Skip to content
జాతీయం వార్తలు

Delhi High Court: విడాకులు మంజూరైనా భార్యకు అప్పటిదాకా భర్త భరణం చెల్లించాల్సిందే.. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Delhi High Court: విడాకులు మంజూరైనా భార్యకు అప్పటిదాకా భర్త భరణం చెల్లించాల్సిందే.. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..

Delhi High Court: విడాకులు మంజూరైనా భార్యకు అప్పటిదాకా భర్త భరణం చెల్లించాల్సిందే.. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..

Delhi High Court: వైవాహిక వివాదాల్లో చిక్కుకున్న మహిళల ఆర్థిక భద్రతకు భరోసా కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ డిక్రీ (తుది తీర్పు ప్రకటన) ఇచ్చినంత మాత్రాన భార్యకు అందుతున్న తాత్కాలిక భరణం దానంతట అదే నిలిచిపోదని స్పష్టం చేసింది. ఆ విడాకుల తీర్పును సవాలు చేస్తూ ఎగువ కోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత కాలం.. ఆ ప్రక్రియను అసలు కేసు కొనసాగింపుగానే పరిగణించాలని.. కాబట్టి అప్పీల్ తేలే వరకు భర్త భరణం చెల్లించాల్సిందేనని జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ రేణు భట్నాగర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది.

హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న దంపతులు మనస్పర్థల కారణంగా 2015 నుండి విడిగా నివసిస్తున్నారు. భర్త సైన్యంలో అధికారిగా పని చేస్తుండగా.. భార్య ఎంబీఏ (హెచ్‌ఆర్) పట్టభద్రురాలు. భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉండగా.. భార్య హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 24 కింద తాత్కాలిక భరణం కోరింది. దీనిపై స్పందించిన ఫ్యామిలీ కోర్టు.. భర్త స్థూల జీతంలో 30 శాతం మొత్తాన్ని నెలవారీ భరణంగా నేరుగా భార్యకు చెల్లించాలని భర్తను ఆదేశించింది.

ఆ తర్వాత 2025 జూలైలో ఫ్యామిలీ కోర్టు భర్తకు విడాకులు మంజూరు చేసింది. దాంతో వైవాహిక ప్రక్రియ ముగిసిందని.. ఇకపై భరణం చెల్లించాల్సిన అవసరం లేదని భర్త వాదించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ భార్య హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడంతో పాటు.. అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో కూడా భరణాన్ని కొనసాగించాలని కోరింది.

తీర్పులో కోర్టు ప్రస్తావించిన ప్రధానాంశాలు: జగదీష్ సింగ్ వర్సెస్ మాధురి దేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన వివాదం ముగిసిపోయినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పీలేట్ పరిహారాలన్నీ పూర్తయ్యే వరకు ఆ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని.. కాబట్టి చట్టంలోని విచారణ సమయంలో.. అనే పదం అప్పీల్ దశకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. భార్య ఉన్నత చదువులు (ఎంబీఏ) చదివినంత మాత్రాన ఆమెకు సొంతంగా జీవనోపాధి ఉన్నట్లు భావించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం సంపాదించగల సామర్థ్యం లేదా అర్హత ఉండటం వేరు.. నిజంగా చేతిలో సంపాదన ఉండటం వేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసు నడుస్తున్న కాలంలో తక్షణ ఆర్థిక సహాయం అందించడానికి సెక్షన్ 24 ఉద్దేశించబడగా.. కేసు పూర్తిగా ముగిసిన తర్వాత శాశ్వత భరణం కోసం సెక్షన్ 25 ఉపయోగపడుతుంది. కాబట్టి శాశ్వత భరణం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అప్పీల్ ముగిసే వరకు మధ్యంతర భరణం ఆపడానికి వీల్లేదు.

అప్పీలు పెండింగ్‌లో ఉన్న సమయంలో భరణం నిలిపివేస్తే ఆర్థికంగా ఆధారపడిన జీవిత భాగస్వామి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. ఇది సెక్షన్ 24 ప్రధాన ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో భార్య దరఖాస్తును అనుమతిస్తూ.. వైవాహిక అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత కాలం సదరు భర్త స్థూల జీతం నుంచి ప్రతి నెలా 30 శాతం మొత్తాన్ని నేరుగా భార్య ఖాతాకు బదిలీ చేయాలని అతని యజమానిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.