Skip to content
జాతీయం వార్తలు

ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట.. సెప్టెంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ

Prajapaksham 01 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట.. సెప్టెంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ

CPI Unveils Official Posters for “Badlaav Zaroori Hai” Rally

ప్రజలను వేధిస్తున్న పలు కీలక సమస్యలపై జనాన్ని ఏకం చేయడమే లక్ష్యం

2026 సెప్టెంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ

బద్లావ్ జరూరీ హై (మార్పు అవసరం) మహా ర్యాలీ అధికారిక పోస్టర్లు ఆవిష్కరణ

భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై విస్తృత స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బద్లావ్ జరూరీ హై (మార్పు అవసరం) మహా ర్యాలీకి సంబంధించిన అధికారిక పోస్టర్లను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజాతో పాటు జాతీయ సచివాలయ సభ్యులు ఎంపీ పి. సంతోష్ కుమార్, డాక్టర్ భల్చంద్ర కంగో, డాక్టర్ గిరీష్ శర్మ, అనీ రాజా, కె. రామకృష్ణ, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీపీఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ దినేష్ చంద్ర వర్ష్నీ పాల్గొన్నారు.

పార్టీ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో బద్లావ్ జరూరీ హై పేరుతో భారీ ప్రజా ర్యాలీ నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతులు, కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సీపీఐ వెల్లడించింది. ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఆర్థిక, సామాజిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రజల గొంతుకగా నిలవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ ర్యాలీ ద్వారా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. అలాగే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధమైన హామీ కల్పించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని, మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని, దళితులు, ఆదివాసీలకు సామాజిక న్యాయం అందించాలని కోరుతోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, భారత రాజ్యాంగం ప్రతిపాదించిన విలువలను పరిరక్షించాల్సిన అవసరాన్ని కూడా ఈ ర్యాలీ ప్రధానంగా ప్రస్తావించనుంది.

మహా ర్యాలీకి ముందుగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రత్యేక పాదయాత్రలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ పాదయాత్రల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ర్యాలీకి విస్తృత మద్దతు కూడగట్టే కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఇదిలా ఉండగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా జూలై 2 నుంచి 7 వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన చేయనున్నారు. శ్రీలంక కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన 83వ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆహ్వానించడంతో ఈ పర్యటన ఖరారైంది. పర్యటనలో భాగంగా డి. రాజా శ్రీలంక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంతో పాటు అక్కడి వామపక్ష సోదర పార్టీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే వార్షికోత్సవ సభల్లో పాల్గొని, వివిధ ప్రాంతాల్లోని పార్టీ కార్యకర్తలు, మేధావులు, శ్రామికులు, సామాజిక సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు.

ఈ సందర్భంగా ఆయన కొలంబో, క్యాండీ, అనురాధపురం, జాఫ్నానగరాల్లో పర్యటించనున్నారు. జాఫ్నాలో జాలర్ల సంఘ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని సందర్శించి అక్కడి సాంస్కృతిక, సామాజిక వారసత్వంపై అవగాహన పొందనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్–శ్రీలంక వామపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజా ఉద్యమాల అంశాలపై పరస్పర సహకారం పెరుగుతుందని సీపీఐ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ట్యాగ్‌లు: CPI CPI news CPI Protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *