మహిళ అనుకుని పురుషుడితో సహా జీవనం.. నిజం తెలిసి షాకైన యువకుడు.. తర్వాత ఏమైందంటే..
మహిళ అనుకుని పురుషుడితో సహా జీవనం
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక వ్యక్తిని మహిళగా భావించి, సహజీవనం చేసిన ఒక యువకుడు.. తీరా అసలు విషయం తెలిసి షాక్‌కు గురయ్యాడు. ఆ వ్యక్తి వేధింపుల నుంచి తట్టుకోలేక చివరకు అతడిని దారుణంగా హతమార్చిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల పియూష్ కుమార్ ఖర్వార్ గతంలో హైదరాబాద్‌లో పనిచేసేవాడు.
ఆ సమయంలో అతనికి ఫేస్‌బుక్‌లో ‘నిషా కుమార్’ (ఇన్‌స్టాగ్రామ్‌లో పూనమ్) అనే పేరుతో ఉన్న ఒక ఖాతా నుండి సందేశం వచ్చింది. అవతలి వ్యక్తి మహిళేనని నమ్మిన పియూష్ అతడితో పరిచయం పెంచుకున్నాడు. అయితే సదరు ఖాతా నిర్వహిస్తున్నది చందన్ కుమార్ అనే పురుషుడు. పియూష్‌ను లోబరుచుకోవాలనే ఉద్దేశంతో చందన్ ఎప్పుడూ లేడీ దుస్తులు ధరిస్తూ, తను ఒక స్త్రీనని నమ్మించి హైదరాబాద్‌లోనే పియూష్‌తో కలిసి ఒకే గదిలో సహజీవనం చేయడం ప్రారంభించాడు. మతపరమైన కారణాలు, ఆచారాల సాకుతో పియూష్‌తో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరిస్తూ ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.

అయితే, ఒకరోజు చందన్ రహస్యంగా గడ్డం గీసుకోవడం (షేవింగ్ చేసుకోవడం) పియూష్ కంటపడటంతో అసలు నిజం బయటపడింది. అప్పటివరకు తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి స్త్రీ కాదు, స్వలింగ సంపర్కాన్ని కోరుకునే పురుషుడని తెలిసి పియూష్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే అతడితో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ చందన్ మాత్రం పియూష్‌ను వదిలిపెట్టడానికి నిరాకరించాడు. చందన్ వేధింపులు భరించలేక పియూష్ హైదరాబాద్ వదిలి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చివరకు గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాకు తన ఉద్యోగాలను మార్చాడు. అయినప్పటికీ చందన్ అతడిని వదలకుండా.. పియూష్ వెళ్లిన ప్రతి ప్రాంతానికి వెంటపడుతూనే వచ్చాడు.
చివరగా జూన్ 21న రాజ్‌కోట్‌లోని పద్వాల గ్రామంలో ఉన్న ఒక ఫ్యాక్టరీ వద్ద వీరిద్దరి మధ్య ఈ విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో చందన్ పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకున్న పియూష్.. అతడిని మాటల్లో దించి రైల్వే ట్రాక్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద బండరాయితో తలపై బలంగా కొట్టి చందన్‌ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బండరాళ్ల కింద దాచిపెట్టి అక్కడి నుండి పారిపోయాడు.
జూన్ 25న రైల్వే ట్రాక్ సమీపంలో మహిళా దుస్తుల్లో ఉండి, పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం నివేదికలో తలకు బలమైన గాయాలు కావడం వల్లే మరణం సంభవించిందని తేలడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, లభించిన సాంకేతిక ఆధారాల (మొబైల్ డేటా) సాయంతో పోలీసులు పియూష్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పియూష్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ, హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.