CJP to March to Parliament: జూలై 20న సీజేపీ పార్లమెంట్ ముట్టడి.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్..
CJP to March to Parliament: జూలై 20న సీజేపీ పార్లమెంట్ ముట్టడి.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్..
CJP to March to Parliament: ఈనెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ శాంతియుత నిరసన చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయించింది. ఆ రోజున జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు సీజేపీ శాంతియుత ర్యాలీని నిర్వహిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. వివిధ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు.. నిర్వహణ లోపాలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో యువత, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి విదితమే. పరీక్షల కుంభకోణాలు.. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సీజేపీ గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతోంది.
విద్యావ్యవస్థలో సంస్కరణలు తేవాలని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటాన్ని ఆపనని ఆయన స్పష్టం చేశారు. జూలై 20న నిర్వహించబోయే పార్లమెంట్ ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వాంగ్‌చుక్ ఒక భావోద్వేగ సందేశాన్ని ఇస్తూ.. నేను సజీవంగా ఉండాలని, ఈ దేశ విద్యావ్యవస్థ బాగుపడాలని మీరు నిజంగా ఆశిస్తే.. కేవలం మీ ఇళ్లల్లో సోఫాలపై కూర్చుని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపితే సరిపోదు. దయచేసి అందరూ ఢిల్లీకి తరలిరండి. జూలై 20న నాతో కలిసి పార్లమెంట్ వైపు శాంతియుతంగా నడవండి. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్ బాధ్యతాయుతంగా స్పందించేలా చేద్దామని కోరారు.
కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ప్రతినిధి విజేత దహియా మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిరసనను పూర్తిగా శాంతియుత మార్గంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని.. అందుకే తమ విన్నపాలను, కోపాన్ని మరింత స్పష్టంగా, బలంగా వినిపించేందుకు పార్లమెంట్ ప్రజాస్వామ్య వేదిక వైపు వెళ్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల వైఫల్యాల కారణంగా మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల స్మృతికి నివాళిగా ఈ ర్యాలీని అంకితం ఇస్తున్నట్లు సీజేపీ వెల్లడించింది.