Skip to content
జాతీయం వార్తలు

ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం అప్రమత్తం

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం అప్రమత్తం

ఇస్రోలో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం అప్రమత్తం

ఇస్రోలో కీలక ప్రాజెక్టుల సిబ్బంది నిష్కమణపై కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తలు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్), రాజీనామాల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వంద మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం లేదా ముందస్తు పదవీ విరమణ తీసుకోవడంతో, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంతరిక్ష ప్రాజెక్టులపై దాని ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది.

ఈ మేరకు అంతరిక్ష శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్) ఈనెల 14న ఇస్రోకు చెందిన ప్రధాన పరిశోధనా కేంద్రాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం, ఇతర కీలక అంతరిక్ష మిషన్లు, ప్రాజెక్టులతో అనుబంధంగా పనిచేస్తున్న గ్రూప్ ‘ఏ’ శాస్త్ర, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులను ఇకపై సాధారణంగా ఆమోదించకూడదు.

అలాంటి దరఖాస్తులను ఆయా కేంద్రాల డైరెక్టర్లు తమ స్పష్టమైన సిఫార్సులతో కలిసి నేరుగా అంతరిక్ష శాఖకు పంపాలని, తుది నిర్ణయం శాఖే తీసుకుంటుందని పేర్కొంది. దీంతో 2020లో ఇస్రో కేంద్రాల డైరెక్టర్లకు ఇచ్చిన స్వతంత్ర ఆమోద అధికారాలను కేంద్రం పరిమితం చేసింది.

ఇటీవలి కాలంలో బెంగళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్‌సీ), తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)ల నుంచి అత్యధిక మంది శాస్త్రవేత్తలు నిష్క్రమించినట్లు సమాచారం. గగన్యాన్ ప్రయోగానికి ఉపయోగించే ఎల్‌వీఎం-3 (గతంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేసిన సీనియర్ శాస్త్రవేత్త విక్టర్ జోసెఫ్ టి కూడా ఈ ఏడాది ప్రారంభంలో సంస్థను వీడడం చర్చనీయాంశమైంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు సంస్థలకు తెరవడం, 2023లో భారత అంతరిక్ష విధానం అమల్లోకి రావడంతో ప్రైవేటు స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 400కు పైగా నమోదిత అంతరిక్ష స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

పిక్సెల్, స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, ధ్రువ స్పేస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ వంటి సంస్థలు మెరుగైన వేతనాలు, పరిశోధనలో అధిక స్వేచ్ఛ, వేగవంతమైన అవకాశాలను అందిస్తుండటంతో ఇస్రోలోని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లుతున్నారని భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఇస్రో ఇటీవల కొన్ని సాంకేతిక ఎదురుదెబ్బలను కూడా ఎదుర్కొంది. గత ఏడాది, ఈ ఏడాది జరిగిన రెండు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయినప్పటికీ, గగన్యాన్, చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష కేంద్రం (భారతీయ స్పేస్ స్టేషన్), మంగళయాన్-2 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాలంటే అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను సంస్థలో కొనసాగించడం అత్యంత అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు ఇస్రోలో ప్రతిభను నిలబెట్టుకోవడానికి తీసుకున్న కీలక పరిపాలనా చర్యగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ట్యాగ్‌లు: ISRO