స్థానిక పోరులో టీడీపీ-జనసేన ఢీ..? కూటమికి కొత్త తలనొప్పి..!
స్థానిక పోరులో టీడీపీ-జనసేన ఢీ..? కూటమికి కొత్త తలనొప్పి..!
ఏపీలో సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. ముందుగా కూటమి పార్టీలకు ఇది ఒక రకంగా పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన కలిసి ఈ ఎన్నికలకు వెళ్లాలా, లేక విడివిడిగా వెళ్లాలా అనే ఆలోచనలు ఇప్పుడు మొదలయ్యాయి.
ఎందుకంటే జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేసి కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకొని పోటీ చేసింది. కానీ అన్ని సీట్లలో గెలుపు సాధించడంతోపాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా జనసేన తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలైన పరీక్ష సెప్టెంబర్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదలవ్వనుంది.
ఎందుకంటే జనసేన క్యాడర్ ఇప్పుడు తమకు తప్పనిసరిగా వాటా పెంచాల్సిందేనని, తాము బలంగా ఉన్నచోట సొంతంగా పోటీ చేస్తామని, పొత్తు గిత్తు జాంతానై అని బెట్టు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఒంగోలులో సైతం జనసేన సొంతంగా సై అనేందుకు సిద్ధమవుతోంది.
ఇక చంద్రబాబు నాయుడు స్వస్థలం అయినటువంటి సొంత జిల్లా చిత్తూరులో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన వినే పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో జనసేన ఎమ్మెల్యే ఉన్నచోట తెలుగుదేశం నియోజకవర్గ అభ్యర్థి పెత్తనం చెలాయిస్తుంటే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో జనసేన ఇన్చార్జిని కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని జనసేన పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మరోవైపు అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సర్దుకుపోదాం రండి అని, కలిసి నడుద్దాం అని ఎన్ని చెబుతున్నా, కానీ క్యాడర్ మాత్రం ప్రస్తుతం వినే పరిస్థితుల్లో లేరు అని కింది స్థాయిలో చర్చ నడుస్తోంది.
అయితే అటు తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేష్ మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని పావులు కదుపుతున్నారు. కూటమి మధ్య కుమ్ములాటలు ఎక్కువైతే అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని తమ్ముళ్లకు సర్దుకోమని హితబోధ చేస్తున్నారు.
అటు తమ్ముళ్లు కూడా తగ్గేదెలా అనే విధంగా జనసేనకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు ఈ కుమ్ములాటల మధ్యలో ఏ తీరం చేరుస్తాయనే దానిపై అటు అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు లోకేష్, చంద్రబాబు సైతం ఆందోళన చెందుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.