Europe Heatwave: యూరప్ హీట్‌వేవ్.. నిప్పుల కొలిమి దెబ్బకు 12 వేల మంది మృతి.. వేడి గాలులు తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలు..
Europe Heatwave: యూరప్‌ను వణికించిన హీట్‌వేవ్.. నిప్పుల కొలిమి దెబ్బకు 12 వేల మంది మృతి.. వేడి గాలులు తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలు..
Europe Heatwave: ఎప్పుడూ చల్లని వాతావరణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శీతల ఖండం యూరప్ (Europe) ప్రస్తుతం అసాధారణమైన వేడిగాలులతో అల్లాడిపోతోంది. వాతావరణంలో ఏర్పడిన హీట్ డోమ్ (Heat Dome) ప్రభావంతో పలు దేశాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి భగభగలకు కేవలం జూన్ నెలలోనే దాదాపు 9 యూరోపియన్ దేశాల్లో కనీసం 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక మరణాల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.
పశ్చిమ ఐరోపాలోని బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్లతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ (ఇంగ్లాండ్, వేల్స్) దేశాలు ఈ ప్రచండ వేడిగాలుల బారిన పడ్డాయి. ముఖ్యంగా జూన్ 22 నుండి 28 మధ్య కాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ మరణాల సంఖ్య భారీగా పెరిగింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు 85 శాతానికి పైగా ప్రజలు 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులే కావడం గమనార్హం. వడదెబ్బ కారణంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత తీవ్రమవడంతో వృద్ధులు ఎక్కువగా మరణించారని యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ (EuroMOMO) వంటి ఆరోగ్య సంస్థలు ధృవీకరించాయి.
వాతావరణంలో బలమైన అధిక పీడన వ్యవస్థ ఏర్పడి.. వేడి గాలిని ఒకే చోట కదలకుండా నొక్కి ఉంచడాన్ని హీట్ డోమ్ అంటారు. ఇది ఒక మూతలాగా పనిచేసి భూమిపై వేడిని నిరంతరం పెంచుకుంటూ పోతుంది. ఈ దుస్థితి వల్ల అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొడుతూ ఆకాశాన్నంటుతున్నాయి. యూరప్‌లో సంభవిస్తున్న ఈ దారుణ పరిస్థితులు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని.. మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని వాతావరణ పరిశోధక సంస్థ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (WWA) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. శిలాజ ఇంధనాల వాడకం (Fossil Fuels), గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ వేడిగాలుల తీవ్రత.. తరచుదనం ఊహించని రీతిలో పెరిగాయని వారు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.