ఎర్ర సముద్రం మూసివేతకు సిద్ధంగా ఉండండి
US-Iran War: పతాక స్థాయికి అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. హార్ముజ్ జలసంధి వేదికగా దాడులు.. కువైట్‌పై ఇరాన్ ప్రతీకారం..
హౌతీ సైన్యాలకు ఇరాన్ పాలకుల ప్రామాణిక ఆదేశం
- వినాశకర దాడులు చేస్తాం జాగ్రత్త: ఐఆర్జిసి కల్నల్ హెచ్చరిక
- అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరాన్ని ధ్వంసం చేసిన ఇరాన్
- ఎనిమిది ఇరాన్ డ్రోన్లు కూల్చేసిన జోర్డాన్
- ఖర్గ్ ద్వీపం స్వాధీనం సహా భారీదాడికి ట్రంప్ ప్రణాళిక
పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సాధనకు కుదిరిన ఎంఓయు నుండి వైదొలగినట్లు ప్రకటించిన ఇరాన్, అమెరికాపై భీకర దాడులు చేసింది. ఇరాన్ మర్యాదగా ప్రవర్తించాలని, చర్చలకు రావాలని, లేకపోతే వచ్చేవారం కథ ముగిస్తామని ట్రంప్ హెచ్చరించగా, ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలను నిలిపివేసేందుకు సిద్ధంగా ఉండాలని హౌతీ సైన్యాలకు ఇరాన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఒక సరికొత్త ముప్పు మొదలైనట్లవుతుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం వచ్చేవారంలో ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ దేశ మౌలిక సదుపాయాలపై తీవ్ర దాడులు చేస్తే, తాము కూడా అదేస్థాయిలో ఈ ప్రాంతంలో ఇంకా మిగిలి ఉన్న మౌలిక సదుపాయాలను శిథిలావస్థకు చేర్చి పూర్తిగా తుడిచిపెడతామని ఐఆర్జిసి ఖతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్హఘారీ అమెరికాకు హెచ్చరిక చేశారు.
హోర్ముజ్ జలసంధిలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, వారి దురాక్రమణను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌కు ఉన్న “అభేద్యమైన రెడ్‌లైన్”గా అభివర్ణించారు. ఈసారి తాము చేసే దాడులు గతంకంటే విస్తృతంగా, వినాశకరంగా ఉంటాయన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించగానే హౌతీలు కూడా యుద్ధంలో చేరుతున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ వారిని ఒక రిజర్వు సైన్యంగా భావించిన ఇరాన్, యుద్ధరంగంలోకి రాకుండా ఆపేయడంతో హౌతీలు యుద్ధంలో చేరలేదు. వార్‌రూమ్ సమావేశంలో నిర్ణయాల మేరకు ట్రంప్ యుద్ధాన్ని ఉదృతం చేస్తే హౌతీ ఉద్యమ సైన్యాలు రంగప్రవేశం చేస్తాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం లోతుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకుని సమాచారాన్ని హౌతీలకు చేరవేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయని రాయిటర్స్ వార్తాసంస్థ ప్రకటించింది.
ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖర్గ్ ద్వీపం సహా అబూముసా, ఇతర ద్వీపాలను కూడా స్వాధీనం చేసుకోవడానికి, ఇరాన్‌లో విద్యుత్ ప్లాంటులు, వంతెనల ధ్వంసానికి జులై 20 నుండి భారీ దాడుల ప్రణాళికను ట్రంప్ సిద్ధం చేసుకుంటున్న తరుణంలో హౌతీ సైన్యాలకు ఇరాన్ పై ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంటులు, వంతెనలు ధ్వంసంచేసి, ద్వీపాలను స్వాధీనం చేసుకునే తీవ్ర దాడులకు దిగితే, తక్షణం ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలను హౌతీలు స్తంభింపజేస్తారు.
ఇదిలా ఉండగా, చమురు వాణిజ్య నౌకల బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఐఆర్జిసి (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్) ఉన్నతస్థాయి కమాండ్ సెంటర్ ప్రకటించింది. ఇరాన్‌లో నిర్దేశిత లక్ష్యాలపై వరుసగా ఐదోరోజు గురువారం దాడులను పూర్తిచేసినట్లు అమెరికా సెంట్‌కామ్ సైనిక వర్గాలు ప్రకటించాయి. బందర్ అబ్బాస్ ఓడరేవు సహా పలు ప్రాంతాలలో లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. గ్రేటర్ తుంబ్ ద్వీపంలో తీరప్రాంత రక్షణ, క్రూయిజ్ క్షిపణి స్థావరాలపై 90 నిమిషాలసేపు దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై ట్రంప్ జులై 14న విధించిన దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, తమ హెచ్చరికలు ఉల్లంఘించి ఖర్గ్ ద్వీపంలోని ఇరాన్ చమురు ఎగుమతి టెర్మినల్ వైపు వెళుతున్న “బెల్మా” అనే ట్యాంకర్‌పై క్షిపణి దాడులు చేసినట్లు సెంట్‌కామ్ తెలియజేసింది. కాగా, బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఐఆర్జిసి ప్రకటించింది. గల్ఫ్‌లో అమెరికాకు స్థావరాలిచ్చిన మిత్రదేశాలపై దాడులు కొనసాగించినట్లు పేర్కొంది. అదే సమయంలో జోర్డాన్ సైన్యం ఒక ప్రకటన చేస్తూ, ఇరాన్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొంది. యుద్ధం హోరాహోరీగా సాగుతూ ఉండటంతో జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కేవలం ఏడు నౌకలు మాత్రమే ప్రయాణం చేశాయి.
ఇరాన్ రాజీ పరిష్కారం కోరుతోందిః ట్రంప్
యుద్ధ దాడుల నుండి బయటపడేందుకు ఇరాన్ రాజీ పరిష్కారాన్ని కోరుకుంటోందని డోనాల్డ్ ట్రంప్ గురువారం చెప్పారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించాలా? వద్దా? అనే విషయంపై తాము తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రక్షణ, ఆవిష్కరణల సదస్సులో పాల్గొనేందుకు పెన్సిల్వేనియాకు వెళ్లిన ట్రంప్, పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్‌కు పదేపదే గడువులు విధించడం, ఆంక్షలు పెట్టడం తనకు ఇష్టం లేదని, వారు మర్యాదగా ప్రవర్తించాలని హెచ్చరించారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రస్తుతం ఏమాత్రం సంతోషంగా లేదని, వారు రాజీపడాలని చాలా తీవ్రంగా కోరుకుంటున్నారని, ఈ విషయంలో తాము కూడా రాజీపడతామా? లేదా వారి కథను ముగించేస్తామా? అనేది తేలుతుందని అన్నారు.
ఇరాన్ రేవులకు చమురు ట్యాంకర్లు వెళ్లకుండా దిగ్బంధనాన్ని 14వ తేదీ నుండి ట్రంప్ తిరిగి అమలు చేస్తున్నారు. అంతకుముందు ఏప్రిల్ 13 నుండి జూన్ 18 వరకు ఇరాన్ ఓడరేవులపై సెంట్‌కామ్ దిగ్బంధనాన్ని అమలు చేసింది. ఈ సమయంలో 140కిపైగా నౌకలను అమెరికా దారిమళ్లించింది. మరో తొమ్మిది నౌకలను దాడులతో నిలిపివేసింది. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్‌లను ఎంఓయుకు అనుగుణంగా శాంతి చర్చలకు ప్రోత్సహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. సౌదీ అరేబియా, కువైట్‌లకు అత్యాధునిక ఆయుధాల సరఫరా ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.