Rainwater Harvesting in India: ప్రతి వర్షపు చుక్కను కాపాడి నీటి విప్లవం సృష్టించిన అనేక దేశాలు.. భారత్ ఎందుకు వెనుకబడి ఉంది..
Rainwater Harvesting in India: ప్రతి చుక్కను కాపాడి నీటి విప్లవం సృష్టించిన అనేక దేశాలు.. భారత్ ఎందుకు వెనుకబడి ఉంది..
Rainwater Harvesting in India: ఇండియా ప్రస్తుతం వర్షాకాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా వరదలు, నీట మునిగిన రహదారులు, ట్రాఫిక్ జామ్‌లు, ఆకస్మిక వరదలు నిత్యకృత్యంగా మారాయి. ప్రపంచ జనాభాలో సుమారు 18 శాతం మంది మన దేశంలోనే నివసిస్తున్నప్పటికీ.. ప్రపంచ మంచినీటి వనరులలో కేవలం 4 శాతం మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. భారతదేశం తన వర్షపు నీటితో ఏమి చేస్తోందనే ప్రశ్న అత్యంత కీలకమైనదిగా మారింది. జల్ శక్తి అభియాన్ వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు పనిచేస్తున్నప్పటికీ.. నీటి సంరక్షణ దిశగా ఇంకా భారీగా అడుగులు పడాల్సి ఉంది.
వర్షపు నీటి సేకరణ అనేది భారతదేశానికి కొత్త భావన కాదు. ప్రాచీన కాలంలో ఈ వ్యవస్థలు కేవలం నీటిని నిల్వ చేయడానికే కాకుండా.. వరదల ప్రభావాన్ని తగ్గించే హైడ్రాలిక్ బఫర్‌లుగా కూడా పనిచేశాయి. సాంప్రదాయకంగా, దేవాలయాల సమీపంలో విడివిడి జలాశయాలకు బదులుగా.. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన చెరువుల వలయాన్ని నిర్మించారు. ఒక చెరువు నిండిన తర్వాత అదనపు నీరు మరొక చెరువులోకి ప్రవహించేలా చేయడం ద్వారా వరద నీరు వృధా కాకుండా నిలిచేది. తమిళనాడులోని చిదంబరం, కాంచీపురంలలోని దేవాలయ చెరువుల శ్రేణి ఇందుకు ఉత్తమ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థ నగరాలను సహజ స్పాంజ్ నగరాలుగా మార్చింది. స్థానిక భూగర్భ శాస్త్రం, జలశాస్త్రంపై అవగాహనతో పాటు ఆధ్యాత్మిక పడవ ఉత్సవాల వంటి సంస్కృతిని ముడిపెట్టి ప్రజలంతా సామూహికంగా ఈ నీటి కట్టడాలను సంరక్షించేవారు.
అయితే వేగవంతమైన పట్టణీకరణ కారణంగా సాంప్రదాయ నీటి నిల్వ ప్రాంతాలు.. చెరువులపై కాంక్రీట్ కట్టడాలు వెలిశాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు సహజంగా పల్లపు ప్రాంతాలకే ప్రవహిస్తుంది. గతంలో అక్కడ చెరువులు ఉండి భూగర్భంలోలోకి నీరు ఇంకేది. కానీ ఇప్పుడు ఆ స్థలాల్లో భవనాలు నిర్మించడం వల్ల నగరాలు మానవ నిర్మిత వరదలను ఎదుర్కొంటున్నాయి. నేటి ఆధునిక ఇంజనీరింగ్ కేవలం వర్షపాత సరళి ఆధారంగానే రూపకల్పన చేస్తూ స్థానిక జలవిజ్ఞానాన్ని.. భూ వినియోగాన్ని విస్మరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం చిరపుంజిలో కురుస్తున్నప్పటికీ.. నీటిని నిల్వ చేసే సరైన పరీవాహక ప్రాంతాలు లేకపోవడం, నీరు త్వరగా ఆవిరైపోవడం లేదా కొట్టుకుపోవడం వల్ల అక్కడ కూడా నీటి సంక్షోభం ఏర్పడుతోంది. దీనిని అధిగమించడానికి.. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలలో నీటి మూలం వద్దనే స్వచ్ఛమైన నీటిని సేకరించే చాల్-ఖాల్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా ఎండిపోయిన హిమాలయ పర్వత లోయలు తిరిగి పచ్చదనంతో నిండుతున్నాయి. అటు రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ ఉదయ్‌పూర్ నగరం ఎన్నడూ నీటి కొరతను ఎదుర్కోదు.. ఎందుకంటే అక్కడ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సరస్సుల నెట్‌వర్క్ ద్వారా వర్షపు నీటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచ దేశాల నీటి నిర్వహణ నమూనాలను పరిశీలిస్తే.. ఇజ్రాయెల్ నీటిని జాతీయ సంపదగా భావిస్తూ ప్రతి నీటి చుక్కను సేకరించి, శుద్ధి చేసి, భూగర్భ జలాల్లోకి తిరిగి పంపుతోంది. కమ్యూనిటీ సెంటర్లు, ప్రభుత్వ భవనాల ద్వారా అక్కడ సామూహిక వర్షపునీటి సేకరణ చేపడుతున్నారు. చైనా కూడా అనేక నగరాల్లో కాంక్రీట్ డ్రైనేజీలపై మాత్రమే ఆధారపడకుండా.. నీటిని ఇంకనిచ్చే తారు, బయోస్వేల్స్, రెయిన్ గార్డెన్స్, పట్టణ చిత్తడి నేలలను ఏర్పాటు చేసి స్పాంజ్ సిటీస్ భావనను విజయవంతంగా అమలు చేసింది.
నీటిని ఒకేచోట అడ్డుకోకుండా, దాని మూలం వద్దనే వేగాన్ని తగ్గించి భూమిలోకి ఇంకేలా చేస్తోంది. అలాగే సింగపూర్ తన మొత్తం భూభాగంలో మూడింట రెండు వంతుల భాగాన్ని ఒక పెద్ద పరీవాహక ప్రాంతంగా మార్చింది. మురుగునీటి వ్యవస్థకు, వర్షపునీటి పారుదల వ్యవస్థకు మధ్య కఠినమైన విభజనను పాటిస్తూ.. వర్షపు నీటిని పకడ్బందీ నెట్‌వర్క్ ద్వారా పట్టణ జలాశయాలకు మళ్లిస్తూ నీటి స్వయం సమృద్ధిని సాధించింది.
భారతదేశంలో వర్షపు నీటి సేకరణ కేవలం ఒక సూచనగా కాకుండా.. దేశంలోని సామాన్య ప్రజల ఉమ్మడి జాతీయ ఎజెండాగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటవాలుగా ఉండే ప్రాంతాలలో వర్షపు నీటిని సమతల రేఖల వెంట మళ్లిస్తే ఆకస్మిక వరదలను మనం నివారించవచ్చు. కేవలం ప్రభుత్వాలు చెరువులను నిర్మించి వదిలేయడం కాకుండా.. వాటి దీర్ఘకాలిక నిర్వహణలో సమాజ భాగస్వామ్యం అత్యంత ముఖ్యం. దీనికోసం క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలోని స్థానిక సంస్థలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు తమ పరిసరాల్లోని సాంప్రదాయ మెట్ల బావులు, ఆలయ చెరువులు, గ్రామ చెరువులను దత్తత తీసుకోవాలి. వాటిని శుభ్రపరిచి, వర్షపు నీరు వాటిల్లోకి చేరేలా బాధ్యత తీసుకోవడం ద్వారానే సుస్థిరమైన నీటి భద్రత సాధ్యమవుతుంది.