ప్రశ్న రావణ్ వెనుక ఉన్నది టిడిపినే… మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ప్రశ్న రావణ్ వెనుక ఉన్నది టిడిపినే... మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి ప్రశ్న రావణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పైన జనసైనికులు వరుసగా కేసులు పెట్టడం, చివరకు యూఏపీఏ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయడంతో పోలీసు రిమాండ్‌లో ప్రశ్న రావణ్ మగ్గుతున్నట్లు తెలుస్తోంది.
అయితే రావణ్ సృష్టించిన దుమారం అంతా కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకొని ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా ఎన్నడూ చేయని రీతిలో ప్రశ్న ఎదురుదాడికి దిగడం చూస్తుంటే, ఇదంతా పవన్ కళ్యాణ్ వైపు ప్రశ్న రావణ్‌ను ప్రేరేపించి మరీ విమర్శలు గుప్పిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ప్రశ్న రావణ్ వెనుక వైసీపీ పార్టీ ఉందా లేదా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్‌కు మద్దతుగా న్యూట్రల్స్, ప్రజాస్వామ్యవాదులు అండగా నిలబడుతున్నా, వైఎస్సార్సీపీ మాత్రం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఈ అంశం పైన పట్టించుకోవడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కూడా ప్రశ్న రావణ్‌ను తమ వైపు వ్యక్తిగా వకాల్తా తీసుకోవడం లేదు.
మరోవైపు ఆసక్తికరంగా ప్రశ్న రావణ్ వెనుక ఆశ్చర్యకరంగా తెలుగుదేశం ఐటీ సెల్ ఉంది అని విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ యువనేత లోకేష్ అండదండలతోనే ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నాడని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని కూడా ఇదే అంశం పైన మాట్లాడుతూ రావణ్ టీడీపీకి అనుకూలమైన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఈ సందర్భంగా ఆరోపించారు. అంతేకాదు, ఆయన గతంలో టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. అలాగే టీడీపీ రావణ్‌పై కేసులు పెట్టడం లేదని, కేవలం జనసేనతో కలిసి ఎక్కడా కూడా నిరసనలు వంటివి చేయడం లేదని వేలెత్తి చూపించారు.
అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా తీవ్ర విమర్శలు చేసిన తాము అణిచివేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపిన వారిని ఉప్మా, ఇడ్లీ అంటూ కొత్త చట్టాలతో జైల్లో పెడుతున్నారని యూఏపీఏ చట్టాన్ని ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తమది గొడ్డలి పార్టీ అంటున్న చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నచ్చని వ్యక్తులను పోలీస్ స్టేషన్‌లో తగలబెట్టించింది టీడీపీ అని, అందుకే ఆ పార్టీని బూడిద పార్టీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని కొడాలి నాని విమర్శించారు.
అలాగే ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్‌పై టార్గెట్ చేస్తూ ప్రశ్న రావణ్ చేస్తున్న వ్యాఖ్యలే ఈ అరెస్టుకు కారణమని కొడాలి నాని పేర్కొన్నారు. అలాగే జనసేన కక్షపూరితంగా కేసులు పెట్టి రావణ్‌ను స్టేషన్ల చుట్టూ తిప్పుతోందని ఈ సందర్భంగా కొడాలి నాని తెలిపారు. అయితే రావణ్ వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేస్తోంది టీడీపీ పేటీఎం బ్యాచ్ మాత్రమే అని, తమకు రావణ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఎల్లో మీడియా అసత్య కథనాలతో వైసీపీకి రుద్దే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు.