Editorial: 2029లో అమలులోకి ‘ఒక దేశం – ఒక ఎన్నికలు’
Editorial: 2029లో అమలులోకి 'ఒక దేశం - ఒక ఎన్నికలు'
‘ఒక దేశం, ఒక ఎన్నికలు’ బిజెపి ఆశాపూరిత పథకం. కాగా, అది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం, ప్రజాస్వామ్యం పనితీరుకు విరుద్ధం, ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకమైన ఏకపక్ష నియంతృత్వ లక్షణం అనేది ప్రతిపక్షాల వాదన. దేశంలో ప్రతి ఏటా విడతలవారీ అసెంబ్లీ ఎన్నికల కారణాన ధనం వృధా వ్యయంతోపాటు అభివృద్ధి కుంటుపడుతుందనేది బిజెపి ప్రతివాదన. ఇది కేవలం సాకు మాత్రమేనని, అధికారం కేంద్రీకరణ, అధినాయకుని ఆకర్షక శక్తితో దేశమంతటికీ అధికారం విస్తరణ, ప్రాంతీయ మనోభావాలను – ప్రాంతీయ పార్టీలను అణచివేసి ఏకపక్ష అధికారం నెలకొల్పటం బిజెపి ధ్యేయంగా ప్రతిపక్ష పార్టీల బలమైన వాదన.
ఇది ఇంతటితో ఆగదని, పార్లమెంటరీ, ఫెడరల్ వ్యవస్థ బదులు యూనిటరీ పాలనా వ్యవస్థ (అధ్యక్ష తరహా పాలన)ను అభిలషించే బిజెపి సిద్ధాంతాన్ని నెరవేర్చుకునే దిశలో ప్రయాణానికి ‘ఒక దేశం – ఒక ఎన్నికలు’ బాటవేస్తాయని అనుమానాలు కూడా లేకపోలేదు. లోక్సభ సీట్లను 850కి పెంచి, నియోజకవర్గాల పునర్విభజనతో 2029 ఎన్నికలనుంచే మహిళా రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది.
చర్చలు, అపోహలు, తర్కవాదనలు ఎలా ఉన్నప్పటికీ, ‘ఒక దేశం – ఒక ఎన్నికలు’ అమలులోకి తెచ్చే పట్టుదలతో నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ అంశం అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 2024 సెప్టెంబర్లో నివేదిక సమర్పించింది. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరపటాన్ని సౌలభ్యం చేయటం ఎలా అన్నదే ఆ కమిటీకి ఇచ్చిన ఆదేశమైనందున, అది అందుకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది.
ఆర్టికల్ 83 (లోక్సభ కాలపరిమితి), ఆర్టికల్ 172 (రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం) సవరించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని, ఆర్టికల్ 82ఎ ని చేర్చాలన్నది కోవింద్ కమిటీ ముఖ్యమైన సిఫార్సుల్లో ఒకటి. ఈ సవరణకు రాష్ట్రాల ధృవీకరణ అక్కర్లేదట!
రాష్ట్రాల్లో ఫిరాయింపులు తదితర కారణాలతో ప్రభుత్వాలు అర్ధంతరంగా పడిపోయే అవకాశాన్ని అధిగమించేందుకు అసెంబ్లీలకు నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు అసెంబ్లీని సస్పెన్షన్లో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. పార్టీ లేదా పార్టీలు విభేదాలు సర్దుబాటు చేసుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. లేదా ఎన్నికలు నిర్వహించాల్సివస్తే, అవి సంబంధిత అసెంబ్లీ మిగతా కాలానికే పరిమితం చేయబడతాయి. మళ్లీ లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి.
రాజకీయ అస్థిరతతో లోకసభలో ఇదే పరిస్థితి (అర్థంతరంగా ప్రభుత్వం పడిపోవటం) తలెత్తితే – రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించనందున ఏమి చేస్తారు? ఇది వెల్లడించలేదు. పడిపోయిన ప్రభుత్వాన్నే ఆపద్దర్మ ప్రభుత్వంగా కొనసాగిస్తూ త్వరలోనే ఎన్నికలు జరుపుతారా? అప్పుడు అసెంబ్లీల సంగతేమిటీ? లేక అసెంబ్లీలకువలె లోక్సభకు కూడా ఫిక్స్డ్ టర్మ్ ప్రవేశపెడతారా? ఈ స్పష్టతకోసం కొంతకాలం వేచిచూడాలి.
ఒక దేశం, ఒక ఎన్నికల కోసం 129వ రాజ్యాంగ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్కూటినీలో ఉంది. 2029 నుండి ఏకకాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చట్రాన్ని రూపొందిస్తున్నామని ఆ కమిటీ చైర్మన్, బిజెపి ఎంపి పి.పి. చౌధురి ఇటీవల వెల్లడించారు. తాము ఇంతవరకు సంప్రదించిన పౌర సమాజ స్టేక్ హోల్డర్స్లో దాదాపు 99 శాతం ‘ఒక దేశం – ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను బలపరిచారని ఆయన చెప్పారు.
2029 లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రప్రభుత్వ ప్రయత్నం అమలులోకి వస్తే, కనీసం 13 అసెంబ్లీల పదవీకాలం కుదించాల్సి ఉంటుంది. 10 అసెంబ్లీలు రద్దు చేయాలి లేదా వాటి పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది.
2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు – కర్నాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం. వీటి ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో పాటు జరపాలంటే, ఈ అసెంబ్లీలను రద్దు చేయాలి లేదా వాటి పదవీకాలం పొడిగించాల్సి ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవు – 2029లో లోక్సభ ఎన్నికలతోపాటు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించటం ఈ సందర్భంగా గమనార్హం.
అలాగే 2027లో ఎన్నికలు జరిగే అసెంబ్లీల పదవీకాలాన్ని దాదాపు రెండు సంవత్సరాలు కోతపెట్టాల్సి ఉంటుంది. అవి ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్.
2026లో ఎన్నుకోబడిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీల పదవీకాలం మూడేళ్లు మాత్రమే పూర్తవుతుంది. అలాగే బిహార్, ఢిల్లీ అసెంబ్లీల పదవీకాలం కూడా ఒక సంవత్సరం తగ్గుతుంది.
గత లోక్సభ ఎన్నికలతోపాటు లేదా కొద్దినెలల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతోపాటు జరిపేందుకు ఇబ్బంది ఉండదు.
ఇదో పెద్ద విన్యాసం. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1952 నుండి 1967 దాకా నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి. ప్రజల్లోని అసంతృప్తి, ప్రాంతీయ రాజకీయ శక్తుల ఆకాంక్షలు ఏకకాల ఎన్నికలను దారితప్పించాయి.
తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం ఒక్క బిజెపి ఆకాంక్షగా కాకుండా ఉమ్మడి రాజకీయ ప్రయత్నంగా ముందుకు తెచ్చేందుకు పాలక బిజెపి చొరవ చేయకుండా, అంతా ఏకపక్ష వ్యవహారంగా సాగించటం దాని రాజకీయ ఆకాంక్షల ప్రయోజనం అనుమానాలకు తావిస్తోంది.