జనసేనకు నవంబర్ గండం…పవన్ ఏం చేస్తారో అనే నిరాశలో కేడర్…
జనసేనకు నవంబర్ గండం...పవన్ ఏం చేస్తారో అనే నిరాశలో కేడర్...
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి చేపట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచాయి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాది నవంబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలపైనే అందరి దృష్టి కొనసాగుతోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన ఇప్పటికే కూటమిలో ఒక జూనియర్ భాగస్వామిగా మిగిలిపోయిందని అటు పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది అని చెప్పవచ్చు. నిజానికి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేనకు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు విజయవంతం అవ్వడానికి మాత్రం జనసేన కలిసి రావడమే అసలు విజయ రహస్యం అని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతుంటారు. ఎందుకంటే కోస్తా ఆంధ్ర లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఎక్కువగా తమతోనే ట్రావెల్ అవుతోందని కూటమిలో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో సీట్లు వచ్చాయని లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీకి అంత సీను లేదని జనసేన నేతలు కూడా కుండబద్దలు కొట్టి మరీ చెబుతుంటారు.
అధికారం వచ్చిన అనంతరం పంచిన పదవుల్లో కూడా తమను జూనియర్ భాగస్వామిగానే చూస్తున్నారని జనసేన నేతల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకొని సంతృప్తి చెంది ఆ తర్వాత పదవుల విషయంలో ఏ మాత్రం పట్టు పట్టకపోవడంపై అనేది జనసేన కేడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్ పదవుల విషయంలో కానీ, ఎమ్మెల్సీల విషయంలో కానీ జనసేన ఏ మాత్రం పట్టు పట్టలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఆదిపత్యం కూటమిలో కొనసాగుతోంది అని చెప్పవచ్చు. అటు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జనసేన ఇన్చార్జి లకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. ఇది కూడా పార్టీలో తీవ్ర సంతృప్తి లేపుతోంది అని చెప్పవచ్చు. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన ఇన్చార్జిలను పట్టించుకోవడం లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జీలు చక్రం తిప్పుతున్నారు. దీనిపై తెలుగుదేశం అధినాయకత్వం వరకు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు.
ఇప్పుడు తాజాగా నవంబర్ నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినట్లయితే జనసేన వర్గాలు మాత్రం తమకు ఈసారి మెజారిటీ స్థానాల్లో బలం ఉన్నచోట సీట్లను కేటాయించాలని పట్టుబడుతున్నాయి. వీలైతే ఒంటరిగా పోటీకి వెళదామని కూడా పార్టీ ముందు ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగో కేవలం 21 స్థానాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల పదవుల విషయంలో అదే ధోరణి కొనసాగితే జనసేన కేడర్ నిరాశలో కృంగిపోయే అవకాశం ఉంటుంది. అటు పార్టీ కూడా క్షేత్రస్థాయిలో విస్తరించడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని, అధినేత పవన్ కళ్యాణ్ ముందు పార్టీ వర్గాలు మొర పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి అసలు నవంబర్ గండం జనసేనకు ఎలా గడుస్తోంది అన్నది ముందు ముందు తెలుస్తుంది.