉండగా..సీజేపీ పిలుపునిచ్చిన పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్, పరిసర ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడడంతో ఉద్రిక్తత పీక్‌ స్టేజీకి చేరింది. సోమవారం ఉదయం నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో.. గుంపును చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీఛార్జ్‌కు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జాతీయ రాజధానిలో 5,000 మందికి పైగా సిబ్బంది, అల్లర్ల నిరోధక దళాలు, నీటి ఫిరంగులను మోహరించారు. నిరసనలు ఉధృతంగా సాగుతున్న పార్లమెంట్ స్ట్రీట్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను పరిమితం చేయడంతో పాటు.. 5 కీలక మెట్రో స్టేషన్లను మూసివేసి ఢిల్లీని కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంచారు.