తుంగభద్ర బృందగానం
Status of the Tungabhadra Project
కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద తుంగభద్ర నదిపై 75 సంవత్సరాల క్రితం నిర్మాణమైన కర్ణాటక తెలంగాణ ఉమ్మడి ఇరిగేషన్ ప్రాజెక్టు స్పిల్‌వే గేట్ల పునరుద్ధరణ ఉత్సవం సందర్భంగా గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో చర్చలు ఆ తదుపరి బహిరంగ సభలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆ ప్రాజెక్టు నుంచి నీటి వినియోగం విషయంలో ఏర్పడిన చిక్కులను పరిష్కరించగలిగితే తెలంగాణ రైతులకు మేలు జరుగుతుంది. దెబ్బతిన్న తుంగభద్ర 33 గేట్ల స్థానంలో రికార్డు సమయంలో నెలకొల్పిన కొత్త గేట్లు ప్రారంభోత్సవం పురస్కరించుకొని ముగ్గురు ముఖ్యమంత్రులు (డికె శివకుమార్, కర్ణాటక; ఎన్.చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్; రేవంత్ రెడ్డి, తెలంగాణ) కేంద్రమంత్రితో సమావేశమై తుంగభద్ర సమస్యలను చర్చించారు. పూడిక ప్రధాన సమస్య. ఆ కారణంగా ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గింది. పర్యవసానం తెలంగాణ వాటా 15.90 టిఎంసిల నీరు బదులు 5 టిఎంసిలే వస్తున్నది. అంతేగాక రాజోలిబండ నీటి మళ్లింపు పథకం వద్ద ఆంధ్ర రైతులు తూములు తెరిచి తెలంగాణకు రావలసిన నీటిని వాడుకుంటున్నారు. పూడికతీతకు నిర్ణయం జరిగినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కృష్ణా నదీ జలాల వినియోగంలో ఆంధ్ర తెలంగాణ మధ్య ఎడతెగని వివాదంలో ఆర్‌డిఎస్ ఒక ప్రధాన సమస్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగులు జలాల వినియోగానికై ముందుగా బనకచర్ల, ఆ తర్వాత నల్లమల్ల సాగర్ పథకాన్ని ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించటానికి ప్రధాన కారణం కృష్ణాజలాల్లో తెలంగాణ నికరవాటా తేలకపోవటమే. కాబట్టి ఉభయకుశలోపరి మాటలకు, ఆచరణకు మధ్య అగాధం కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో తుంగభద్ర ఆధునికీకరణపై కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో కర్ణాటకలో జరిగిన ముఖ్యమంత్రుల చర్చలు ఆహ్వానించదగినవి. తుంగభద్ర బేసిన్‌లోని రైతుల ప్రయోజనాలు కాపాడుతామని ముగ్గురు మంత్రులు ఏకాభిప్రాయం ప్రకటించారు. తుంగభద్రలో పేరుకుపోయిన పూడిక 33 టిఎంసి అడుగులు ఉంటుందని అంచనా. మేజర్ రిజర్వాయర్లలో పూడిక తీసే కేంద్ర ప్రభుత్వ విస్తృత ప్రణాళికలో భాగంగా ముందుకు తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడిక తొలగింపు చేబడతామని పాటిల్ హామిఇవ్వడం శుభసూచకం. ఈ కార్యక్రమం కింద కేంద్రం సాంకేతిక తోడ్పాటు అందిస్తుందని, మూడు రాష్ట్రాల భాగస్వామ్యంతో సాధ్యమైనంత త్వరగా పూడిక తొలగిస్తామని మంత్రి చెప్పారు. పూడిక తొలగిస్తే రిజర్వాయర్‌లో నీటి నిల్వ పెరిగి రాష్ట్రాలకు తమ వాటా నీరు లభించే అవకాశం మెరుగవుతుంది. అప్పుడు కర్ణాటకలో కాల్వల మరమ్మతులు, నిర్వహణ, ఆర్‌డిఎస్ వద్ద కర్నూల్ రైతుల ఘర్షణల నివారణపై దృష్టి పెట్టడం సునాయాసమవుతుంది.
ముఖ్యమంత్రుల మధ్య అవగాహనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ సాధించకుండానే ఏదో సాధించినట్లు సంబరపడుతున్నారని బిఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు ఆక్షేపించడంలో అర్థం లేదు. ఇష్టాగోష్టి సమావేశంలోనే సమస్యల పరిష్కారాన్ని ఎవరైనా ఊహించగలరా? అక్కడ వ్యక్తమైన శుభ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే చిత్తశుద్ధి అవసరం. పొరుగు రాష్ట్రాలతో వివాదాలకు బదులు పరిష్కారాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తుంగభద్ర జలాల పంపిణీ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. మూడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు కేంద్రం శాశ్వత పరిష్కారం సాధించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఈ సమస్య పరిష్కారంలో ఆరంభ అడుగు మాత్రమే. అదే సమయంలో రాజోలిబండ డైవర్షన్ పథకం ద్వారా తెలంగాణకు రావలసిన 15.9 టిఎంసిల్లో మూడవ వంతు మాత్రమే వస్తుండటాన్ని ముఖ్యమంత్రి కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. పర్యవసానంగా కరువు జిల్లా పాలమూరులో గద్వాల, అలంపూర్ తదితర ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న దురవస్థను, వలసలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బళ్ళారి, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల రైతుల ప్రయోజనాల రీత్యా పరిష్కారం కనుగొనేందుకు కలిసి పని చేద్దామని ముగ్గురు ముఖ్యమంత్రులు నిర్ణయించడం సంతోషించదగిన విషయమే అవుతుంది కదా!
అదే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన పథకంలో భాగంగా గోదావరి నదుల అనుసంధానం అవసరాన్ని వక్కాణించారు. కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో దుర్భిక్షం వంటి సమస్యలకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య కెన్ సంధానం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య పర్భతి చంబల్ సంధాన ప్రాజెక్టులు అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. అదేవిధంగా దక్షిణ భారత్‌లో గోదావరి అనుసంధానానికి జాతీయ దృక్పథం పాటించాలన్నారు. రాష్ట్రాల నీటి ప్రయోజనాలు, హక్కులను కాపాడుతూ నదుల సంధానం అమలు చేయడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. నీటి వివాదాలు తెలంగాణ మధ్యనే గాక కర్ణాటక మధ్య కూడా ఉన్నాయి. కాబట్టి ఆ వివాదాల పరిష్కారానికి కూడా నదుల అనుసంధాన ప్రక్రియ తోడ్పడుతుంది. అందువల్ల వివాదాలకు బదులు సామరస్యం, ప్రయోజనాల పట్ల పరస్పర అవగాహన, సర్దుబాటు వైఖరి ప్రదర్శిస్తే పరిష్కారాలు అసాధ్యం కాబోవు.