Skip to content
జాతీయం వార్తలు

Ramdev’s Hindu Rashtra Comments: భారతదేశం హిందూ రాష్ట్రం అంటూ రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు.. ముస్లింలు, క్రైస్తవులకు ముప్పు లేదంటూ ప్రకటన.. మండిపడుతున్న విపక్షాలు..

Prajapaksham 13 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Ramdev’s Hindu Rashtra Comments: భారతదేశం హిందూ రాష్ట్రం అంటూ రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు.. ముస్లింలు, క్రైస్తవులకు ముప్పు లేదంటూ ప్రకటన.. మండిపడుతున్న విపక్షాలు..

Ramdev's Hindu Rashtra Comments: భారతదేశం హిందూ రాష్ట్రం అంటూ రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు.. ముస్లింలు, క్రైస్తవులకు ముప్పు లేదంటూ ప్రకటన, విపక్షాల తీవ్ర ఆగ్రహం..

Ramdev’s Hindu Rashtra Comments: భారతదేశం హిందూ రాష్ట్రంగా మారడం పట్ల దేశంలోని ముస్లింలు లేదా క్రైస్తవులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మతాలు వేరైనప్పటికీ దేశంలోని ప్రజలందరి పూర్వీకులు ఒక్కరేనని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి, వివాదానికి దారితీశాయి.

2009లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఇస్లామిక్ విద్యాసంస్థ (మదర్సా) డియోబంద్‌ను సందర్శించిన సందర్భాన్ని రామ్‌దేవ్‌ బాబా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరిద్వార్ సమీపంలో ఉన్న డియోబంద్‌కు నాడు తనను ఆహ్వానించినప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని అక్కడి వారితో పంచుకున్నానని తెలిపారు. మన పూజా విధానాలు, మతాలు వేరుగా ఉండవచ్చు కానీ, మనందరి డిఎన్ఏ, పూర్వీకులు ఒక్కరేనని అన్నారు. హిందూ రాష్ట్రం అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. మనందరి పూర్వీకులు సనాతన హిందూ ఆర్య-వైదికులేనని.. ఈ విషయం చరిత్రలో స్పష్టంగా లిఖించి ఉందని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని మైనారిటీ వర్గాలను ఉద్దేశించి రామ్‌దేవ్ బాబా కొన్ని కీలక సూచనలు చేశారు. ఒకవేళ దేశంలో హిందూ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలు ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్నకు సమాధానం చాలా సులభమని అన్నారు. మైనారిటీలు తమ పూర్వీకుల సంప్రదాయాలను.. వారి లాంటి ఉన్నత వ్యక్తిత్వాన్ని స్వీకరిస్తే సరిపోతుందని సూచించారు. మీరు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం గడ్డం పెంచుకోవచ్చు లేదా తీసివేయవచ్చు. మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు. కానీ మీ పూర్వీకుల లాంటి నైతిక వ్యక్తిత్వాన్ని మాత్రం కలిగి ఉండండి. హిందుస్థాన్‌లో ముస్లింలకు గానీ, క్రైస్తవులకు గానీ ఎలాంటి ప్రమాదం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (SP) వంటి ప్రధాన విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. రామ్‌దేవ్ బాబా చెప్పినట్లు దేశంలోని వారందరూ సనాతనులే అయినప్పుడు.. సమాజంలో ఇన్ని విభజనలు సృష్టించడానికి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ప్రశ్నించారు.

మరోవైపు దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యవసరమైన సవాళ్లు, నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంలో భాగంగానే యోగా గురువు ఈ తరహా వ్యాఖ్యలు చేశారని సమాజ్‌వాదీ పార్టీ నేత ఫఖ్రుల్ హసన్ చాంద్ ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి దేశ సమస్యల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే బాబా రామ్‌దేవ్ వంటి వారి ద్వారా ఇలాంటి భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. దేశానికి సంబంధించిన అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించవద్దని ఆయన హితవు పలికారు.