Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

కృత్రిమ మేధ మానవాళికి వరం కావాలి, శాపం కాదు

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
కృత్రిమ మేధ మానవాళికి వరం కావాలి, శాపం కాదు

(నేడు 16 జులై కృత్రిమ మేధ ప్రశంసా దినోత్సవం సందర్భంగా)

డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి

ఒక ఎలక్ట్రానిక్‌ ఉపకరణం మానవుణ్ణి అనుకరించడం, నేర్చుకోవడం, నిర్ణయాలను తీసుకోవడం లాంటి విధులను నిర్వహించడాన్ని కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా ఏఐ) అని చెప్పవచ్చు. నేడు ఎఐ రంగం ఒక టెక్నాలజీ అభివృద్ధే కాదని, రానున్న తరాల మానవ జీవితాలను విప్లవాత్మకంగా ప్రభావితం చేయనుందని తెలుసుకోవాలి.

గత కొన్ని దశాబ్దాలుగా ఎఐ ప్రారంభ స్థాయి నుంచి నేడు భాషలను తర్జుమా చేయడం, ముఖాలను గుర్తించడం, వేలి ముద్రలను పసిగట్టడం, వాహనాలను ప్రోగ్రామింగ్‌కు అనుగుణంగా ఆటోమేటిక్‌గా నడపడం, రోగాలను నిర్ధారణ చేయడం, చికిత్సతో పాటు రోబోటిక్‌ సర్జరీలు చేయడం లాంటి పనులను చేసే స్థాయికి అభివృద్ధి చెందింది.

2021లో ఎఐ ప్రాధాన్యాన్ని గుర్తించిన జాసన్‌ కిర్టన్‌ అను శాస్త్రజ్ఞుడు ప్రతి ఏట 16 జూలై రోజున ఎఐ ప్రశంసా దినోత్సవం లేదా ఎఐ అప్రీషియేషన్‌ డే నిర్వహించుకోవాలని ప్రపంచ మానవాళికి సందేశం ఇవ్వడంతో, అది ప్రతి ఏటా సాంప్రదాయంగా ప్రపంచ దేశాలు జరుపుకోవడం కొనసాగుతున్నది.

నిత్య జీవితంలో ఎఐ ప్రయోజనాలు

మానవాళి జీవనశైలితో ఎఐ విడదీయరాని సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నది. నేడు వైద్యరంగంలో వ్యాధి నిర్ధారణ, చికిత్స, సర్జరీ లాంటి ప్రయోజనాలను కలిగి ఉన్నది. రవాణా రంగంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ఆటోమెటిక్‌ వాహనాల రూపకల్పన లాంటివి జరుగుతున్నాయి.

విద్యారంగంలో నూతన ఆకర్షణీయ బోధనా పద్ధతులు, ట్యూటర్‌ విధులను ఎఐ సుసాధ్యం చేస్తున్నది. వినియోగదారుల సేవల్లో చాట్‌బోట్‌లు, వర్చువల్‌ ఏజెంట్స్‌ లాంటి విధులు నిర్వహించడంలో ఎఐ సఫలం అవుతున్నది. పర్యావరణ పరిరక్షణలో వాతావరణ నమూనాలు, శక్తి నియంత్రణ లాంటి పలు విధులను ఎఐ నిర్వహిస్తున్నది.

వీటితోపాటు వినోదం, బ్యాంకింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌, ఆటోమొబైల్స్‌, గృహ విధులు లాంటి అనేక ప్రయోజనాలను ఎఐ కలిగి ఉన్నదని మన అనుభవం చెబుతున్నది.

అయితే, ఎఐ రంగం వరంగానే కాకుండా శాపంగా పలు నష్టాలను కూడా చూపుతోంది. పలు అనైతిక సమస్యలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగాలు, ఉద్యోగాల్లో కోతలు, ఇతర పలు లోపాలను కలిగి ఉండడంతో కొంత జాగ్రత్త వహించాల్సి వస్తున్నది.

ఎఐ టెక్నాలజీ ఒక ఇంజనీరింగ్‌ విభాగంలో శ్రమించే వారి అంశమే కాదు. ఆధునిక టెక్నాలజీని వినియోగించే లేదా వినియోగించని ప్రతి ఒక్కరి జీవితాలపై ప్రభావాన్ని చూపడం ఖాయమని తెలిసిపోయింది.

ఎఐ రంగం నైతిక విలువలకు లోబడి ఉండడంతో పాటు పారదర్శకత కలిగి, మానవాళికి మేలు చేకూర్చే విధంగా ఉండాలని కోరుకోవాలి.

భారతదేశంలో ఎఐ టెక్నాలజీ

భారత్‌లో ఎఐ రంగం వేగంగా వినియోగించబడుతూ, పలు విజయాలను నమోదు చేస్తున్నప్పటికీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాల టెక్నాలజీలతో పోల్చితే కొంత మందగమనం జరుగుతున్నట్లు అర్థం అవుతున్నది.

ఏఐ విసురుతున్న పలు సవాళ్లను అధిగమిస్తూ, రానున్న రోజుల్లో ఈ రంగంలో భారత్‌ కూడా పటిష్టమైన అడుగులు వేయాలని కోరుకుందాం.

ఏఐ ప్రశంసా దినం వేదికగా ఎఐ అనువర్తనాలను వివరించడం, చర్చలు నిర్వహించడం, ఎఐ ప్రాజెక్టులను ప్రదర్శించడం, ఎఐ పరిశోధకులను గుర్తించి ప్రశంసించడం, నైతికతను కాపాడడం లాంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు.

ఎఐ విప్లవం చూపిన బాటలో నడుస్తూ, ఎఐ టూల్స్‌ను మానవాళి శ్రేయస్సుకు వాడుకోవడం, భారతంలో మరో తరం ఎఐ విప్లవానికి నాంది పలకడం లాంటివి జరగాలని కోరుకుందాం. మానవుడి మేధస్సుకు ఎఐ సరి సమానం కాదని కూడా నమ్ముదాం.

ట్యాగ్‌లు: AI AI jobs