Climate Change and El Niño: రుతుపవనాలకు మళ్లీ బ్రేక్.. జూలై 10 నుంచి వర్షాలు తగ్గుముఖం.. తెలంగాణలో పెరగనున్న ఎండలు..
Climate Change and El Niño: రుతుపవనాలకు మళ్లీ బ్రేక్.. జూలై 10 నుంచి వర్షాలు తగ్గుముఖం.. తెలంగాణలో పెరగనున్న ఎండలు..
Climate Change and El Niño: జూన్ నెలలో దాదాపు 3 వారాల పాటు మందగించిన రుతుపవనాలు జూలై నెల ప్రారంభంలో ఒక్కసారిగా పుంజుకుని దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిపించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, తేమ గాలుల కారణంగా.. పశ్చిమ, మధ్య, ఉత్తర భారత దేశంలో కురిసిన ఈ వర్షాలు సీజనల్ వర్షపాత లోటును గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుతం వర్షపాతం సాధారణం కంటే 14.3 శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. రుతుపవనాలు సాధారణ స్థాయికి చేరినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాలు వెల్లడించాయి. ఈ తొమ్మిది రోజుల వర్షాల వల్ల జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం, నేలలో తేమ శాతం మెరుగుపడటంతో ఖరీఫ్ సాగు పనులు వేగవంతమయ్యాయి. అయితే ఈ సానుకూల ఊపు ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న అల్పపీడన వ్యవస్థ బలహీనపడటం, మేఘాల విస్తరణ తగ్గడం వల్ల జూలై 10 నుంచి 15 మధ్య ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ వర్ష విరామం కారణంగా జూలై మధ్య నాటికి దేశ మొత్తం వర్షపాతం మళ్లీ లోటు స్థాయికి పడిపోవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వరి వంటి ఖరీఫ్ పంటలు వేసిన ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గిపోతే.. మొలక దశలో ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వర్షాల విరామ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైనా తీవ్రంగా ఉండనుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగి, జూలై 10 నుంచి 15 మధ్య జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాకాలం మధ్యలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణం కాదని పేర్కొంటున్నారు.
సాధారణంగా ఎల్‌నినో పరిస్థితులు భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ ఎల్‌నినో ధోరణి కారణంగానే ఒకేసారి భారీ వర్షాలు కురిసి, ఆ వెంటనే సుదీర్ఘ కాలం పాటు పొడి వాతావరణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల సీజన్ మొత్తం సమానంగా వర్షాలు కురవకుండా, తీవ్రమైన వర్షాలు, సుదీర్ఘ కరవు పరిస్థితుల మధ్య ఊగిసలాట కనిపిస్తుంది. జూలై చివరి వారంలో రుతుపవనాలు మరోసారి పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అప్పటివరకు రైతులు ఆకాశం వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాబోయే వారాల్లో ఎల్‌నినో ప్రభావం ఎంత మేర ఉంటుందనే దానిపైనే ఈ ఏడాది ఖరీఫ్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.