లెనిన్ పైనే నాగార్జున ఆశలు… అఖిల్‌కు టైర్ వన్ హీరో అయ్యే యోగం ఉందా..?
లెనిన్ పైనే నాగార్జున ఆశలు... అఖిల్‌కు టైర్ వన్ హీరో అయ్యే యోగం ఉందా..? ( Image: X.com)
అక్కినేని వారసుడు అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి దాదాపు పుష్కరం గడిచిపోయింది. తొలి సినిమా అఖిల్ తో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్న మన యువ సామ్రాట్ వారసుడు ఆ తర్వాత నెమ్మదిగా కోరుకునే ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన ఒక్క సాలిడ్ హిట్టు కూడా ఇంకా పడలేదు. ముఖ్యంగా అక్కినేని అఖిల్ నిజానికి అక్కినేని వంశం తరపున టైర్ వన్ హీరో అవుతాడని అభిమానులతో పాటు నాగార్జున కూడా కలలు కన్నాడు అని సినీ వర్గాల్లో చెబుతుంటారు. అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున కూడా టైర్ వన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకొని టాలీవుడ్ లో స్థిరమైన మార్కెట్ ఉన్న హీరోగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమకు నాలుగు మూల స్తంభాల్లో ఒకరిగా చలామణి అవుతున్నాడు. అయితే నాగార్జున తర్వాత అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అంతగా సక్సెస్ కాలేదు అని చెప్పవచ్చు. అక్కినేని సుమంత్, సుశాంత్, నాగ చైతన్య ముగ్గురు కూడా ఇండస్ట్రీలో గట్టిగా ట్రై చేశారు. వీరిలో సుమంత్ కొన్ని హిట్స్ సైతం అందుకున్నాడు. అయితే అనుకున్న స్థాయిలో టైర్ వన్ హీరోగా మాత్రం మారలేకపోయాడు. కేవలం ఉనికి కోసం అప్పుడో సినిమా ఇప్పుడు సినిమా చేస్తూ సుమంత్ ఇండస్ట్రీలో తాను ఉన్నాను అంటూ కనిపిస్తున్నాడు అంతేతప్ప టాలీవుడ్ మార్కెట్ లెక్కల్లో సుమంత్ ఎప్పుడో వెనకబడిపోయాడు. ఇక సుశాంత్ పరిస్థితి కూడా దాదాపు అంతే అని చెప్పవచ్చు. సినిమాలు లేక సుశాంత్ గురించి ఎవరూ పట్టించుకోని స్థితికి పడిపోయాడు.
ఇక అక్కినేని వారసుల్లో అంతో ఇంతో నాగార్జున తర్వాత పేరు తెచ్చుకుంది ఎవరైనా ఉన్నారు అంటే అది నాగచైతన్య అని చెప్పవచ్చు. చైతు తొలి సినిమా జోష్ అంతగా నడవనప్పటికీ ఆ తర్వాత ఏం మాయ చేసావే, 100% లవ్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ సృష్టించుకుంటూ ముందుకు వెళ్లాడు. కానీ చైతు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ అనేవి లేవు. ఓవైపు టైర్ వన్ హీరోలుగా అటు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకొని పాన్ ఇండియా హీరోలుగా చలామణి అయిపోతుంటే అటు నాగ చైతన్య టైర్ టు హీరోగా మిగిలిపోయాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని అభిమానులకు మింగుడు పడని అంశంగానే చెప్పవచ్చు. తాజాగా తండేల్ సినిమా హిట్ అవడంతో నాగచైతన్య మార్కెట్ కూడా కాస్త పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే టైర్ వన్ స్థాయికి మాత్రం నాగచైతన్య చేరుకోవడం చాలా కష్టమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక అక్కినేని వారి చూపు మొత్తం అఖిల్ పైనే ఉంది నిజానికి అఖిల్ చూడటానికి చక్కటి హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. డ్యాన్సులు ఫైట్స్ లో ఏమాత్రం వెనుకాడడు. చక్కటి ఫిజిక్, మంచి రూపం అఖిల్ సొంతం. కానీ ఒక్క హిట్టు కూడా లేక అఖిల్ ఇండస్ట్రి రేసులో వెనుకబడిపోయాడు. అఖిల్ తర్వాత చిన్నచిన్న అడుగులు వేస్తూ వచ్చినా హీరోలు ఈరోజు ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలుగా చలామణి అవుతున్నారు. మరెవరో కాదు విజయ్ దేవరకొండ అని చెప్పవచ్చు. ఎందుకంటే అఖిల్ తొలి సినిమా విడుదలయ్యే నాటికి విజయ్ దేవరకొండ అసలు ఇండస్ట్రీలో ఒక బడ్డింగ్ నటుడు మాత్రమే. గత పది సంవత్సరాల్లో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. 2 బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టి చేతి నిండా సినిమాలతో తనకంటూ ఒక రౌడీ ఫ్యాన్ బేస్ తో ముందుకు దూసుకెళ్లిపోయాడు. కానీ అఖిల్ మాత్రం ఇంకా ఎప్పటికప్పుడు కం బ్యాక్ ఇస్తాను అంటూ వరుస అపజయాలతో అక్కినేని అభిమానులకు తీరని వేదన మిగులుస్తున్నాడు.
ఇప్పుడు ఇక అక్కినేని అభిమానులు అటు నాగార్జున ఆశలు కూడా కేవలం లెనిన్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా మొదటి ఆట లోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లైతే, అఖిల్ రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి టైర్ వన్ హీరో లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి ఏజెంట్ సినిమా హిట్ అయి ఉంటే ఈపాటికి అఖిల్ మార్కెట్ భారీగా పెరిగి ఉండేది. కానీ ఒక తప్పటడుగు వేయడంతో మూడు సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి లెనిన్ అఖిల్ జీవితంలో విప్లవం సృష్టిస్తుందా లేదా అనేది ఈ జూలై 10వ తేదీన మొదటి ఆటతో తేలిపోతుంది.