Skip to content
బిజినెస్ వార్తలు

ఏఐ దెబ్బకు యూటర్న్ తీసుకున్న ఫోర్డ్.. పాత ఇంజనీర్లను వెనక్కి పిలిపిస్తున్న సంస్థ‌

Prajapaksham 29 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
ఏఐ దెబ్బకు యూటర్న్ తీసుకున్న ఫోర్డ్.. పాత ఇంజనీర్లను వెనక్కి పిలిపిస్తున్న సంస్థ‌

Ford Rehires Veteran Engineers After AI Reportedly Falls Short in Key Tasks

ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్’ (Ford), సాంకేతికత ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై అతిగా ఆధారపడటం వల్ల ఎదురైన వైఫల్యాల నుండి ఒక కీలకమైన గుణపాఠాన్ని నేర్చుకుంది. పూర్తి ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, కంపెనీ తన పాత వ్యూహానికి స్వస్తి పలికి మానవ నైపుణ్యానికి మళ్లీ పెద్దపీట వేయడం ప్రారంభించింది. నాణ్యతను పెంచి, భారీ వ్యయాలను తగ్గించుకునే లక్ష్యంతో కంపెనీ తన మాజీ ఉద్యోగులను, దశాబ్దాల అనుభవం ఉన్న ఇంజనీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటోంది. మానవ మేధస్సుకు, సాంకేతికతకు సరైన సమన్వయం కుదిర్చిన ఈ సరికొత్త నిర్ణయం ఇప్పటికే అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తోంది. ప్రముఖ ‘జేడీ పవర్ ఇనిషియల్ క్వాలిటీ సర్వే’లో ప్రధాన ఆటోమొబైల్ బ్రాండ్లలో ఫోర్డ్ అగ్రస్థానానికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.

‘బ్లూమ్‌బర్గ్’ కథనం ప్రకారం, ఫోర్డ్ సంస్థ గత మూడేళ్లలో సుమారు 350 మంది అత్యంత అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తిరిగి నియమించుకుంది. వీరిలో కంపెనీ మాజీ ఉద్యోగులతో పాటు, వివిధ అనుబంధ సంస్థలలో కీలక పాత్రలు పోషించిన నిపుణులు ఉన్నారు. వాహనాల తయారీలో దశాబ్దాల తరబడి క్షేత్రస్థాయి అనుభవం ఉన్న ఉద్యోగులను విస్మరించి, కేవలం ఆటోమేషన్‌పైనే భారం వేయడం పెద్ద పొరపాటని కంపెనీ ఉన్నతాధికారులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు.

ఈ మార్పులపై ఫోర్డ్ వెహికల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ స్పందిస్తూ.. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెడితేనే అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తులు వచ్చేస్తాయని తాము పొరపాటుగా భావించామని తెలిపారు. ఏఐ అనేది ఒక అద్భుతమైన సాధనమే అయినప్పటికీ, దానికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే సమాచారం (డేటా)పైనే దాని పూర్తి సామర్థ్యం ఆధారపడి ఉంటుందని వివరించారు. గతంలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కంపెనీని విడిచి వెళ్లే సమయంలో వారి మేధో సంపత్తిని, విజ్ఞానాన్ని భద్రపరచడంలో విఫలమయ్యామని, దానివల్లే ఏఐ వ్యవస్థలు వాస్తవ ప్రపంచంలోని సాంకేతిక సమస్యలను ముందుగా గుర్తించలేకపోయాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం తిరిగి విధుల్లో చేరిన ఈ సీనియర్ నిపుణులను కంపెనీలో గౌరవంగా “గ్రే బియర్డ్స్” (Gray Beards – అనుభవజ్ఞులు) అని పిలుస్తున్నారు. వీరు ప్రస్తుతం యువ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు, ఏఐ టూల్స్‌కు మెరుగైన శిక్షణ ఇవ్వడం ,వాహనాలు ఫ్యాక్టరీ నుండి బయటకు రాకముందే వాటిలోని నాణ్యతా లోపాలను పక్కాగా గుర్తించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమస్య వచ్చిన తర్వాత సరిదిద్దడం కంటే, అసలు సమస్యే రాకుండా నివారించే దిశగా తాము అడుగులు వేస్తున్నామని, ఈ మార్పుకు తమ అనుభవజ్ఞులైన ఇంజనీర్లే గుండెకాయ వంటివారని ఫోర్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కుమార్ గల్హోత్రా పేర్కొన్నారు.

ఈ విప్లవాత్మక మార్పులు కేవలం వాహన హార్డ్‌వేర్‌కే పరిమితం కాలేదు. సాఫ్ట్‌వేర్, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లై-చెయిన్ బృందాలు ఇప్పుడు మరింత సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. వాహనాలు కస్టమర్ల చేతికి వెళ్లకముందే సాఫ్ట్‌వేర్ విశ్వసనీయతను నిరంతరం పర్యవేక్షించేందుకు 40 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక ‘క్వాలిటీ అస్యూరెన్స్’ బృందాన్ని కూడా ఫోర్డ్ రంగంలోకి దించింది. అయితే, ఫోర్డ్ సంస్థ ఏఐ సాంకేతికతను పూర్తిగా పక్కన పెట్టడం లేదు. దానికి బదులుగా, అనుభవజ్ఞులైన ఇంజనీర్ల నుండి సేకరించిన విలువైన వాస్తవ సమాచారంతో ఏఐని మరింత తెలివైనదిగా మారుస్తోంది. వివిధ క్లిష్ట పరిస్థితులలో వాహన సాఫ్ట్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించడానికి 1,0,000కు పైగా కొత్త ‘ఏఐ-పవర్డ్ వాలిడేషన్ టెస్టులను’ అందుబాటులోకి తెచ్చింది. ఈ విధంగా మానవ అనుభవాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మేళవిస్తూ కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఫోర్డ్ దూసుకుపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *