జగన్ సలహాదారులు ఏమయ్యారు…ఆ ఒక్క మాటతో అంతా డ్యామేజీ…
జగన్ సలహాదారులు ఏమయ్యారు...ఆ ఒక్క మాటతో అంతా డ్యామేజీ...
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు డ్రైవింగ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే, పోలీసులు నిందితుడు పైన హత్యాయత్నం కేసులో నమోదు చేశారు. అయితే ఈ సంఘటనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ “18 ఏళ్ల పిల్లోడు” అనే పదప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు.
ఒక వ్యక్తి మరణించిన కేసులో నిందితుడి పట్ల మాత్రమే సానుభూతి చూపిస్తే, అది రాజకీయంగా ఎంతో ప్రమాదకరం. వ్యక్తి మన పార్టీవాడైనప్పటికీ సరే, తప్పు మన వైపు ఉన్నప్పుడు మౌనంగా అయినా ఉండాలి లేదా బాధితుడి పక్షాన ఆయన నిలబడాలి.
కానీ జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తరపున కాకుండా, నిందితుడు పక్షాన మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఒక్క మాటతో ఇప్పుడు జగన్ ఇమేజి పైన పెద్ద డ్యామేజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒక మాట తడబాటు ఎంత భారీ మూల్యం అవుతుందో తెలిసిందే. గతంలోలా వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని గంటల్లో మరిచిపోయే పరిస్థితి లేదు అని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో రీల్స్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో, 30 నిమిషాల ప్రసంగంలో ఆ ఒక్క వాక్యాన్ని ఎడిట్ చేసి వేల సోషల్ మీడియా పేజీల్లో సర్కులేట్ చేస్తారు. అది ఏ స్థాయిలో డ్యామేజీ చేస్తుందో పొలిటికల్ పండితులు అంచనా వేసుకోవచ్చు.
ప్రజలు ప్రస్తుతం నాయకుడు ఎవరిని సమర్థిస్తున్నాడు అనేదానికంటే, బాధితుడు గురించి ఏమన్నాడు అన్నదానిపైనే ఎక్కువగా స్పందిస్తుంటారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశం పైన స్పందించకపోయినా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ బాధితుడు తరుపున మాట్లాడి ఉంటే, అది మైలేజీ కూడా ఇచ్చి ఉండేది.
కానీ ఇప్పుడు నిందితుడు తరఫున “18 ఏళ్ల పిల్లోడు” అంటూ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ గా మారింది. ప్రత్యర్థుల చేతిలో వస్త్రాలు మనమే ఇస్తే, డ్యామేజీ చేయడం క్షణాల్లో పని. వైసిపి వ్యతిరేక సోషల్ మీడియా ఇప్పుడు అదే పనిగా షేర్లు చేస్తోంది.
అయితే ఇక్కడ తప్పు ఎవరిది అంటే, జగన్మోహన్ రెడ్డి దా లేదా ఆయన చుట్టూ ఉన్న కమ్యూనికేషన్ టీం దా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యల ప్రభావాన్ని ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు లేదా కమ్యూనికేషన్ టీం అంచనా వేయలేకపోవడం అనేది అతిపెద్ద పొరపాటు అని చెప్పవచ్చు.
ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడే ముందు కచ్చితంగా కమ్యూనికేషన్ టీం వారికి ఏం మాట్లాడాలో ముందుగానే చర్చించి ఉంటే బాగుండేది. కానీ అలాంటి కసరత్తు ఏది కనిపించడం లేదు.
దీంతో పార్టీ వర్గాల్లో కూడా అసలు జగన్ దగ్గర పొలిటికల్ స్ట్రాటజీ నిర్ణయించే సలహాదారులు ఉన్నారా, లేక కేవలం చప్పట్లు కొట్టే వారు మాత్రమే మిగిలారా అనేది పెద్ద సందేహంగా మారింది.