Cancer Drugs Price Cut: క్యాన్సర్ రోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. మందుల ధరలు 70% వరకు తగ్గే అవకాశం
US Pharma Tariff
Cancer Drugs Price Cut: ఖరీదైన క్యాన్సర్ చికిత్స వ్యయాన్ని తగ్గించి, బాధితులకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో లభించే అన్ని షెడ్యూల్ చేయని (Non-scheduled) క్యాన్సర్ నిరోధక మందుల లాభ మార్జిన్‌ను (Trade Margin) గరిష్ట చిల్లర ధరలో (MRP) అత్యధికంగా 30 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. దేశీయంగా తయారయ్యే బ్రాండెడ్, జెనరిక్ మందులతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పేటెంట్, నాన్-పేటెంట్ ఔషధాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నిర్ణయం ఫలితంగా కొన్ని రకాల మందుల ఎంఆర్‌పిపై ఏకంగా 70 శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని, తద్వారా క్యాన్సర్ రోగులకు ఏటా సుమారు ₹2,500 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ చర్య ఎందుకు చేపట్టింది?
ఔషధ రంగానికి చెందిన మధ్యవర్తులు, వ్యాపారులు వసూలు చేసే విపరీతమైన లాభ మార్జిన్లను తగ్గించి, ప్రాణరక్షక క్యాన్సర్ మందులను రోగులకు అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గతంలో 2019లో కూడా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా 42 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై లాభ మార్జిన్‌ను నియంత్రించింది. ఆ సమయంలో 526 బ్రాండ్ల మందుల ధరలు తగ్గి, రోగులకు ఏటా సుమారు ₹984 కోట్లు ఆదా అయ్యాయి. అదే స్పూర్తితో ఇప్పుడు అన్ని షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందులకూ ఈ నిబంధనను విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల నాణ్యమైన చికిత్స సులభంగా అందుబాటులోకి రావడమే కాకుండా, మార్కెట్‌లో మందుల కొరత ఏర్పడకుండా లభ్యత కూడా సుగమం అవుతుంది.
ఏమిటీ షెడ్యూల్డ్ , నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులు?
డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్, 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం దేశంలో మందుల ధరలు నియంత్రించబడతాయి.
షెడ్యూల్డ్ మందులు (Scheduled Drugs): కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించే ‘అత్యవసర మందుల జాతీయ జాబితా’ (NLEM) ని DPCO, 2013 షెడ్యూల్-I లో చేరుస్తారు. ఇందులో సెక్షన్ 7 కింద ఇమ్యునోసప్రెసివ్, పాలియేటివ్ కేర్‌తో కలిపి మొత్తం 131 రకాల క్యాన్సర్ నిరోధక ఫార్ములేషన్లు ఉన్నాయి. జాతీయ ఔషధ ధరల నిర్ధారణ అథారిటీ (NPPA) ఈ 131 రకాల షెడ్యూల్డ్ మందుల గరిష్ట విక్రయ ధరలను (Ceiling Prices) నేరుగా నిర్ధారిస్తుంది. తయారీదారులు ఎవరైనా సరే ఆ ధర కంటే ఎక్కువకు అమ్మకూడదు.
షెడ్యూల్ చేయని మందులు (Non-Scheduled Drugs): షెడ్యూల్-I జాబితాలో లేని మిగిలిన క్యాన్సర్ మందులన్నింటినీ ‘నాన్-షెడ్యూల్డ్ మందులు’ అంటారు. ఇప్పటివరకు వీటిపై పరోక్ష ధరల నియంత్రణ మాత్రమే ఉండేది, దీనివల్ల వ్యాపారులు అధిక లాభ మార్జిన్లను జోడించి విక్రయించేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ నాన్-షెడ్యూల్డ్ మందుల లాభ మార్జిన్ 30 శాతానికి మించకూడదనే స్పష్టమైన సీలింగ్ అమల్లోకి వచ్చింది.